❄️ నాడు మరమ్మతులు చేస్తామని.. నేడు కుదరదంటూ బుకాయింపు
❄️ ఎన్డీఎస్ఏ రిపోర్టును సైతం తప్పుబట్టిన ఎల్ అండ్ టీ
❄️ మెయింటెనెన్స్ పనులు కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్
❄️ ప్రారంభించిన ఏడాదిలోనే బయటపడిన లోపాలు
❄️ డ్యామేజీలకు రిపేర్లు చేయించాలన్న లేఖలకూ స్పందించని వైనం
❄️ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉన్నా స్పందించని కంపెనీ
❄️ ప్రభుత్వమే మరమ్మతుల ఖర్చులు భరించాలంటూ మెలిక
❄️ అధికారులపై చర్యలకు ప్రభుత్వం సన్నద్ధం?
❄️ బ్యారేజ్ పటిష్టతను అంచనా వేయడానికి పారలల్ సీస్మిక్ టెస్ట్
❄️ రాఫ్ట్ కింద పడిన బుంగల కోసం జియో ఫిజికల్ స్టడీ
❄️ నిర్మాణ లోపాలను ఎత్తిచూపిన ఎన్డీఎస్ఏ
❄️ 9 పరీక్షలకు సిఫార్సులు
❄️ ఒప్పంద ఉల్లంఘనలను సంస్థ విస్మరించిందన్న విజిలెన్స్
❄️ ఎల్ అండ్ టీ నిర్లక్ష్యంపై స్వేచ్ఛ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ
L&T on Medigadda Barrage: స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్: మేడిగడ్డ కుంగుబాటుతో కాళేశ్వరం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టింది. అయితే, బ్యారేజీ పిల్లర్లు కుంగడంతో అవినీతి జరిగిందని విమర్శలు వచ్చాయి. కాంట్రాక్ట్ ప్రకారం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో జరిగిన డ్యామేజ్‌లకు నిర్మాణ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సదరు సంస్థనే రిపేర్ చేయించాలి. కానీ, ఇప్పుడు ఎల్ అండ్ టీ మాత్రం మరమ్మతుల ఖర్చును ప్రభుత్వమే భరించాలంటూ మెలికపెడుతున్నది. దీంతో ఎల్ అండ్ టీ సంస్థ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. 7వ బ్లాక్ కుంగిపోవడం ప్రత్యక్షంగా కనిపిస్తున్నా నాణ్యతా లోపాలు ఉన్నాయని విజిలెన్స్ విచారణ, ఎన్డీఎస్ఏ కమిటీ చెప్పినప్పటికీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంతేకాదు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) రిపోర్టును సైతం తప్పుబడుతూ ఇరిగేషన్ శాఖకు ఎల్ అండ్ టీ సంస్థ లేఖ రాసింది. బ్యారేజీకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేయకపోగా, పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్ తీసుకోవడం, కరోనా పేరుతో బ్యాంక్ గ్యారెంటీలు వెనక్కి తీసుకున్న కంపెనీ, అసలు తన తప్పేమీ లేదన్నట్లు లేఖలో పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ పాపమే శాపంగా మారిందా?
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది. ప్రాజెక్ట్ నిర్మాణం ఆ స్థలంలో చేపట్టవద్దని విశ్రాంత ఇంజనీర్లు సైతం సూచించినప్పటికీ పనులు చేపట్టడంతో మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ పిల్లర్లు కుంగినా ఎల్ అండ్ టీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిర్మాణంలో క్వాలిటీ చేపట్టకపోవడంతోనే పిల్లర్లు కుంగాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కంపెనీపై చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రస్తుతం మేడిగడ్డ ఉపయోగం లేకుండా పోయిందని పలువురు పేర్కొంటున్నారు. గత పాలకులు కంపెనీకి వంతపాడడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని, వారి నిర్లక్ష్యమే ప్రజలకు శాపంగా మారిందని పలువురు బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమీషన్లు తీసుకోవడంతో ఆ సంస్థపై గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తెర వెనుక గత పాలకులే ఉన్నారని, ఇప్పుడు కూడా వారే నడిపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టీస్ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో ఎల్ అండ్ టీ సంస్థ ఎన్డీఎస్ఏ రిపోర్టును తప్పుబడుతూ ఇరిగేషన్ శాఖకు లేఖ రాసిందని, అటెన్షన్ డైవర్షన్ కోసమే ప్లాన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలను కాపాడే ప్రయత్నంలో భాగంగానే లేఖ రాసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ నిర్మించిన ఏడాదిలోనే లోపాలు బయటపడడం కంపెనీ పనుల నాణ్యతను స్పష్టం చేస్తున్నది.
లేఖతో మొదలైన రచ్చ
వర్షాకాలం సమీపిస్తుండడంతో మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు, చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ ఈ నెల రెండో వారంలో ఎల్ అండ్ టీ సంస్థకు లేఖ రాయడంతో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అటాచ్ చేసింది. ఆ లేఖకు ఈనెల 21న ఎల్ అండ్ టీ సంస్థ రిప్లై ఇచ్చింది. ఈ తర్వాత 24న రామగుండం ఎస్ఈకి రాసిన మరో లేఖలో ఎన్డీఎస్ఏ రిపోర్టులో తప్పులు ఉన్నాయని, బ్యారేజీ డిజైన్లకు సంబంధించి జియోటెక్నిల్ ఇన్వెస్టిగేషన్స్‌ను సరిగ్గా చేయలేదని రిపోర్టులో పేర్కొన్నారని, తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీస్ సరిగ్గా మోడల్ స్టడీస్ చేయలేదని చెప్పారని, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ డినైజన్లలో లోపాలు ఉన్నాయన్నారని, ఓ అండ్ ఎం మాన్యువల్ లేదని, నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, డ్యామ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ఓ అండ్ ఎం పనులు చేపట్టలేదన్నారని, కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ఎన్డీఎస్ఏ చెప్పడానికి ఎలాంటి సరైన ఆధారాలను చూపలేదని ఎల్ అండ్ టీ సంస్థ పేర్కొంది. క్వాలిటీ కంట్రోల్ మేనేజ్‌మెంట్ సరిగ్గా నిర్వహించలేదని ఎన్డీఎస్ఏ పేర్కొనడాన్ని తాము తిరస్కరిస్తున్నామని, రిపోర్టును రివ్యూ చేయాలని కోరింది. అంతేకాదు రిపోర్టును అప్‌డేట్ చేయాలని ఎన్డీఎస్ఏకు సూచించింది. ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది.
బ్యారేజీ పనులు పూర్తికాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఇరిగేషన్ శాఖకు ఎల్ అండ్ టీ మూడు సార్లు లేఖలు రాసింది. కేసీఆర్ బ్యారేజీని 2019 జూన్ 21న ప్రారంభించారు. అప్పటికీ రూ.150 కోట్లకు పైగా పనులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులే పేర్కొన్నారు. కానీ, ఆ పనులు పూర్తి చేయకుండానే కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ప్రాజెక్ట్ ఈఈకి 2019 ఆగస్టు 6న ఎల్ అండ్ టీ లేఖ రాయగా, బ్యారేజీలో కొన్ని పనులు అసంపూర్తిగా, డ్యామేజీలు ఉన్నాయని రిపేర్లు చేయాలని అధికారులు తిరిగి లేఖ రాశారు. 2020 అప్పటికి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఇంకా అమల్లోనే ఉంది. బ్యారేజీ పూర్తయిన నాటి నుంచి రెండేళ్ల పాటు పీరియడ్ ఉంటుంది. బ్యారేజీకి డ్యామేజ్ అయితే రిపేర్లు చేయాల్సిన బాధ్యత సంబంధిత నిర్మాణ సంస్థదే. కానీ, రిపేర్లు చేయకుండా 2020 అక్టోబర్ 12న సంస్థ మరోసారి బ్యారేజీ అధికారులకు లేఖ రాసింది. దానికి బదులుగా ముందు డ్యామేజీ పనులు పూర్తి చేయాలని, 2021 ఫిబ్రవరి 17న అధికారులు లేఖను సంస్థకు రాశారు. పట్టించుకోకుండా 2021 మార్చి 10న కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ మరో లేఖ రాశారు. నాటి ప్రభుత్వ నిర్మాణంతో డ్యామేజీలు బాగు చేసేలా, మిగిలిన పనులు పూర్తి చేసేలా అండర్ టేకింగ్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అలా చేయకుండా హడావుడిగా 2021 మార్చి 15న నాటి ప్రభుత్వం సంస్థకు కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇది ఇచ్చిన తేదీ నుంచి ఓ అండ్ ఎం యాక్టివిటీస్ కూడా ఐదేండ్లు సంస్థే చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ, బ్యారేజీ మరమ్మతు పనులు ప్రభుత్వమే చేయించుకోవాలని ఎల్ అండ్ టీ సంస్థ బుకాయించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
కాంక్రీట్ స్ట్రక్చర్ పరిస్థితి అంచనా
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో పరీక్షలు చేయాలని ఎన్డీఎస్ఏ సూచించింది. ఈ పరీక్షలకు సుమారు ఏడాది పడుతుందని ఫుణేకు చెందిన సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ పేర్కొంది. ఒక పరీక్షకు 12 నెలల నుంచి 18 నెలలు పడుతుందని పేర్కొనడంతో పాటు పరీక్షలు, అయ్యే ఖర్చుల వివరాలను నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఓ అండ్ ఎం)కు నివేదించింది. ప్రతిపాదనలు పంపాలని రీసెర్చ్ సెంటర్‌ను నీటి పారుదల శాఖ అధికారులు కోరారు. 9 రకాల పరీక్షలు చేయాలని, కాంక్రీట్ స్ట్రక్చర్ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయాలని, దాని సామర్ధ్యాన్ని పరీక్షించాలని, మెటల్ గేట్ల మందాన్ని కొలవాలని, నీటి సీపేజీని తెలుసుకోవడానికి బయో టెక్నికల్ అధ్యయనం చేయాలని, రెండు పిల్లర్స్ మధ్యలో నీటి ప్రవాహం వెళ్లే బే ప్రాంతంలో త్రీడీ స్ట్రెస్ ఎనాలిస్ చేయాలని, బ్యారేజీ పటిష్టతను అంచనా వేయాలని, పారలల్ సీస్మిక్ పరీక్ష నిర్వహించాలని, రాప్ట్ దిగువన పడిన గుంతను అంచనా వేయడానికి జియో ఫిజికల్ స్టడీ చేయాలని, సీపేజ్ ఎక్కడి నుంచి ఉందో తెలుసుకోవాలని సూచించింది. మూడు బ్యారేజీల్లో పరీక్షలు చేయాల్సి ఉంటుందని రీసెర్చ్ సెంటర్ పేర్కొంది. అయితే, ఎల్ అండ్ టీ సంస్థ మాత్రం డిజైన్స్‌కు జియో టెక్నిల్ ఇన్వెస్టిగేషన్స్ తగినంతగా లేకపోవడం, భూ భౌతిక పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చేసిన మోడల్ స్టడీస్‌లో లోపాలు, హైడ్రాలిక్ స్ట్రక్చరల్ డిజైన్స్ ప్రత్యేకించి ఎనర్జీ డిసిపేషన్ అంచనా తగినంత లేకపోవడం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో లోపాలు, డ్యాం సేఫ్టీ యాక్ట్ 2021కు తగ్గట్టుగా నిర్వహణ లేకపోవడానికి తాము బాధ్యులం కాదని పేర్కొంది. అయితే, సంస్థకు రైతుల ప్రయోజనాలు గానీ, ప్రజల ప్రయోజనాలు గానీ పట్టవు అనేది స్పష్టమవుతున్నది.
అధికారులపై చర్యలకు రంగం సిద్ధం?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన రిపోర్టుపై కసరత్తు జరుగుతున్నది. 17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు, మరో 22 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ రిపోర్ట్ సిఫార్సు చేసింది. వీరంతా ఇరిగేషన్ శాఖలో కీలకం. బ్యారేజీలో తొలినాళ్లలోనే సీపేజీలు ఏర్పడినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పనులు కాకముందే నిర్మాణ సంస్థకు కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం, బ్యాంక్ గ్యారంటీలను రిలీజ్ చేయడం వంటి ఘటనలపై 39 మంది అధికారులపై విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ అభియోగాలు మోపింది. ప్రస్తుతం 29 మంది సర్వీసులో ఉండగా మరో పది మంది రిటైర్ అయ్యారు.
కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక
కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. 16 నుంచి 21 వరకు పిల్లర్స్‌కు నష్టం వాటిలినట్టు పేర్కొంది. రాఫ్ట్ సపోర్ట్ కొట్టుకుపోవడం వల్ల నష్టం జరిగినట్టు తెలిపింది. ఏజెన్సీ అత్యంత నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పింది. గత మూడేళ్లుగా నిర్లక్ష్యం చోటు చేసుకున్నదని వెల్లడించింది. 2020 మే 18న నష్టాన్ని గుర్తించి పనులు చేయాలని ఏజెన్సీకి హెచ్చరించినా పట్టించుకోలేదని తెలిపింది. పిల్లర్స్ వద్ద ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వల్లే ఈ నష్టం జరిగినట్టు పేర్కొంది. నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం, కాళేశ్వరం విషయంలో ఈఎన్‌సీ తప్పిదాలు స్పష్టంగా ఉన్నాయి. ఈఎన్‌సీ చూడకుండానే పనులు పూర్తయ్యాయని నివేదిక ఇచ్చారు. ఏజెన్సీకి లబ్ధి జరిగేలా అధికారులు ప్రవర్తించారు. ఒప్పంద నియమాలను కూడా ఏజెన్సీ ఉల్లంఘించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో, నిర్వహణలో, నాణ్యతలోనూ వైఫల్యాలు ఉన్నాయని, ఇందుకు బాధ్యులుగా నిర్మాణ సంస్థ, సంబంధిత ఇంజినీర్లను నిర్ధారిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబరులో కుంగిన అనంతరం దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేపట్టింది. పని ముగియకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఇవ్వడం, బ్యాంక్ గ్యారంటీలను వెనక్కి ఇచ్చేయడం, నాణ్యత తనిఖీలు సరిగ్గా లేకపోవడం, ఒప్పందం ప్రకారం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడం, గుత్తేదారు సంస్థ ఎల్ అండ్ టీ – పీఈఎస్ జాయింట్ వెంటర్‌తో పాటు బాధ్యులైన ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలను సైతం సిఫార్సు చేసింది.
డిజైన్లకు అనుమతుల్లేవు: ఎన్డీఎస్ఏ
మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లకు సంబంధించి కొన్ని అనుమతులు, క్లియరెన్సులు లేవని ఎన్డీఎస్ఏ తేల్చింది. హైడ్రాలిక్, స్ట్రక్చరల్ డిజైన్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) సమర్పించలేదని పేర్కొంది. మేడిగడ్డపై సీడీవో ఇచ్చిన పలు డ్రాయింగ్‌లకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు, మోడల్ స్టడీస్ చేయనేలేదని, అది ఇంజినీరింగ్ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించేటప్పుడు కనీస విలువలను పాటించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. ప్రాజెక్ట్ ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్లపై సీడీవోకు ఎలాంటి సంబంధం లేదని తమకు చెప్పారని, కానీ, ఎప్పటికప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్‌పై సీడీవో అధికారులు ఆన్ సైట్లో కోఆర్డినేషన్ చేసుకున్నారని స్పష్టం చేసింది. డిపార్ట్మెంట్లోని క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌ను స్వతంత్ర విభాగంగా మార్చాలని సూచించింది. సిబ్బందిని ఎక్కువగా నియమించాలని పేర్కొంది. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఓ అండ్ ఎం మాన్యువల్‌ను సిద్ధం చేయాలని పేర్కొంది. ఇప్పటిదాకా మెయింటెనెన్స్ ప్రొటోకాల్ లేకపోవడమూ బ్యారేజీ కుంగడానికి కారణమైందని పేర్కొంది. అత్యంత కీలకమైన మోడల్ స్టడీస్‌ను నిర్వహించే ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని ఆధునికీకరించాలని సూచించింది. కాగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డ్యాములు, బ్యారేజీల నిఘా కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితే అన్నారం, సుందిళ్లలోనూ ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్టు తేల్చి చెప్పింది. అన్నారంలోని 35, 44, 28, 38 గేట్ల వద్ద భారీ సీపేజీ ఉందని, దాని కింద భారీ గోతులు ఉండడంతో పాలియురేథిన్ గ్రౌటింగ్ చేశారని పేర్కొంది. అయితే, మిగతా బ్లాకులు, గేట్ల వద్ద కూడా గోతులు ఏర్పడి ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. ఫలితంగా మిగతా చోట్ల కూడా సీపేజీలు ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటు సుందిళ్ల బ్యారేజీలలోని 46, 52, 33, 50వ గేట్ల వద్ద భారీ సీపేజీలు ఏర్పడ్డాయని, మిగతా బ్లాకుల కింద కూడా గోతులు ఉండే అవకాశం లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజీ తరహాలోనే ఈ రెండు బ్యారేజీలకూ రీహాబిలిటేషన్ డిజైన్లను ఇవ్వాలని, మేడిగడ్డకు చేసే టెస్టులు, ఇన్వెస్టిగేషన్లన్నింటినీ చేయాలని స్పష్టం చేసింది.
జియోలాజికల్ ప్రొఫైల్ స్టడీస్ చేపట్టలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
‘భూగర్భంలో రాతి పొరల నిర్మాణ క్రమాన్ని తెలిపే కీలకమైన జియోలాజికల్ ప్రొఫైల్ స్టడీ చేయకుండానే మేడిగడ్డ బ్యారేజీ నిర్మించారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో ధర్డ్ పార్టీ పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ నిర్వహణ జరగలేదు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీకి తనిఖీలు నిర్వహించలేదు. బ్యారేజీ నిర్మాణం పూర్తికాకున్నా అయిందంటూ కాంట్రాక్టర్‌కు తప్పుడు మార్గంలో గత ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు అధికారంగా ఎలాంటి సమాచారం లేదని దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యులైన అధికారులను గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.