Telangana BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గేర్ మార్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో దూకుడు పెంచాలని భావిస్తున్నది. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్(ఎఊ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్(Yogi Adityanath) మార్క్ ప్రచారాన్ని తెలంగాణ(Telangana)లోనూ చేపట్టి ప్రజలకు చేరువవ్వాలని నిర్ణయానికి వచ్చింది. యూపీ ఎన్నికల్లో ప్రచారం చేపట్టిన తరహాలో ఇక్కడ కూడా దూకుడు పెంచాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో ఒకేసారి 52 ప్రాంతాల్లో ప్రచారానికి ప్లాన్ చేసుకున్నది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విస్తృతంగా ప్రచారం చేయాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఈ ప్రచారంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లంతా పాల్గొనాలని పార్టీ ఆదేశించింది.
ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలని..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ.. పోలింగ్ బూత్ డివిజన్లను 78 శక్తి కేంద్రాలుగా విభజించుకున్నది. ఒక్కో శక్తి కేంద్రంలో 6 నుంచి 8 పోలింగ్ బూత్‌లు ఉండనున్నాయి. కాగా ఏ పోలింగ్ బూత్‌లో ఎవరు ప్రచారంలో పాల్గొనాలనే అంశంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాబితా సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు లీడర్లకు వీటికి సంబంధించిన వివరాలు పంపించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS)తో పోలిస్తే అభ్యర్థి ప్రకటన నుంచి ప్రచారం వరకు అన్ని అంశాల్లో వెనుకబడింది. దీంతో పార్టీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించి తమ సత్తా చాటాలని బీజేపీ నిర్ణయించుకుంది. అందుకే ప్రచార పర్వంలో దూసుకుపోయేలా కమలం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తున్నది.
Also Read: Killer Movie: విడుదలకు సిద్ధం అవుతున్న లేడీ సూపర్ హీరో ఫిల్మ్.. ఏంటంటే?
మహా పాదయాత్రతో ఓట్ల అభ్యర్థన..
కాషాయ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం మంగళవారం నేతలంతా జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో విస్తృతంగా మహా పాదయాత్రలు చేపట్టి ఎక్కడికక్కడ ప్రజలను ఓట్లు అభ్యర్థించనున్నారు. ఈ తరహా ప్రచారంలో నియోజకవర్గంలోని వీధులన్నీ బీజేపీ నేతలతో కిక్కిరిసిపోవడం ఖాయమని నేతలు చెబుతున్నారు. గతంకంటే భిన్నంగా ఈ ఎన్నికల ప్రచారాన్ని టీబీజేపీ చేపడుతున్నది. ఈ తరహా ప్రచారంతో కాషాయ పార్టీ ఓటర్లను తమ వైపునకు తిప్పుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికలను సెమీ ఫైనల్‌గా కమలదళం పేర్కొంటున్నది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాలంటే జూబ్లీహిల్స్ విజయంతో నాంది పలకాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది. అతి త్వరలో జీహెచ్ఎంసీ(GHMC)తో పాటు లోకల్ బాడీ(Local Body) ఎన్నికలు ఉన్న నేపథ్యంతో ఈ ఎలక్షన్‌లో తమదైన మార్క్‌ను చూపి ముందుకు వెళ్లాలని బీజేపీ(BJP) భావిస్తున్నది. మరి ఈ కొత్త తరహా ఎన్నికల ప్రచారం పార్టీకి ఎంత మేరకు కలిసి వస్తుందనేది చూడాలి.
Also Read: CM Revanth Reddy: రాష్ట్రంలో అన్ని శాఖలపై సమగ్ర నివేదిక ఇవ్వండి.. సీఎం వార్నింగ్..?
