GHMC Monsoon Tenders: ఏ పని చేసినా జేబులు నింపుకోవడం జీహెచ్ఎంసీ అధికారులకు (GHMC Officers) అలవాటుగా మారింది. వర్షాకాలం గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) ప్రజల కష్టాలను తగ్గించేందుకు ఏర్పాటు చేయాల్సిన మాన్సూన్ టీమ్‌లు (Monsoon Teams), సమకూర్చాల్సిన మిషనరీ, వాహనాల్లోనూ అధికారులు కక్కుర్తి పడుతున్నారు. వాన నీటిలో కాసుల వేటను ప్రారంభించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు బడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు సదరు కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా ఏకంగా నిబంధనలను సైతం తారుమారు చేస్తున్నట్లు సమాచారం.
టెండర్ల ప్రక్రియలో గోల్‌మాల్
వర్షాకాలం సహాయక చర్యల కోసం ఇటీవల జీహెచ్ఎంసీ సీటీవో సెక్షన్ చేపట్టిన టెండర్ల ప్రక్రియలో గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ (ఎంఈటీ)లతో పాటు వర్షానికి పాడైపోయే రోడ్లకు మరమ్మతులు చేసేందుకు ఇన్ స్టెంట్ రిపేర్ టీమ్ (ఐఆర్ టీ)లను ఏర్పాటు చేస్తుంది. ఈ సారి కూడా ఇదే రకంగా టీమ్‌లను ఏర్పాటు చేసేందుకు వాహనాల వినియోగిస్తుంది. ఈ ఒక్క నిబంధనను అడ్డం పెట్టుకుని అధికారులు, కాంట్రాక్టర్లకు ఖజానాకు కన్నం వేసేందుకు సిద్ధమయ్యారు.
ఇసూజు వాహనాలు మాత్రమే
జీహెచ్ఎంసీ మొత్తం 304 టీమ్‌లు ఏర్పాటు చేయగా, వీటిలో స్టాటిక్ లేబర్ టీమ్‌లు 155, మొబైల్ ఎమర్జెన్సీ టీమ్‌లు 159 వరకు ఉన్నాయి. ఈ టీమ్‌లకు మొత్తం 164 వాహనాలను ఎంగేజ్ చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. అయితే, ఈ సారి ఇసూజు వాహనాలు మాత్రమే పెట్టాలని అధికారులు నిబంధన విధించారు. తొమ్మిది మంది కాంట్రాక్టర్లు మినహా మిగిలిన వారి వద్ద ఇసుజు వాహనాలు లేకపోవడంతో కేవలం తొమ్మిది మంది కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు కేటాయించేందుకు అధికారుల సిద్ధమయ్యారు. ఈ రకంగా ఎంగేజ్ చేసే ఒక వెహికల్‌కు గతంలో రూ.30వేలు మాత్రమే చెల్లించే వారు. దీంతో 150 వాహనాలకు నెలకు రూ.45 లక్షల వరకు ఖర్చ అయ్యేది.
రూ.30 వేల నుంచి రూ.63 లకు పెంపు
కొత్తగా తీసుకోవాలని అధికారులు ప్రతిపాదించిన ఇసుజు వాహనం ఒక్క దానికి నెలకు ఏకంగా రూ.63 వేలు చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 159 మోబైల్ మాన్సూన్ టీమ్‌లకు రూ.కోటి 17 వేల వరకు ఖర్చు అవుతుంది. అదే సంవత్సరానికి రూ.12 కోట్ల 2 లక్షల 4 వేల వరకు ఖర్చుకానుంది. అసలే కష్టకాలం ఇలాంటి సమయంలో ఇసుజు వాహనాలనే వినియోగించాలని, దానికి ఏటా వినియోగించే ఒక్కో వాహనానికి చెల్లించే రూ.30 వేలను ఇసుజు పేరిట రూ.63వేలకు పెంచటం బల్దియాలో వాడివేడిగా చర్చ జరుగుతున్నది.
బయటపడ్డ కాంట్రాక్టర్ మిలాఖత్
ఇదే వర్షాకాలం సహాయక చర్యల టీమ్‌లు, వాహనాల ఎంగేజ్‌కు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఇసుజు వాహనాలే వినియోగించాలన్న నిబంధన పెట్టడంతో కాంట్రాక్టర్లు కొందరు ఇంజినీర్‌ను కలిసినట్లు సమాచారం. అక్కడ ఓ బడా కాంట్రాక్టర్ మిలాఖాత్ ఇతర కాంట్రాక్టర్ల ముందు బట్టబయలైనట్లు తెలిసింది. ఈసారి ఇసుజు వాహనమే వినియోగించాలన్న నిబంధన పెట్టడంపై ఇంజినీర్‌ను ప్రశ్నించేందుకు వెళ్లగా, ఇటీవలే నిర్వహించిన సమావేశంలో మీరు కూడా ఉన్నారు కదా, మీ తొమ్మిది మంది కాంట్రాక్టర్లకే పనులు దక్కాలని ఆ నిబంధన పెట్టేందుకు మీరు కూడా అంగీకరించారు కదా, పైగా మీకు ఓ పని దక్కింది కదా, మళ్లీ ప్రశ్నించడం ఏంటంటూ ఇంజినీర్ ఎదురు ప్రశ్నించడంతో సదరు కాంట్రాక్టర్ అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయినట్లు తెలిసింది.
ఏడాది ఎంగేజ్ ఎందుకు?
సాధారణంగా వర్షాకాలం నాలుగు నెలల పాటు ఉన్నందున జీహెచ్ఎంసీ ఎప్పుడు సహాయక చర్యల కోసం స్టాటిక్ లేబర్ టీమ్‌లు 155, మొబైల్ ఎమర్జెన్సీ టీమ్‌లు 159లకు వాహనాలను కేవలం నాలుగు నెలలు మాత్రమే సమకూర్చేది. కానీ, ఈ సారి అధికారులు వర్షకాలం సహాయ చర్యలను అడ్డం పెట్టుకుని మొత్తం 159 ఇసుజు వాహనాలకు ఏడాది పొడువున రూ.12 కోట్ల 2 లక్షల 4వేల వరకు చెల్లించేందుకు సిద్ధం కావడం వెనక అసలు ఆంతర్యం ఏంటి? అన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది. మాన్సూన్ అన్నిరకాల టీమ్‌లు, వాహనాలకు ప్రతి ఏటా రూ.5.40 కోట్లు ఖర్చయ్యేది. ఈ సారి అధికారులు, కాంట్రాక్టర్ల మిలాఖత్‌తో రూ.12 కోట్ల 2 లక్షల 4 వేలు ఖర్చవుతుంది. అంటే, గతేడాది ఖర్చు చేసిన రూ.5.40 కోట్ల కంటే ఈ ఏడాది రూ.6 కోట్ల 62 లక్షలు బల్దియా ఖాజానాకు భారం కానుంది.
Also Read: L&T on Medigadda Barrage: అంతుపట్టని ఎల్ అండ్ టీ వైఖరి.. బీఆర్ఎస్ పాలనలో ఒకలా.. కాంగ్రెస్ హయాంలో మరోలా!
కమిషనర్‌కు తెలియదా?
జీహెచ్ఎంసీ ప్రతి ఏటా వర్షాకాలం సహాయక చర్యల కోసం రూ.5.40 కోట్ల నుంచి రూ.6 కోట్లలోపే ఖర్చు చేస్తుండగా, ఈ సారి ఏకంగా రూ.12 కోట్ల 2 లక్షల 4 వేలను కేవలం వాహనాల ఎంగేజ్ కోసం ఖర్చు చేసేందుకు, ఇసుజు వాహనాలను మాత్రమే వినియోగించాలన్న విషయం కమిషనర్‌కు తెలీసే జరిగిందా? తెలియకుండానే జరిగిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.