Swetcha Exclusive: బీఆర్ఎస్ పై కవిత (Kalvakuntla Kavitha) ప్రారంభించిన మినీ వార్.. గత కొన్ని రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై చురకలు అంటిస్తూ తండ్రి కేసీఆర్ (KCR)కు లేఖ రాయడం, ఆపై ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ మాట్లాడటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించాయి. అయితే కవిత కొత్త పార్టీ పెట్టే ఉద్దేశ్యంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే స్వేచ్ఛ మాత్రమే కవిత రెబల్ గా మారడానికి గల కారణాలను తొలిసారిగా బయటపెట్టింది. కవితకు పార్టీని వీడే ఉద్దేశమే లేదని పార్టీ ఫండ్స్ వాటాల్లో తలెత్తిన మనస్పర్థల వల్లే ఆమె బీఆర్ఎస్ పై ఫైర్ అవుతూ వస్తున్నారని ఒక రోజు ముందే చెప్పింది. తాజాగా ఇందిరా పార్క్ వద్ద కవిత చేపట్టిన మహాధర్నాతో ఇదే విషయం తేటతెల్లమైంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఫ్లకార్డులతో కవిత ప్లాన్ లీక్!
మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను చేపట్టారు. అయితే ధర్నా ప్రాంతంలో వెలసిన బ్యానర్లు (Kavitha Banners) రాజకీయంగా తీవ్ర ఆసక్తిని రేపాయి. కవిత కొత్త పార్టీ ఊహాగానాలు మిన్నంటిన వేళ.. ఆమె కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లు గులాబీ రంగులో దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది. ఫ్లెక్సీలలో కేసీఆర్ ఫొటోతో పాటు గులాబీ కండువ వేసుకొని కవిత కనిపించారు. ఆమె వెనక పింక్ బ్యాక్ డ్రాప్ ను సైతం పెట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎక్కడా బ్యానర్లలో బీఆర్ఎస్ పదం కనిపించలేదు. ఇది చూసి అటు బీఆర్ఎస్ క్యాడర్, ఇటు జాగృతి శ్రేణులు అవాక్కవుతున్నారు.
స్వేచ్ఛ చెప్పిందే నిజమైంది!
మహాధర్నా వద్ద బ్యానర్లను చూస్తే ఆమెకు పార్టీ వీడే ఉద్దేశ్యమే లేదని స్పష్టమవుతోంది. పార్టీలో ఉండి వాటాలు తేల్చుకోవాలే తప్ప బయటకు వస్తే మెుత్తానికే మోసం వస్తుందని ఆమె ఆలోచిస్తున్నట్లు స్వేచ్ఛ తన తాజా కథనంలో పేర్కొంది. షర్మిల అంశానికి ఇందుకు ఉదాహరణగా కవిత తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. జగన్ సోదరి షర్మిల.. ఉన్నపళంగా కొత్త పార్టీ పెట్టడం వల్ల ఆస్తి తగాదాలు మరింత పెరిగాయే తప్పా సద్దుమణగలేదని అందరికీ తెలిసిందే. కాబట్టి షర్మిల (YS Sharmila) చేసిన తప్పును తిరిగి పునారావృతం చేయకూడదని ఏదైనా పార్టీలో ఉండే తేల్చుకోవాలని ఆమె నిర్ణయించినట్లు బ్యానర్ల ద్వారా స్పష్టమవుతోంది.
పార్టీ ఫండ్స్ దగ్గర లొల్లి!
బీఆర్ఎస్ తో కవితకు వచ్చిన గ్యాప్ కు గల అసలు కారణాన్ని స్వేచ్ఛ బయటపెట్టింది. ఇదే అంశాన్ని ఇవాళ ప్రచురితమైన బ్యానర్ ఆర్టికల్ లో చూడవచ్చు. వివరాల్లోకి వెళ్తే లిక్కర్ కేసులకు సంబంధించి కవితకు భారీగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. కేసుల కారణంగా కోట్లాది రూపాయలు అడ్వకేట్లకు ఆమె చెల్లించాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నన్ని రోజులు ఏదో విధంగా డబ్బులు రావడంతో కవితకు పెద్దగా ఆర్థిక నష్టాన్ని కలిగించలేదు. అయితే అధికారం కోల్పోయాక ఆమె చేతి నుంచే డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం కవితకు సమస్యగా మారింది. పైగా జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి పార్టీలో గుర్తింపు, పదవులు లేకుండా పోవడం ఆమెలో మరింత అసహనానికి కారణమైంది. రేపు కేటీఆర్ పార్టీ అధ్యక్షుడైతే పార్టీ ఫండ్స్ కింద ఉన్న రూ.1300 కోట్ల రూపాయలు అతడి హ్యాండవర్ లోకి వెళ్లిపోతాయని కవిత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కూతురిగా తనకు చెక్ పవర్ సరిపోయేంత ఎందుకు రాదని ఆమె మెుండికేయడమే అసలు వివాదానికి కారణమని స్వేచ్ఛ స్పష్టం చేసింది.
Also Read: Botsa Satyanarayana: వైసీపీకి బిగ్ షాక్.. వేదికపై కుప్పకూలిన బొత్స.. ఆందోళనలో కార్యకర్తలు!
అటు ఆస్తిలో.. ఇటు పార్టీలో..
బీఆర్ఎస్ ఫండ్స్ తో పాటు పార్టీలో పట్టు కోసం కూడా కవిత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కు తనకంటూ ప్రత్యేక సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాలని కవిత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించారు. కేసీఆర్ పై ఈగ వాలిన జన జాగృతి ఊరుకోదంటూ కవిత చేసిన వ్యాఖ్యలు.. పార్టీలో పట్టు పెంచుకోవడానికేనన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు మహాధర్నా ద్వారా తన సత్తా ఏంటో పరోక్షంగా తన తండ్రితో పాటు సోదరుడు కేటీఆర్ కు తెలియజేయాలని కవిత ప్లాన్ వేశారని కూడా తెలుస్తోంది.