Chia Seeds: ఉదయం లేచిన వెంటనే చియా సీడ్ వాటర్ తాగడం, వర్కౌట్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, వెల్‌నెస్ పేజీల్లో ఎక్కువగా కనిపించే ట్రెండ్‌గా మారింది. ఇది నిజంగానే అంత ఉపయోగకరమా? అనేది ఇక్కడ తెలుసుకుందాం..
చియా గింజలు చిన్నవైనా, శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలతో నిండి ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు ఇవి జెల్లీలా మారి జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు, హైడ్రేషన్ ఇచ్చి రోజంతా ఎనర్జీని నిలుపుతాయి. నిపుణులు ఉదయం చియా వాటర్‌తో రోజు మొదలు పెట్టడం వలన మెటబాలిజం మెరుగుపడి, బరువు నియంత్రణ, హృదయ ఆరోగ్యానికి మంచి మద్దతు లభిస్తుందని చెబుతున్నారు.
చియా వాటర్‌ను ఉదయాన్నే ఎందుకు తాగాలంటే దీనిలో ఉన్న ఫైబర్ కోసం. చియా గింజల్లో అధికంగా ఉండే సాల్యుబుల్ ఫైబర్ మన ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. నీటిలో నానినప్పుడు ఏర్పడే జెల్ ఆకృతి జీర్ణక్రియను సాఫీగా నడిపిస్తుంది, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. డైటిషియన్ చెప్పిన దాని ప్రకారం, ఫైబర్ ఎక్కువ సేపు పొట్ట నిండిన భావన కలిగించడంతో అవసరంలేని ఆకలి, అతి తినడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరానికి ఎనర్జీని నెమ్మదిగా విడుదల చేస్తుంది. అందువల్ల మధ్యాహ్నం వరకు అలసట లేకుండా చురుకుగా ఉండగలుగుతారు.
చియా సీడ్స్ మరో ముఖ్యమైన లక్షణం వీటి ప్రోటీన్ విలువ. 100 గ్రాముల చియా సీడ్స్‌లో దాదాపు 16.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని USDA చెప్పింది. ఇది శరీరానికి కావాల్సిన శాకాహార ప్రోటీన్‌గా పనిచేసి కండరాల పెరుగుదలకు, మెటబాలిజం మెరుగుపడటానికి, ఆకలి నియంత్రణకు సాయం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిది. మెటబాలిజాన్ని పెంచే సాదాసీదా మార్గాల్లో చియా వాటర్ కూడా ఒకటి. జీర్ణక్రియ సక్రమం అవ్వడంతో పాటు పోషకాలు నెమ్మదిగా విడుదల కావడం వలన శరీరం కేలరీలను సమర్థవంతంగా ఖర్చు చేస్తుంది. దీన్ని అలవాటుగా మార్చుకుంటే శక్తి స్థాయిలు పెరిగి బరువు నియంత్రణ సహజంగా జరుగుతుంది.
అలాగే, జిమ్‌కు వెళ్లే వారు ఈ డ్రింక్‌ను సహజ ప్రీ-వర్కౌట్‌గా కూడా తీసుకోవచ్చు. ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుల సమతుల్యత వలన దీర్ఘకాలిక ఎనర్జీ లభిస్తుంది. చియా వాటర్ తాగితే శరీరం బరువుగా అనిపించకుండా మంచి స్టామినాతో వర్కౌట్ చేయేందుకు సహకరిస్తుంది. వ్యాయామం ముందు ఒక గ్లాస్ చియా వాటర్ తీసుకోవడం వలన శక్తిని పెంచడమే కాక ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకూ దోహదపడుతుంది.
