Pimple Patch: మొటిమలు.. ఇది ఆడవాళ్లకే కాదు మగవారికి కూడా బద్ధ శత్రువు. ఒక్క పింపుల్ వస్తే చాలు జీవితం అంధకారంలోకి వెళ్లిపోయినట్లు ఫీలైపోతుంటారు. ముఖ్యంగా ఆడవారికి రుతుక్రమానికి ముందు కానీ తర్వాత కానీ కచ్చితంగా వస్తాయి. మగవారిలో కూడా సిస్టిక్, యాక్టివ్ యాక్నే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలకు ముందు వరకు మొటిమలు వస్తే పసుపు రాయడం.. లేదా వాటికి తగ్గ మందులు పూయడం వంటివి అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మొటిమలను రాత్రికి రాత్రే తగ్గించేసే ప్యాచెస్ వస్తున్నాయి. వాటినే పింపుల్ ప్యాచెస్ అంటారు. ఈ పింపుల్ ప్యాచెస్‌కి చాలా పాపులారిటీ వచ్చేసింది. భారీ స్థాయిలో సేల్స్ జరుగుతున్నాయి. పింపుల్ ప్యాచెస్ అనేవి యాక్టివ్ యాక్నే (మొటిమలు) ను త్వరగా తగ్గించేందుకు ఓ సులభమైన పరిష్కారం. ఇవి చిన్న అతుకులు (అడ్హీసివ్ డ్రెస్సింగ్స్) లా ఉండి, మొటిమలపై నేరుగా అతికించేలా తయారు చేసారు. అయితే ఈ ప్యాచెస్ మంచివేనా? అందరూ వాడచ్చా? నిజంగానే మొటిమలు తగ్గిపోతాయా? తెలుసుకుందాం.
హైడ్రోకోలాయిడ్ ప్యాచెస్
Pimple Patch ఇది ఒక రకమైన ప్యాచ్. చర్మంపై తేమను నిల్వ ఉంచే ప్రత్యేక పదార్థంతో తయారు చేయబడతాయి. ఇవి మొటిమల నుంచి మురికి, చీము (pus) ను త్వరగా తగ్గించడంలో సహాయపడతాయి. పైపై మొటిమలు, వైట్‌హెడ్స్ వంటి వాటికి ఇవి బాగా పని చేస్తాయి. ఇవి రక్షణ కవచంగా పనిచేసి, దుమ్ము, ఇతర కలుషిత పదార్థాలు చర్మాన్ని ప్రభావితం చేయకుండా అడ్డుకుంటాయి.
మెడికేటెడ్ ప్యాచెస్
ఇవి రెండో రకమైన ప్యాచెస్. ఇవి హైడ్రోకోలాయిడ్ టెక్నాలజీతో పాటు యాక్నీను తగ్గించే మెడికల్ పదార్థాలను కలిగి ఉంటాయి. సాలిసిలిక్ యాసిడ్ (Salicylic Acid) ఒక బీటా హైడ్రాక్సీ యాసిడ్ (BHA) కాబట్టి చర్మపు రంధ్రాలను శుభ్రపరిచి, అదనపు నూనెను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. అందుకే సాలిసిలిక్ యాసిడ్‌ను ఈ ప్యాచెస్‌లో ఉపయోగిస్తారు.
టీ ట్రీ ఆయిల్ (Tea Tree Oil) – యాక్నేని కలిగించే బాక్టీరియాను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇవి వాపు తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇవి కొంత ఇర్రిటేషన్ కలిగించే అవకాశం ఉంది.
పింపుల్ ప్యాచెస్ ఉపయోగాలు
రక్షణ (ప్రొటెక్షన్)
మొటిమలపై కవచంగా పనిచేసి, వాటిని తాకడం, నొక్కడం, గోకడం వంటి అలవాట్లను అరికడుతుంది. దీని వల్ల మొటిమలు మరింత ఎక్కువ కావడం లేదా మచ్చలు మిగిలిపోవడం వంటి సమస్యలు నివారించబడతాయి.
మురికిని తొలగించడం
హైడ్రోకోలాయిడ్ ప్యాచెస్ చర్మంపై చీమును (pus), మురికిని తొలగించి, మొటిమ త్వరగా తగ్గేందుకు సహాయపడతాయి.
ఆకర్షణీయమైన లుక్స్
ఇవి పలుచగా, పారదర్శకంగా ఉండేలా రూపొందించబడ్డాయి. అందువల్ల, బయటకు వెళ్లే సమయంలో కూడా అవి స్పష్టంగా కనిపించవు.
పింపుల్ ప్యాచెస్ పరిమితులు
లోతైన మొటిమలకు (డీప్ యాక్నే) ఎక్కువగా పని చేయవు
ఇవి ప్రధానంగా పైకి కనబడే మొటిమలకు మాత్రమే పనిచేస్తాయి.
సిస్టిక్ యాక్నే (Cystic Acne) లేదా నోడ్యూల్ యాక్నే (Nodular Acne) వంటి లోతైన మొటిమలకు ఇవి ఫలితం ఇవ్వవు.
యాక్నేని నిరోధించలేవు
ఇవి కొత్తగా మొటిమలు రాకుండా నిరోధించలేవు.
ఇవి కేవలం యాక్నేని తగ్గించేందుకు మాత్రమే పనిచేస్తాయి.
పింపుల్ ప్యాచెస్ వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాలిసిలిక్ యాసిడ్ వంటి పదార్థాలు కొంతమందికి ఇర్రిటేషన్ కలిగించవచ్చు.
చర్మం ఎర్రబడడం, పొడిబారడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వాడటం ఆపేయాలి.
చర్మం పూర్తిగా శుభ్రంగా, పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ప్యాచ్ అతికించాలి. అలా చేయకపోతే, అది సరైన రీతిలో అతుకకపోవచ్చు.
తీవ్ర యాక్నే ఉన్నవారు డాక్టర్‌ని సంప్రదించాలి
హైడ్రోకోలాయిడ్ లేదా మెడికేటెడ్ ప్యాచెస్ తేలికపాటి యాక్నే కోసం మాత్రమే పని చేస్తాయి.
విపరీతమైన యాక్నే సమస్య ఉంటే, డెర్మటాలజిస్ట్ సూచన తీసుకోవడం మంచిది.