Etela Rajender: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి అంశం గత కొన్ని నెలలుగా నలుగుతూనే ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి (Kishan Reddy) పదవి కాలం ముగిసి 10 నెలలు గడుస్తున్నా.. కొత్త నాయకుడ్ని కాషాయ అధిష్టానం ఇంకా ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీలోని ముఖ్య నాయకులు ఎవరికి వారు.. తమ పేరే ప్రకటిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటెల రాజేందర్ (Etela Rajender) ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఖరారు చేసినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ పొలిటికల్ గాసిప్స్ ప్రకారం.. సొంత పార్టీ నేతలే ఈటెలకు అధ్యక్ష పీఠం రాకుండా చేస్తున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ టూ బీజేపీ
తెలంగాణ రాజకీయాల్లో బలమైన బీసీ నేతగా ఈటెల రాజేందర్ కు సముచిత స్థానమే ఉంది. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఅర్ (KCR) కు కుడి భుజంగా ఆయన ఉంటూ వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS)లో ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పని చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తో తలెత్తిన వివాదాల కారణంగా ఈటెల పార్టీ నుంచి బయటకొచ్చారు. ఈ నేపథ్యంలో బహిరంగంగానే కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆ సమయానికి కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీలోకి చేరి ఆయనకు ఈటెలకు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నో ఆశలతో బీజేపీలోకి వచ్చిన ఈటెలకు కోరుకున్న స్థానం లభించలేదని ఆయన అనుచరులు తొలి నుంచి అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈటెల వైపే అధిష్టానం
రాష్ట్రంలో బలమైన బీసీ నేతగా ఉండటంతో పాటు.. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనగల సామర్థ్యం, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కారణంగా ఈటెల రాజేందర్ పై బీజేపీ అధినాయకత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిగా ఆయన అయితేనే బాగుంటుందని కూడా కేంద్ర వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆయన పేరు ఖరారు అయిపోయిందని.. అధికారిక ప్రకటన సైతం వచ్చేస్తోందని నిన్న గాక మెున్న ఒక్కసారిగా నెట్టింట ప్రచారం ఊపందుకుంది. మళ్లీ ఏమైందో ఏమోగానీ బీజేపీ వర్గాలు తిరిగి సైలెంట్ అయిపోయాయి. దీంతో రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం వాయిదా పడినట్లేనని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read: Bhu Bharathi Portal: రేపే భూభారతి చట్టం.. ఆ తప్పు చేస్తే కఠిన చర్యలే.. మంత్రి వార్నింగ్ !
పీఠం కోసం పోటీ
రాష్ట్ర బాధ్యతలు తమకంటే తమకే ఇవ్వాలని బీజేపీలోని ముఖ్యనాయకులు తెగ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఎస్. రామచందర్ రావు (S. Ramachandar Rao), ఎంపీలు ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri), ఎం. రఘునందన్ రావు (Madavaneni Raghunandan Rao), డీకే అరుణ (DK Aruna)తో పాటు బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, కాసం వెంకటేశ్వర్లు ఇలా ఎవరికి వారు విడివిడిగా వెళ్లి పెద్దలను కలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి నుంచి పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యం కల్పించాలని వారు కేంద్ర పెద్దలకు తేల్చి చెబుతున్నారట. అలా కాకుండా బయటవారికి అవకాశం కల్పిస్తే పార్టీలో అంతర్గత పోరు మరింత ముదిరే అవకాశముందని సూచిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బీజేపీ అధినాయకత్వం సమాలోచనల్లో పడినట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ను ప్రకటిస్తే ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నట్లు రాజకీయంగా ప్రచారం జరుగుతోంది. అందుకే బీజేపీ అధ్యక్షుడి ప్రకటనపై బీజేపీ అధినాయకత్వం మరింత సమయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆశ లేదంటున్న బండి.. కానీ!
గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన బండి సంజయ్ (Bandi Sanjay).. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వర్క్ చేస్తున్నారు. అప్పట్లో కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఆయన్ను బీజేపీ అధ్యక్ష పీఠం నుంచి తప్పించారన్న ప్రచారం బాగా జరిగింది. బండి సంజయ్ పదవి తొలగింపునకు అప్పట్లో కొత్తగా పార్టీలో ఈటెల రాజేందర్ తో పాటు.. కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి కృషి చేసినట్లు కథనాలు వచ్చాయి. ప్రస్తుతం వారిలో ఈటెల మినహా ఇద్దరు బీజేపీలో లేరు. దీంతో ఈటెలను బండి సంజయ్ టార్గెట్ చేశారన్న ప్రచారమూ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. ఈటెలకు అధ్యక్ష పదవి రాకుండా బండి ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.