Korean Skin Care: ఈ మధ్యకాలంలో అందం విషయంలో తరచూ వినిపిస్తున్న పదం కొరియన్ స్కిన్ కేర్. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా దీనిని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ కొరియన్ స్కిన్ కేర్ అలియాస్ K-బ్యూటీ శాస్త్రీయంగా నిరూపితమైన పదార్థాలపై దృష్టి పెట్టే మల్టీ-స్టెప్ స్కిన్‌కేర్ రొటీన్. ఈ కొరియన్ స్కిన్ కేర్ యవ్వనమైన, తేమతో నిండిన చర్మాన్ని ఉంచడానికి సహాయపడుతుంది. ఈ రొటీన్‌లో క్లెన్సింగ్, ఎక్స్‌ఫోలియేషన్, టోనింగ్, సీరమ్‌ల లేయరింగ్, లోతైన హైడ్రేషన్, సన్ ప్రొటెక్షన్ వంటి స్టెప్స్ ఉంటాయి. ఇలాంటి స్కిన్నే “గ్లాస్ స్కిన్” అంటారు. అంటే అద్దంలా పారదర్శకంగా, మృదువుగా, కాంతివంతంగా ఉండే చర్మం అని అర్థం. ఇది తేమ నిల్వను మెరుగుపరచడం, చర్మంపై డెడ్ సెల్స్‌ను తీసేసి రిపేర్ చేయడం, నియమితమైన స్కిన్‌కేర్ అలవాట్లను పాటించడం ద్వారా సాధ్యమవుతుంది. హైలురానిక్ యాసిడ్, నత్త నుంచి తీసిన సీరం, ప్రొపోలిస్, రైస్ వాటర్, ఫెర్మెంటెడ్ పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఈ కొరియన్ స్కిన్‌ను పొందవచ్చు. మీరు కూడా గ్లాస్ స్కిన్‌ను పొందడానికి ఉపయోగపడే కొరియన్ స్కిన్‌కేర్ చిట్కాలను తెలుసుకోండి!
డబుల్ క్లెన్సింగ్
డబుల్ క్లెన్సింగ్ పద్ధతిలో ముందుగా ఆయిల్-బేస్డ్ క్లీన్జర్‌ను ఉపయోగించి మేకప్, సన్‌స్క్రీన్, చెమటను పూర్తిగా తొలగించుకుని ఆ తర్వాత వాటర్-బేస్డ్ క్లెన్సర్‌తో మిగిలిన మురికి, డెడ్ సెల్స్‌ను తొలగించాల్సి ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరచి, ఇతర స్కిన్‌కేర్ ఉత్పత్తులు చక్కగా గ్రహించుకోగలుగుతుంది.
ఎక్స్‌ఫోలియేషన్
K-బ్యూటీ స్కిన్ కేర్ అంటే కఠినమైన స్క్రబ్స్‌ని కాకుండా, మృదువైన ఎక్స్‌ఫోలియేషన్‌ను ఫాలో అవుతుంది. AHA, BHA, PHA లాంటి కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారేలా చేస్తాయి. వారానికి 2-3 సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయడం ద్వారా ముఖం ఈవెన్‌గా ఉండేలా చేస్తుంది. కానీ ఎక్స్‌ఫోలియేట్ చేసే సమయంలో బర బరా రుద్దేయకండి. చాలా నెమ్మదిగా ఈ ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది.
హైడ్రేటింగ్ టోనర్
కొరియన్ టోనర్‌లు కేవలం శుభ్రపరిచేందుకే కాకుండా, తేమను భద్రపరచడానికి కూడా ఉపయోగపడతాయి. బిర్చ్ సాప్, గ్రీన్ టీ, లేదా హైలురానిక్ యాసిడ్‌తో తయారైన టోనర్‌లు చర్మానికి లోతుగా తేమను అందిస్తాయి. “7-స్కిన్ మెథడ్”లో టోనర్‌ను వరుసగా 7 సార్లు అప్లై చేయడం వల్ల మరింత హైడ్రేషన్ అందుతుంది.
సీరమ్ లేయరింగ్
Korean Skin Care ఎక్కువ మాయిశ్చరైజర్‌కు బదులుగా, తేలికపాటి ఎసెన్స్‌లు, సీరమ్‌లను చర్మంపై పొరలుగా అప్లై చేయడమే K-బ్యూటీ రహస్యం. నత్త మ్యూసిన్, జిన్సెంగ్, ప్రొపోలిస్, సెంటెల్లా ఆసియాటికా వంటి పదార్థాలు చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చుతాయి. వీటిలో ఏ ఒక్క పదార్థంతో తయారుచేసిన సీరమ్ మీ దగ్గర ఉన్నా అది సరిపోతుంది.
మాయిశ్చరైజర్
హైడ్రేషన్‌ను లాక్ చేయడానికి తేలికపాటి కానీ కాస్త గాఢత ఎక్కువగా ఉండే మాయిశ్చరైజర్ అవసరం. కొరియన్ మాయిశ్చరైజర్‌లలో సిరమైడ్స్, హైలురానిక్ యాసిడ్, స్క్వాలేన్ ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమతో నింపి మృదువుగా, బబ్లీగా ఉంచుతాయి.
షీట్ మాస్క్
కొరియన్ స్కిన్‌కేర్‌లో ముఖ్యమైనదిగా పరిగణించే షీట్ మాస్క్‌లు తక్షణ తేమను అందిస్తాయి. నయాసినమైడ్, తేనె, లేదా బియ్యం ఎక్స్‌ట్రాక్ట్‌తో మాస్క్‌లు చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. వారానికి 2-3 సార్లు షీట్ మాస్క్ వాడితే గ్లాస్ స్కిన్ గ్లో పొందవచ్చు.
సన్ ప్రొటెక్షన్ తప్పనిసరి
సన్‌స్క్రీన్ అనేది K-బ్యూటీ రొటీన్‌లో అత్యంత ముఖ్యమైన దశ. ప్రతి రోజు SPF ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ వాడడం వల్ల చర్మం వృద్ధాప్యం, మచ్చలు, పొడిబారడం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. కొరియన్ సన్‌స్క్రీన్‌లు తేలికపాటి, నాన్-గ్రీసీ, స్కిన్‌కేర్ ప్రయోజనాలతో నిండినవి. ఇవి చర్మాన్ని మెరిసేలా ఉంచుతాయి.
అయితే.. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ ప్రక్రియ అందరూ పాటించాలి కానీ..అందరికీ ఒకే రకమైన ప్రొడక్ట్స్ వర్తిస్తాయని చెప్పలేం. అందుకే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి మీకు సరిపడే ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి.