Swetcha Effect: ‘స్వేచ్ఛ’ ఈ పేపర్ లేదా వెబ్ సైట్‌లో ప్రజా సమస్యలపై వార్త వచ్చిందంటే చాలు గంటలు, రోజుల్లోనే పరిష్కార మార్గం దొరుకుతోంది. అందుకే తెలంగాణ ప్రజల మన్ననలు పొందుతూ ఎలాంటి వార్తనైనా సరే ధైర్యంగా ప్రచురించడానికి ముందడుగు వేస్తున్నది. ఇప్పటి వరకూ ప్రజా సమస్యలపై ‘స్వేచ్ఛ’లో వచ్చిన వార్తలన్నింటికీ ప్రభుత్వ యంత్రాంగం పరిష్కారం చూపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శనివారం ‘స్వేచ్ఛ’ డైలీలో ‘అభివృద్ధి అంటే ఇదేనా?’ తూతూ మంత్రంగా కాలువల పూడికతీత పనులు అంటూ ప్రచురించిన కథనం భద్రాద్రి కొత్తగూడెంలో పెను సంచలనం సృష్టించింది. దీంతో దెబ్బకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి దగ్గరుండి మరీ పనులు చేయించారు. ఈ వ్యవహారంపై సామాజిక సేవకులు, ప్రముఖ న్యాయవాది కర్నే రవి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అన్యాయాన్ని ప్రశ్నించడం వారిని బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. మణుగూరు మండలంలో కోడిపుంజుల వాగు, కట్ట వాగు, మెట్ట వాగు అభివృద్ధి పనుల్లో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. కాంట్రాక్టుల అవినీతితో రూ.లక్షలు ప్రజాధనం పక్కదారి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also- Sleeping Prince: సౌదీ ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ కన్నుమూత.. 2005లో ఏం జరిగింది?
నాణ్యత ఏదీ..?
అధికార పార్టీకి చెందిన బినామీ కాంట్రాక్టర్లు వాగులపై పూడికతీత పనులు నాణ్యత లోపంతో నిర్మించడం వలన అభివృద్ధి పనులు మట్టిపాలవుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లు కొంతమంది, అధికార పార్టీ నాయకులు ప్రజాధనాన్ని జేబులు నింపుకోవడానికి అభివృద్ధి పనుల పేరిట కాంట్రాక్టు పనులను దక్కించుకొని అష్ట వంకరలతో పనులు చేస్తూ దిగమింగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు నాణ్యత లోపంతో చేసిన పనులన్నీ మూడు నాళ్ల ముచ్చటగానే మారాయని, ప్రధాన రహదారిపై కట్టవాగులను పరిశీలిస్తే అభివృద్ధి ఏంటో అర్థం అవుతుందని గుర్తు చేశారు. చెత్త చెదారమే మీరు చేసిన అభివృద్ధి అని మళ్లీ ప్రశ్నించారు. ‘స్వేచ్ఛ’లో వచ్చిన వార్త కథనాన్ని చూసిన తర్వాత హడావుడిగా మళ్లీ జేసీబీలతో కూడిక తీసే పనులను ఎలా చేపట్టారని ప్రశ్నించారు.
ప్రశ్నించొద్దా?
బినామీ కాంట్రాక్టర్ల పనితీరును అంబేద్కర్ సాక్షిగా బహిరంగంగా నిరూపించేందుకు తాను సిద్ధమని, స్థానిక ఎమ్మెల్యే గానీ.. ఆయన అనుచరులు కానీ చర్చలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులను సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నా నాయకులు నేడు ఉన్నత పదవులను పొందుతున్నారని విషయాన్ని గమనించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కర్నే రవి హెచ్చరించారు. అధికార పార్టీ నాయకులు బెదిరింపులతో దౌర్జన్యానికి దిగడం ఏంటని.. వారి తాటాకు చెప్పులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు వత్తాసు పలికితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ప్రజా క్షేమాన్ని, అభివృద్ధిని మరిచిన ఎందరో పాలకులు మట్టి కరిచారని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ల అవినీతిపై తెలంగాణ సీఎస్‌కు, మానవహక్కుల సంఘం, అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని రవి వెల్లడించారు.
Read Also- Heavy Rains: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. రెండ్రోజులు జర జాగ్రత్త