Ambedkar Open University: విద్యనభ్యసించడంలో, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో గృహిణులు, మహిళలు, ఖైదీలను యువత ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్, విశ్వవిద్యాలయ చాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University) 26వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) పాల్గొని మాట్లాడారు. ఉద్యోగం చేస్తూ చదువుకోవడం.. గృహిణులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, పేద విద్యార్ధులు, ఖైదీలకు అంబేద్కర్ యూనివర్సిటీ ఓ గొప్ప అవకాశంగా గవర్నర్ అభివర్ణించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(న్యూఢిల్లీ) వీసీ ఉమా కాంజీలాల్ మాట్లాడుతూ.. మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలక భూమిక పోషిస్తోందన్నారు.
Also Read: Gaza Peace Plan: హమాస్‌కు ట్రంప్ ‘శాంతి ఒప్పందం’ ప్రతిపాదన.. ఒప్పుకుంటారా?
ల్యాబ్‌లు, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికత
మూక్స్ ద్వారా వర్చువల్ ల్యాబ్‌లు, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఓడీఎల్ కీలకం కానుందన్నారు. కరోనా వంటి మహమ్మారి దేశ విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేయగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవలంభిస్తున్న ఓడీఎల్ సిస్టం అందరికీ మార్గదర్శిగా నిలిచిందని కొనియాడారు. వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా రెగ్యులర్ యూనివర్సిటీలతో సమానంగా ఓడీఎల్‌లో సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టగా కోర్సు పూర్తిచేసి విద్యార్థులు పట్టాలు అందుకున్నారన్నారు.
ఎక్కడా లేని విధంగా గిరిజనులకు ఉచిత విద్య
యూనివర్సిటీ అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధానంలో భాగంగా తెలంగాణలోని ట్రాన్స్ జెండర్లకు ఉచిత డిగ్రీ కోర్సులు అందిస్తోందని, 2025-26 విద్యాసంవత్సరం నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని గిరిజనులకు ఉచిత విద్యను అందిస్తున్నామని చక్రపాణి వెల్లడించారు. వికలాంగులకు కూడా ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. ఈ స్నాతకోత్సవంలో గేయ రచయిత, కవి గోరటి వెంకన్న, విద్యావేత్త ప్రేమ్ రావత్ కు గౌరవ డాక్టరేట్ ను అందించారు. ఈ స్నాతకోత్సవంలో 60,288 మంది డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు అందుకున్నారు. డిగ్రీలో 35,346 మంది, పీజీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 24,942 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 86 బంగారు పతకాలు అందుకున్నారు. 203 మంది ఖైదీలు డిగ్రీ పూర్తిచేసుకున్నారు. ఇందులో ఇద్దరు ఖైదీలకు గోల్డ్ మెడల్స్ లభించాయి.
Also Read: H1B Visa Fee: హెచ్-1బీ ఫీజు పెంచిన ట్రంప్‌కి షాక్.. భారత్‌కు వచ్చే యోచనలో అమెరికా కంపెనీలు!