Can Organs Grow Back: మన శరీరం 37 ట్రిలియన్ కంటే ఎక్కువ కణాలతో తయారవుతుంది. ప్రతి కణానికి ఒక పరిమిత లైఫ్ ఉంటుంది. అవి నిరంతరం పునరుత్పత్తి అవుతూ అవయవాల పనితీరును కాపాడేందుకు సహాయపడతాయి. అయితే.. కాలక్రమేణా అవి దెబ్బతిన్నప్పుడు, కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీని వల్ల కొన్ని కేసుల్లో అవయవాలు కూడా విఫలం అయ్యే అవకాశాలు ఉంటాయట. అవయవాల పునరుత్పత్తి అనేది మన శరీరంలో ఒక మహత్తరమైన విషయం. ఇది స్టెమ్ సెల్స్ పై ఆధారపడినా, అవి పరిమిత సంఖ్యలో ఉండటం, నెమ్మదిగా విభజించుకోవడం వల్ల అవయవ పునరుద్ధరణకు వీలుకాదు. అన్ని రకాల కణాలను తిరిగి తయారు చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
అయితే, కొందరు వ్యక్తులలో అవయవాలు మళ్లీ రీజనరేట్ అవడం కనిపిస్తుంది. ఉదాహరణకు.. మిచిగన్‌కి చెందిన కేటీ గోల్డెన్ అనే యువతి తనకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు టాన్సిల్స్‌ని తొలగించుకున్నారు. కానీ 40 ఏళ్ల తర్వాత అవి మళ్లీ వచ్చాయి. నిజానికి ఇలా జరగడం చాలా అరుదు. టాన్సిల్‌ను తొలగించే సమయంలో దానికి సంబంధించిన కణం ఉండిపోతే అది మళ్లీ పెరుగుతుంది. టాన్సిల్స్ మాదిరిగానే మన శరీరంలో మళ్లీ పుట్టుకొచ్చే అవయవాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
కాలేయం (Liver)
కాలేయం చాలా మంది వినే అవయవ పునరుత్పత్తి ఉదాహరణ. 10% మాత్రమే మిగిలినా, అది పూర్తిగా తిరిగి పెరిగి ఒక సమర్థవంతమైన కాలేయంగా మారుతుంది. ఇదే విధంగా, కాలేయ దానం (liver donation) చేసిన వారిలోనూ మిగిలిన భాగం మళ్లీ పెరిగి పూర్తిగా పని చేసే స్థాయికి చేరుకుంటుంది.
ప్లీహం (Spleen)
ప్లీహం అనేది శరీరంలోని అత్యంత సెన్సిటివ్ అవయవం. ఎందుకంటే ఇది రక్త నాళాలతో నిండి ఉంటుంది. ఒకసారి దెబ్బతింటే, ఎక్కువగా రక్తస్రావం జరిగి ప్రాణానికి ప్రమాదం కలిగించవచ్చు. కానీ, కొన్ని సందర్భాల్లో ప్లీహం చిన్న ముక్కలు శరీరంలో వేరే ప్రదేశంలో స్థిరపడి మళ్లీ పెరుగుతాయి. దీనిని స్ప్లీనోసిస్ (Splenosis) అంటారు. ప్లీహం తొలగించిన 66% మంది రోగుల్లో ఇలా మళ్లీ పెరిగినట్లు నివేదికలు ఉన్నాయి.
ఊపిరితిత్తులు (Lungs)
గత కొన్ని సంవత్సరాల్లో ఊపిరితిత్తులకు పునరుత్పత్తి శక్తి ఉందని గుర్తించారు. ధూమపానం (smoking) వల్ల ఊపిరితిత్తులలోని అల్వియోలీ (alveoli) నాశనమవుతుంది. కానీ, పొగ తాగడం మానేసిన తర్వాత, కొన్ని ఆరోగ్యకరమైన కణాలు తిరిగి పెరిగి కొత్తగా ఊపిరితిత్తులను పునరుద్ధరిస్తాయి. మరొక ఊపిరితిత్తి తీసివేస్తే, మిగిలిన ఊపిరితిత్తి కొత్త అల్వియోలీ పెంచుకుని శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందించేలా మారుతుంది.
చర్మం (Skin)
Can Organs Grow Back చర్మం అనేది శరీరంలో అతి పెద్ద అవయవం. ఇది ప్రతి రోజూ 500 మిలియన్ కణాలు నష్టపోతుంది. అంటే, రోజుకు 2 గ్రాముల చర్మ కణాలు పోతాయి. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి చర్మం నిరంతరం పునరుత్పత్తి చెందుతూనే ఉంటుంది.
గర్భాశయం (Uterus)
స్త్రీల గర్భాశయానికి అత్యంత క్రియాశీలమైన పునరుత్పత్తి సామర్థ్యం ఉంటుంది. ప్రతి 28 రోజులకు ఒకసారి గర్భాశయపు ఎండోమెట్రియల్ లైనింగ్ (Endometrial lining) తొలగిపోతూ, తిరిగి కొత్తగా పెరుగుతుంది. స్త్రీ జీవితంలో సగటున 450 సార్లు ఇది పునరుత్పత్తి అవుతుంది.
పురుషాంగం (Male Reproductive System)
వాసెక్టమీ (Vasectomy) శస్త్రచికిత్స ద్వారా పురుషుల్లో వీర్యనాళాన్ని (vas deferens) తొలగిస్తారు. కానీ, కొన్ని సందర్భాల్లో తొలగించిన నాళాలు మళ్లీ పెరిగి అనుబంధమవుతాయి. దీని వల్ల అనుకోకుండా మగవారు స్త్రీలతో కలిసినప్పుడు వారికి గర్భధారణ జరగొచ్చు.
ఎముకలు (Bones)
ఎముకలు విరిగినప్పుడు, అవి 6-8 వారాలలో మళ్లీ అతుక్కుపోతాయి. కానీ, పూర్తి పునరుత్పత్తి సంవత్సరాల పాటు కొనసాగుతుంది. వయస్సు పెరిగే కొద్దీ, ముఖ్యంగా మెనోపాజ్ (menopause) వచ్చిన తర్వాత, ఎముకల పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది.
శరీరంలో జతగా ఉండే అవయవాల్లో ఒకటి తీసివేసినప్పుడు, మిగిలిన అవయవం ఎక్కువ పని చేస్తుంది. ఉదాహరణకు, ఒక కిడ్నీ తీసివేస్తే, మిగిలిన కిడ్నీ మొత్తం శరీర అవసరాలను తీర్చగలుగుతుంది.