Eating Habits In Children: పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కీలకం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, చిన్నతనంలో సరైన పోషణ ఎదుగుదల, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి కోసం ఎంతో అవసరం. అయితే, ప్రాసెస్డ్ మరియు అనారోగ్యకరమైన ఆహారాల అందుబాటు పెరిగిన కారణంగా, పిల్లలు సమతుల ఆహారం తీసుకునేలా చేయడం చాలా మంది తల్లిదండ్రులకు సవాలుగా మారింది. చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు ఎంపికలు చేసుకునేలా ప్రోత్సహించడం జీవితాంతం మేలైన ఆరోగ్యాన్ని కలిగించేందుకు సహాయపడుతుంది.
పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంపొందించే మార్గాలు
1. మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు
పిల్లలు తల్లిదండ్రుల అలవాట్లను అనుకరిస్తారు. మీరు పండ్లు, కూరగాయలు, గింజలు తినడం చూసినప్పుడు, వారు కూడా అవి తినడానికి ఆసక్తి చూపుతారు.
2. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచండి
పండ్లు, గింజలు, పెరుగు వంటి ఆరోగ్యకరమైన లభించేలా ఉంచండి. శరీరానికి పుష్కలంగా పోషకాలు అందించే నీరు, పాలు లేదా తాజా రసాలను ఇచ్చి, కృత్రిమ షుగర్ పానీయాల వినియోగాన్ని తగ్గించండి.
3. మార్కెట్‌కు తీసుకెళ్లండి
Eating Habits In Children మీరు మార్కెట్‌కి వెళ్లి కూరగాయలను తెచ్చుకునేమాటైతే పిల్లల్ని కూడా తీసుకెళ్లండి. రకరకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను సెలెక్ట్ చేయమనండి. వాళ్లకి ఇది ఒక మంచి టాస్క్‌లా మారుతుంది. లేదా వంట పనుల్లో సహాయం చేయడం ద్వారా ఆహారం గురించి ఆసక్తిని పెంచుకోవచ్చు.
4. పోషకాహారంపై అవగాహన కల్పించండి
వివిధ ఆహార పదార్థాలు శరీరానికి ఎలా ఉపయోగపడతాయో వారికి వివరించండి. ఉదాహరణకు, కాల్షియం ఎముకల బలాన్ని పెంచుతుందని లేదా విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెప్పండి. అవి ఎందులో పుష్కలంగా ఉంటాయో కనుక్కుని చెప్పమని చెప్పండి. వాళ్లకి ఇదొక అధ్యయనంలా ఉపయోగపడుతుంది.
5. రంగులతో ఇంట్రెస్టింగ్‌గా
పండ్లు, కూరగాయలు, గింజలతో రంగులమయమైన ఆహారం పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది పోషక విలువలను అందించడమే కాకుండా, వారి ఆసక్తిని కూడా పెంచుతుంది.
6. నియమితమైన భోజన సమయాలు పాటించండి
నియమితమైన భోజన, స్నాక్స్ సమయాలు అమలు చేయడం వల్ల ఆకలిని నియంత్రించుకోవచ్చు. ఇది అధికంగా తినడాన్ని తగ్గించడంతో పాటు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
7. ప్రాసెస్డ్ ఆహారం, చక్కెర వద్దు
చిప్స్, కుకీలు, శీతలపానీయాలు వంటి ప్రాసెస్డ్ ఆహారాలను క్రమంగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో మార్చండి. అసలు ఇప్పుడు ఇలాంటి ఆహారాలు వారి కంట పడకపోవడమే మంచిది.
8. ఆరోగ్యకరమైన భోజన వాతావరణం సృష్టించండి
భోజనం సమయంలో టీవీ, మొబైల్ వంటి డిజిటల్ గాడ్జెట్లు ఉపయోగించకుండా, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ భోజనం చేసే అలవాటు ప్రోత్సహించండి.
9. బలవంతంగా వద్దు
పిల్లలను బలవంతంగా తినిపించకండి. వారు ఆకలిని గుర్తించేలా, శరీర సంకేతాలను అర్థం చేసుకునేలా చేయండి.
10. ఓర్పుగా ఉండండి
కొత్త ఆహారాలను తినడానికి పిల్లలు కొంత సమయం తీసుకోవచ్చు. వారిపై ఒత్తిడి లేకుండా, క్రమంగా ఆహారాన్ని పరిచయం చేయండి.
11. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించండి
ఆహారంతో పాటు శారీరక శ్రమను కూడా ప్రోత్సహించండి. కుటుంబంగా కలిసి నడకలు, క్రీడలు లేదా ఇతర శారీరక కార్యకలాపాలలో పాల్గొనండి.
పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అభివృద్ధి చేయడం చిన్న విషయం కాదు. ఓపిక, స్థిరత్వం, సృజనాత్మకత ఎంతో అవసరం. సమతుల ఆహారం అందించడం, పోషకాహారం గురించి తెలియజేయడం, ఆరోగ్యకరమైన భోజన వాతావరణాన్ని సృష్టించడం వల్ల దీర్ఘకాలంగా మంచిది. చిన్నతనంలో సరైన పోషణ కలిగిన పిల్లలు ఆరోగ్యకరమైన, శక్తివంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు.