MLC kavitha latest news(Political news today telangana): జైలు జీవితం ఎవరికైనా దుర్భరమే. అప్పటివరకు అయినవారితో కలిసి ఉంటూ.. అనుకున్న జీవితాన్ని జీవిస్తూ ఉండగా.. ఉన్నపళంగా ఊచల వెనక్కి వెళ్లడం ఎవరినైనా కుంగదీస్తుంది. అప్పటి వరకు ఉన్న గౌరవం, సదుపాయాలు, అనుబంధాలన్నీ దూరమై మానసిక గందరగోళంలోకి జారిపోతారు. కొందరు రోజుల వ్యవధిలోనే డిప్రెషన్‌లోకి కూడా వెళ్లుతారు. కొందరు ఏళ్లు గడిచినా మానసికంగా దృఢంగానే ఉంటారు. సాధారణంగా ఒక వ్యక్తి జైలుపాలైనప్పుడు వారు గురయ్యే మానసిక పరిస్థితులను మానసిక నిపుణులు మూడు దశలుగా విభజిస్తారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనతికాలంలోనే అశేష అభిమానాన్ని సంపాదించుకున్న నాయకురాలు. బలమైన వాదనను వినిపించే మహిళ నేతగా ఉన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా నిత్యం ప్రజల్లో తిరిగారు. ఆమె లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఉన్నారు. కోర్టుల్లోనూ ఆమెకు వరుస ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. కోర్టు ఆమెకు రిమాండ్ పొడిగించిన రోజు న్యాయమూర్తిని ఉద్దేశిస్తూ రాసిన నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉన్నదా? అనే చర్చ జరుగుతున్నది.
Also Read: మూడో విడత ఎన్నికలకు ఈసీ గెజిట్.. రేపటి నుంచి నామినేషన్లు
సాధారణంగా ఒక వ్యక్తి జైలుకు వెళ్లినప్పుడు వెంటనే అక్కడి నుంచి బయటపడేది ఎలా? అనేది ఆలోచిస్తారు. తమకు ఉన్న పరిచయాలు, న్యాయమార్గాలు, అధికారం, ఇతర మార్గాలను అన్వేషిస్తారు. ఇది ప్రొటెక్టివ్ మెకానిజం దశలోకి వస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఈ ఫేజ్‌ను దాటారు. రెండో ఫేజ్‌లో వారిలో మానసిక మార్పులు వస్తాయి. తాము నిర్దోషులను నిరూపించుకోవడానికి అవకాశాలు ఇవ్వాలని కోరుతుంటారు. వాస్తవానికి వాటితో ఫలితాలు ఉండకున్నా ఓ ప్రయత్నం చేస్తే అవకాశం దక్కుతుందేమోననే ఆశలు ఉంటాయి. తాము నిర్దోషులమని కోర్టుకు చెప్పాలని అనుకుంటారు. కవిత ఈ దశను కూడా దాటినట్టు చెబుతున్నారు.
ఇక మూడో దశ ఎమోషన్స్ ఫేజ్. తాను మహిళను, తల్లిని, బిడ్డల భవిష్యత్ లేదా.. కులం, మతం, కుటుంబ పరిస్థితులు, అనారోగ్యం వంటి అంశాలను ఎంచుకుని బయటికి రావాలనే ప్రయత్నాలు చేస్తారు. తన కుమారుడికి పరీక్షలున్నాయని, తాను దగ్గర ఉండాల్సిన అవసరం ఉన్నదని కవిత మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. లేఖ కూడా రాశారు. వీటి ఆధారంగా కవిత ఇప్పుడు మూడో దశలో ఉన్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ స్టేజీ దాటితే డిప్రెషనే.
Also Read: మనుషులన్నాక తప్పు చేస్తారు.. అందుకు బాధపడాల్సిందే మరీ!!
ఎప్పుడూ జనంలో తిరిగి.. నిత్యం ప్రశంసలు పొందే వారు జైలులో ఒంటరి జీవితాన్ని తట్టుకోలేరు. నిద్రపట్టకపోవడం, ఆహారం సహించకపోవడం వంటివి మొదలవుతాయి. ఈ దశకు రాకూడదంటే మానసికంగా చాలా బలంగా ఉండటం అవసరం. జైలులో మెడిటేషన్ చేయడం, తోటివారితో, సిబ్బందితో కలివిడిగా ఉండటం అవసరం. ఈ దశకు చేరుకోవడానికి కూడా ఒక్కో మనిషికి ఒక్కో అవధి ఉంటుంది. వారి వారి మానసిక దృఢత్వాన్ని బట్టి కొందరికి 40 రోజులు.. మరికొందరికి 120 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనవాళ్లెవరు? కానివారెవరు? అనే ఆలోచనలు వారికి వస్తాయట. ఆ తర్వాత అవే అనుమానాలు బయటపడుతాయి. ఒంటరితనం ఎక్కువగా కుంగదీస్తుంటుంది. కొన్ని అంశాలు జరగవని తెలిసి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. దీన్ని ఎలివేషన్ ఆఫ్ మూడ్‌గా వర్ణిస్తారు. ఒక వ్యక్తి నిత్యం వెళ్లేదారిలో ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు మెదడు వెంటనే వేరే మార్గాలను అన్వేషిస్తుంది. గతంలో వెళ్లిన మార్గం, తెలుసుకున్న దారులను గూగుల్ మ్యాప్‌లో చూపుతుంది. ఆ దారులు ఫలించవచ్చు, ఫలించకపోవచ్చును. కానీ, ఓ ప్రయత్నం చేయాలని అనుకుంటారు. జడ్జీకి లేఖ రాయడం ఇలాంటిదే. న్యాయమూర్తులు సహజ న్యాయసూత్రాలు, రాజ్యాంగ నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో తన లేఖ ప్రభావం ఏమీ ఉండదని తెలిసినా ఆ ప్రయత్నం చేశారు. ఈ దశలన్నీ దాటిపోయాక ఎవరినీ నమ్మలేని స్థితికి చేరుకుంటారు. మైండ్ రీథింకింగ్‌లో పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో పూర్తిగా కొలాప్స్ అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో యాక్సెప్టెన్సీ పెరిగిత అప్రూవర్లుగా మారుతారని నిపుణులు చెబుతున్నారు.