AP Politics: మంత్రి నారా లోకేష్ ‘సకల శాఖల మంత్రి’గా కొత్త అవతారం ఎత్తారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు సంబంధం లేని మంత్రిత్వ శాఖల్లో లోకేష్ తలదూర్చి అన్నీ తానై వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. శనివారం అనంతపురం నగరంలోని పార్టీ కార్యాలయంలో శ్యామల మీడియాతో మాట్లాడారు. ‘రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్ష్యాలు.. అబద్ధపు స్టేట్మెంట్స్‌తో ఈ ఇద్దరిని అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇద్దరినీ అరెస్టు చేశారు. సోలార్ ప్రాజెక్టులను ఏపీలో విస్తారంగా తెచ్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే. నాటి ముఖ్యమంత్రి జగన్ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. జగన్ పాలనలో రూ.22 వేల కోట్లు విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగానే రెన్యూ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టింది. వీటిని తానే సాధించినట్లుగా లోకేష్ చెప్పుకుంటూ నిన్న అనంతపురంలో రెన్యూ ప్రాజెక్టుకు భూమి పూజ చేయడం విడ్డూరంగా ఉంది. ప్రజల సమస్యలను మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడం లేదు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చంద్రబాబు, లోకేష్ ఎందుకు ఆపేశారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు? ప్రభుత్వ వసతి గృహంలో అమ్మాయిలకు ఎలుకలు కొరికినా స్పందించలేదు. రెండు రోజుల అనంత పర్యటనలో లోకేష్ సాధించింది శూన్యం’ అని శ్యామల విమర్శలు గుప్పించారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..
చంద్రబాబుకు పాలన చేతకాక, హామీలు అమల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం విశాఖలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. హామీల అమలు విషయంలో అన్నివర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకపోయినా మద్యం స్కామ్ జరిగినట్టు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించారని.. ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి, మద్యం షాపులు తగ్గించి, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరమని కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ డిస్టిలరీలన్నీ చంద్రబాబు తెచ్చినవే..
ఏపీలో నాడు, నేడు ఉన్న దాదాపు డిస్టిలరీలు అన్నింటికీ చంద్రబాబే అనుమతులిచ్చారనే విషయాన్ని కళ్యాణి గుర్తు చేశారు. గత వైసీపీ పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. ‘ వైసీపీ పాలనలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టింది. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. వీధివీధినా బెల్ట్ షాపులు తెరిచి 24 గంటలూ ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కామ్, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్దం కావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్‌లనే కాకుండా పారిశ్రామికవేత్తలను కూడా బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అరాచక పాలనతో ఎంతోకాలం ప్రజాచైతన్యాన్ని అడ్డుకోలేరు. రాబోయే రోజుల్లో వైసీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెబుతాం’ అని కళ్యాణి హెచ్చరించారు.