– 60 ఏళ్ల పాలనలో ఒక్క హిందూ మహిళ తాళిబొట్టు తెంచి ముస్లింలకు ఇచ్చామా?
– దీన్ని రుజువు చేసే దమ్ము బీజేపీకి ఉందా?
– మహిళల తాళి గురించి మోదీ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం
– ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్‌కు వచ్చారంటేనే మోదీ భయం అర్థమౌతోంది
– రాహుల్ ప్రధాని కావడం ఎవరూ ఆపలేరు
– సీఎంను తిడితే జనం గుర్తిస్తారనేదే హరీష్ రావు తాపత్రయం
– కేసీఆర్‌కు సడెన్‌గా ఓయూపై ప్రేమ ఎందుకు?
– పదేళ్లలో ఒక్కసారైనా ఉస్మానియాకు వెళ్లారా?
– బీజేపీ, బీఆర్ఎస్‌పై జగ్గారెడ్డి ఫైర్
Jaggareddy: రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని మోదీలో దడ మొందలైందని అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని తెలిపారు. మెజార్టీ ప్రజలు ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. ఆయన ప్రధాని అయితే దేశంలో అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ నినాదానికి భయపడి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటన చేశారని అన్నారు.
‘‘ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్‌కు పంపించారంటేనే అర్థం అవుతోంది మోదీ ఎంతటి భయంలో ఉన్నారో. 60 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏ ఒక్క హిందూ మహిళ తాళి బొట్టు తెంచి ముస్లింలకు ఇవ్వలేదు. దీన్ని రుజువు చేసే దమ్ము బీజేపీకి ఉందా? ప్రధాని హోదాలో ఉండి పవిత్రమైన మహిళల తాళి బొట్ల గురించి మాట్లాడడం మోదీ దిగజారుడుతనానికి నిదర్శనం. మోదీ హిందూత్వం మాటున గోబెల్స్ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. పుస్తెలు, ఆస్తులపై మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? ఎలక్షన్ కమిషన్‌ను బీజేపీ ఇంటి నౌకరుగా మార్చుకుంది. దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్న మోదీపై నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది’’ అంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి.
Also Read: KCR: సిగ్గులేని మాటలెందుకు?
ఇక, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపైనా స్పందిస్తూ, హరీష్ రావును ప్రజలు మర్చిపోయారని అన్నారు. రేవంత్ రెడ్డిని తిడితే అందరూ గుర్తిస్తారని అనుకుంటున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ముందు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చాలా చిన్నవని, పార్టీలోకి చేరికలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకే చేరికలు జరుగుతున్నాయన్నారు. పదేళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్ళారా? విద్యార్థుల బాగోగులు తెలుసుకున్నారా? అని నిలదీశారు జగ్గారెడ్డి. ఉస్మానియా యూనివర్శిటీపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.