- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య పరిణామాలు
- ఓవైపు కవిత అరెస్ట్.. ఇంకోవైపు అభిషేక్‌కు బెయిల్
- 5 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
- హైదరాబాద్ వెళ్లాలంటే ట్రయల్ కోర్టు అనుమతి మస్ట్
- పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశాలు
- లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయినపల్లి
Delhi Liquor Scam Interim bail, But : పార్లమెంట్ ఎన్నికల వేల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. ఇప్పటికే హైదరాబాద్ వచ్చి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. కోర్టు ముందుకు ఆమెను ప్రవేశపెట్టగా కస్టడీ విధించింది న్యాయస్థానం. దీనిపై ఆమె సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న సమయంలోనే కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ రావు బోయినపల్లికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
5 వారాల బెయిల్.. కండిషన్స్ అప్లై
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అభిషేక్ బోయినపల్లికి బెయిల్ లభించింది. 5 వారాల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ వెళ్లాలని ఆదేశించింది. అలాగే, పాస్ పోర్టు సరెండర్ చేయాలని అభిషేక్‌కు కోర్టు సూచించింది. ఈ క్రమంలోనే 5 వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
Read Also: స్కీములతో మస్కా! అధిక వడ్డీ పేరుతో భారీ మోసం
ఎవరీ అభిషేక్ రావు?
లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్నాడు అభిషేక్ రావు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా ఏ-15గా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైకి చెందిన రాబిన్ డిస్టిలరీస్ సంస్థకు అభిషేక్ డైరక్టర్ గా ఉన్నాడు. ఈ కేసులో ఏ-8గా ఉన్న సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్ సంస్థకు, అభిషేక్ సంస్థకు మధ్య లావాదేవీలు జరిగాయి. వీటిని గుర్తించిన సీబీఐ, వాటి కూపీ లాగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో సోదాలు జరిపింది. అభిషేక్ ఖాతాలోకి రూ.3.8 కోట్ల దాకా వచ్చినట్టు, వాటిని పలు వ్యాపారాల్లోకి మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. పైగా, వాటికి సరైన ఆధారాలు చూపకపోవడంతో సీబీఐ అరెస్ట్ చేసింది.
కేసులో కీలకంగా సౌత్ గ్రూప్
ఢిల్లీ లిక్కర్ పాలసీపై అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా విచారణకు ఆదేశించడంతో 2022, ఆగస్టు 17న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తర్వాత కొద్ది రోజులకు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈసీఐఆర్ దాఖలు చేసింది. అదే ఏడాది నవంబర్ 25న తొలి ఛార్జిషీట్ దాఖలైంది. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారులు, రాజకీయ నాయకులు కలిసి సౌత్ గ్రూప్ పేరుతో ఆప్ నేతలతో లావాదేవీలు జరిపారని అందులో పేర్కొంది. మనీశ్ సిసోడియా తరఫున విజయ నాయర్ కథంతా నడిపించాడని వెల్లడించింది. సౌత్ గ్రూప్‌నకు ప్రత్యక్షంగా పరోక్షంగా 9 రిటైల్ జోన్లను కేటాయించారు. ఈ క్రమంలో వంద కోట్ల ముడుపులు అందినట్టు అధికారులు తెలిపారు.
Read Also : ట్యాపింగ్ లింక్స్.. నెక్స్ట్ టార్గెట్‌గా ఎర్రబెల్లి..!
2021లో హైదరాబాద్ ఐటీసీ కోహినూర్‌లో రామచంద్ర పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు సహా పలువురు విజయ్ నాయర్‌తో భేటీ అయ్యారు. కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి సౌత్ గ్రూప్‌లో ఉండగా, వీరికి ప్రతినిధులుగా అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు వ్యవహరించినట్టు సీబీఐ పేర్కొంది. పలుమార్లు సమావేశమైన వీళ్లు వంద కోట్ల ముడుపులపై చర్చించుకున్నట్టు వివరించింది. ఈ క్రమంలోనే వరుస అరెస్టులు చోటు చేసుకున్నాయి. ముందుగా సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ రావు, అమిత్ అరోరా, సిసోడియాలను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిలో కొందరు అప్రూవర్లుగా మారడంతో కవిత అరెస్ట్‌కు దారితీసింది.