Telangana BJP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల విలీనం నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దీనిపై పోరుబాట పట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, బీజేపీ దీనిని ఒక ఉద్యమంగా మలిచేందుకు సన్నద్ధమవుతుంది.
మానిటరింగ్ కమిటీ ఏర్పాటు..
ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో పార్టీ శ్రేణులు సీరియస్‌గా చర్చించాయి. విలీన ప్రక్రియను, దాని వల్ల ప్రజలకు కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను కన్వీనర్‌గా నియమించారు. ప్రభుత్వం విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని, ఆందోళనలు చేపడుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు.
పాతబస్తీ డీలిమిటేషన్‌పై తీవ్ర విమర్శలు..
జీహెచ్‌ఎంసీలో విలీనం వల్ల ఎదురయ్యే మౌలిక సదుపాయాల సమస్యలను ప్రాంతాల వారీగా మ్యాప్ చేసి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాషాయ పార్టీ భావిస్తుంది. ప్రత్యేకించి, ఈ విలీనాలు ఎంఐఎంకు లబ్ధి చేకూర్చేలా జరుగుతున్నాయని కమలనాథులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వం అశాస్త్రీయంగా, రాజకీయ లబ్ధి కోసమే ఈ విలీనాలు చేపడుతుందని ఆరోపించారు. దీనివల్ల ఆస్తి పన్నులు పెరగడం, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విలీనం కారణంగా హిందువులకు నష్టం కలిగే అవకాశముందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ బిగ్ అప్డేట్.. సింక్ అయిన డేటా కోసం ప్రయత్నాలు ముమ్మరం
ప్రజలకు వివరిస్తాం..
బీజేపీ స్టేట్ ఎలక్షన్ కమిటీ మెంబర్, భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు పొన్న వెంకటరమణ మాట్లాడుతూ, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్‌పురా వంటి ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ చేసిన డీలిమిటేషన్ ప్రకారం కేవలం 2 డివిజన్లలో మాత్రమే హిందువులు గెలిచేలా అవకాశం ఉందని, ఇది హిందువులను చీల్చడమే, వారి ఉనికికి ప్రమాదమని విమర్శించారు. తాము సిద్ధం చేసిన మ్యాప్ ప్రకారం చాలా డివిజన్లలో హిందువులే గెలిచే అవకాశం ఉందని, ఈ అంశాలపై కరపత్రాలు పంచి ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
పన్నుల భారంపై ఆందోళన..
హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నప్పటికీ, ఈ నిర్ణయంపై బీజేపీ విమర్శలు సంధిస్తుంది. విలీనం తర్వాత ఆస్తి పన్నులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు గణనీయంగా పెరుగుతాయని, ఇది ప్రజలపై తీవ్ర భారం మోపుతుందని పేర్కొంది. జనాభా 2 కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉన్నందున, ఇంత పెద్ద పరిధిని సమర్థవంతంగా నిర్వహించడం కష్టమని, స్థానిక సమస్యలు మేయర్, కమిషనర్‌కు చేరడం కష్టమవుతుందని కాషాయ పార్టీ వాదిస్తుంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదని, ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఎస్ఐఆర్’పై వర్క్‌షాప్..
మున్సిపాలిటీల విలీనంతో పాటు, తెలంగాణలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్) అమలు చేయడంపైనా బీజేపీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఓటరు జాబితాలను కచ్చితమైనవిగా తయారుచేసేందుకు భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ ప్రక్రియపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం వర్క్‌షాప్ నిర్వహించారు. కేంద్ర మంత్రి అమిత్ షా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు, నకిలీ నమోదులు, చనిపోయిన వారి పేర్లను తొలగించడం ఎస్ఐఆర్ ఉద్దేశమని షా వివరించారు. ఒక వ్యక్తి-ఒక ఓటు అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని ఇది బలపరుస్తుందని తెలిపారు. ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని బీజేపీ విమర్శలు చేసింది. ప్రభుత్వం విలీన ప్రక్రియను వేగవంతం చేసి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో, బీజేపీ ఈ పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.

