– ఎర్లీబర్డ్ పథకానికి అదిరిపోయే రెస్పాన్స్
– ఏప్రిల్ 30 సాయంత్రానికే నిరుటి రూ. 766 కోట్లు క్రాస్
– అర్ధరాత్రికి రూ. 800 టార్గెట్‌కు చేరొచ్చనే అంచనా
– పెరిగిన పన్ను చెల్లింపుదారులు, ట్రేడ్ లైసెన్స్‌లు
– ఫలించిన ప్రభుత్వపు చొరవ
GHMC news today telugu(Hyderabad latest news): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇంటి ఓనర్లకు జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీబర్డ్ స్కీమ్ మంగళవారంతో ముగిసింది. ఏప్రిల్ 30లోపు ఇంటిపన్ను కట్టే భవన యజమానులకు ప్రతి ఏడాది మాదిరిగానే పన్నుమొత్తంలో 5% రాయితీని ప్రకటిస్తూ జీహెచ్ఎంసీ చేసిన ప్రకటనకు అదిరిపోయే స్పందనే వచ్చింది. ‘ఎర్లీ బర్డ్’ పథకం ద్వారా ఏప్రిల్ నెలాఖరు నాటికి రూ. 1200 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలు చేయాలని నగర పాలక సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా సమకూరే సొమ్ముతో రానున్న వర్షాకాలం నాటికి నగరంలోని నగరంలో నాలాలు, రహదారుల మరమ్మతులు, డైలీ పారిశుద్ధ్య పనులతో బాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని బల్దియా భావిస్తోంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 19 లక్షల నిర్మాణాలున్నట్టు ఒక అంచనా. వీటి ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2,500 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలనేది జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, ఈ మొత్తంలో గరిష్ట భాగాన్ని ఈ ఏప్రిల్ మాసంలో వసూలు చేయగలిగితే, మిగిలిన 11 నెలల్లో తమ పన్ను వసూలు లక్ష్యాన్ని చేరుకోవటం సులభమనేది అధికారుల ఆలోచనగా ఉంది.
Also Read: అబద్ధాల కేసీఆర్.. పదేళ్లు చెప్పిన అబద్ధాలు చాలవా?
ఒకవైపు లోక్‌సభఎన్నికల హడావుడిలో అధికారులు అనుకున్నంతగా క్షేత్ర స్థాయి ప్రచారం చేయకపోయినా, ఈసారి ఊహించిన దానికంటే గొప్ప స్పందనే వచ్చింది. పథకం మొదలైన ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 సాయంత్రానికి ఎర్లీబర్డ్స్కీమ్కింద రూ. 766 కోట్ల నిరుటి లక్ష్యాన్ని క్రాస్ చేసి, వసూళ్లు దూసుకుపోయాయి. అర్థరాత్రి ఆన్‌లైన్ చెల్లింపులతో కలిపి ఈ మొత్తం మరింత పెరిగి రూ. 800 కోట్లకు సమీపంలోకి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎర్లీబర్డ్ కింద ప్రాపర్టీ ట్యాక్స్ కింద నిరుడు 6 లక్షల 10 వేల మంది సద్వినియోగం చేసుకోగా, ఈసారి ఏప్రిల్ 29 నాటికే ఆ సంఖ్య 6 లక్షల 58 వేలకు చేరింది. ఈ పథకం కింద 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.362 కోట్లు, 2018 – 19లో రూ.432కోట్లు, 2019 – 20లో రూ.535 కోట్లు, 2020-21లో రూ.572 కోట్లు, 2021-22లో రూ.541 కోట్లు, 2022-23లో రూ.743 కోట్లు, 2023-24లో రూ.766 కోట్లు వసూలు అయ్యాయి.
Also Read: భారత మేడే వేడుకకు ఆద్యుడు.. సింగారవేలు
మరోవైపు ట్రేడ్ లైసెన్సుల రూపంలోనూ బల్దియాకు మంచి ఆదాయమే సమకూరుతోంది. 2023 జనవరి నుండి డిసెంబర్ మధ్యకాలంలో నగరం పరిధిలోని 1,06,333 ట్రేడ్ లైసెన్సులను బల్దియా జారీ చేసింది. ఇందులో 54,744 లైసెన్సులు కొత్తవి కాగా, మిగిలిన పాతవాటిని నగరపాలక సంస్థ రెన్యువల్ చేసింది. ఈ ఏడాది కూడా మరిన్ని కొత్త లైసెన్సులు జారీ చేయటం ద్వారా బల్దియా ఆదాయాన్ని పెంచాలని సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వ్యాపారం నిర్వహిస్తున్న యాజమానులకు ట్రేడ్ లైసెన్స్ డిసెంబర్ 31, 2023తో ముగియటంతో జనవరి 31, 2024 నాటికి 2024 డిసెంబరు వరకు చెల్లుబాటయ్యేలా ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం అధికారులు ప్రకటన చేశారు. ఈ ఎన్నికల హడావుడి పూర్తి కాగానే పన్నుల వసూళ్ల మీద క్షేత్ర స్ధాయి ప్రచారం కూడా చేయాలని బల్దియా భావిస్తోంది.