Bathukamma Celebrations: ఈ నెల 30న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ ను వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, (Jupalli Krishna Rao) కొండా సురేఖ, సీతక్క తెలిపారు. ఈ నెల 29న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బతుకమ్మ ఉత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ నెల 27న ట్యాంక్ బండ్ పై బతుకమ్మ కార్నివాల్, 28న బైక్, సైకిల్ ర్యాలీలు, 29న సరూర్ నగర్ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్యక్రమాలు ఉంటాయన్నారు.
రోడ్ల మరమ్మతులు చేపట్టాలి
దీనికి అనుగుణంగా ప్రతిష్ఠాత్మకంగా సన్నాహాలు చేయాలని, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ట్యాంక్ బండ్ తో పాటు పీవీ మార్గ్, సచివాలయం, సరూర్ నగర్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని, బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. మహిళలకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పండగ ప్రాశస్త్యానికి అద్దం పట్టేలా హైదరాబాద్ లో చారిత్రక ప్రదేశాలతో పాటు ప్రధాన జంక్షన్లను అందమైన ఆకృతులతో, విద్యుత్ దీపాలతో అలంకరించాలి, వైభవోపేతంగా నిర్వహించాలని ఆదేశించారు.
శాఖలు సమన్వయంతో పని చేయాలి
పర్యాటక, సాంస్కృతిక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పోలీస్, ట్రాన్స్‌కో, ఇతర శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సరూర్ నగరం స్టేడియంలో ఈ నెల 29న 10వేల మంది బతుకమ్మ వేడుకలు, 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేర్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలను తరలించే బాధ్యతను సెర్ఫ్ అధికారులు తీసుకోవాలని, దీనికి తోడు మిగిలిన వారిని తీసుకువచ్చేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
జానపద, గిరిజన కళాకారుల మధ్య వేలాదిమంది మహిళలతో బతుకమ్మ
జానపద, గిరిజన కళాకారుల మధ్య వేలాదిమంది మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, హైదరాబాద్ నగర వాసులు పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని విజయంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్లు శోభారాణి, సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Norma Movie: అత్తతో అల్లుడి రహస్య బంధం.. ఊపేస్తున్న సినిమా.. సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్!