– కరెంట్ విషయంలో తప్పుడు ప్రచారం తగదు
– ఇకనైనా బుద్ధి మార్చుకో
– ఖమ్మం సాక్షిగా బీజేపీతో కలిసిపోయామని ఒప్పుకున్నారు
– కేసీఆర్‌పై తుమ్మల, పొంగులేటి ఆగ్రహం
KCR: బస్సుయాత్రతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే పనిలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖమ్మం టూర్‌లో భాగంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా జిల్లా మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ అధోగతి పాలు అయిందని తుమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ పోతోందని కథలు అల్లుతున్నారని, పదేళ్లు అబద్ధాలతో పాలన చేసిన కేసీఆర్, ఇప్పుడు కూడా అవే చెప్తున్నారని అన్నారు. ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. నాగార్జున సాగర్ నీళ్లు ఎందుకు రాలేదని అడుగుతున్న కేసీఆర్, జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. చేరికల విషయంలో లోకల్ లీడర్స్ అభిప్రాయం మేరకే ఆహ్వానాలు ఉంటాయన్నారు. గాంధీ కుటుంబానిది త్యాగాల చరిత్ర అని చెప్పారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా కష్టపడి రాష్ట్రంలో అధిక సంఖ్యలో సీట్లు గెలవాలని తుమ్మల కోరారు.
Also Read: భయంలో బీజేపీ.. రాహుల్ ప్రధాని కావడం ఖాయం
పొంగులేటి మాట్లాడుతూ, కర్ర పట్టుకుని ఖమ్మం వచ్చి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేసీఆర్ కోరారని, అసలు, ఆయన పొత్తు పెట్టుకున్న కూటమి ఏదని అడిగారు. బీజేపీతో కలిసిపోయామని ఖమ్మం సాక్షిగా చెప్పేశారని అన్నారు. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్లకు 11 రోజులు మాత్రమే సమయం ఉందని, ప్రజల పోరాట ఫలితంగానే ఇందిరమ్మ రాజ్యం సాధ్యమైందని తెలిపారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అభిమాని ఎంపీ ఎలక్షన్‌లో చేయి చేయి కలిపి పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వదులుతుందని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. ఇప్పటికే జరిగిన రెండు విడతల పోలింగ్‌లో ఇండియా కూటమికి మెజార్టీ సీట్లు రాబోతున్నాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. అలాగే, రాష్ట్రంలో ఉన్న 17 సీట్లలో 15 సీట్లు తగ్గకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు. మే 4వ తేదీ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెం రాబోతున్నారని తెలిపారు పొంగులేటి.