– అధిక వడ్డీ ఆశజూపి భారీ మోసం
– బోర్డు తిప్పేసిన ‘జేవీ బిల్డర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’
– కొత్త కొత్త స్కీములతో బురిడీ
– రూ.కోట్లలో వసూలు చేసి ఉడాయించిన దంపతులు
– ఉప్పల్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు
Maska With Schemes! High Interest Is A Huge Scam : మనిషి ఆశే కొందరికి పెట్టుబడి. డబ్బుపై ఉండే అత్యాశను ఆసరాగా చేసుకుని ఎంతోమందిని బురిడీ కొట్టిస్తుంటారు. తాజాగా, అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలతో దంపతులు ఉడాయించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. తక్కువ సమయంలోనే భారీగా అర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన బోర్డు తిప్పేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగింది. నిందితులు కోట్లలో డబ్బు సమకూర్చుకొని ఉడాయించడంతో బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.
జేవీ బిల్డర్స్ పేరుతో ప్లాన్
ఉప్పల్ నల్లచెరువు సమీపంలోని విమల నివాస్‌లో ఏడాది కాలంగా స్థిరాస్తి సంస్థగా ‘జేవీ బిల్డర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ నడుస్తోంది. దీనిని వేలూరి లక్ష్మీనారాయణ, వేలూరి జ్యోతి అనే దంపతులు నడిపిస్తున్నారు. గతంలో బోడుప్పల్, మేడిపల్లిల్లో నడిపించారు. కానీ, అక్కడి నుంచి ఉప్పల్‌కు షిఫ్ట్ చేశారు. రకరకాల ఆకర్షణీయమైన స్కీములతో పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేశారు. రూ.10 లక్షలు పెడితే ప్రతి 15 రోజులకు రూ.20 వేల వడ్డీతో పాటు అసలు రూ.లక్ష చొప్పున ఇస్తామని వినియోగదారులను నమ్మించారు. పెట్టుబడి పెట్టినవారికి మరింత నమ్మకం కలిగించేందుకు కొందరి పేరిట వ్యవసాయ, వ్యవసాయేతర భూములను కూడా రిజిస్ట్రేషన్ చేయించారు.
కమీషన్ల ఆశ చూపి మోసం
మీరు పెట్టుబడులు పెట్టడమే కాదు, కొత్త సభ్యులను చేర్పిస్తే పెద్ద మొత్తంలోనే కమీషన్లు ఇస్తామని నమ్మబలికారు లక్ష్మీనారాయణ, జ్యోతి. ఈ క్రమంలో వేల మంది ఆకర్షితులై డబ్బులు చెల్లించారు. ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు ఏకంగా 18 లక్షలు సమర్పించుకున్నాడు. ఏజెంట్‌గా కూడా చేరాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 500 మందికి పైగా ఏజెంట్లు తయారై వేల మందిని స్కీముల్లో చేర్పించారు. కొంతకాలం అనుకున్నట్టే చెప్పిన విధంగా చెల్లింపులు చేయడంతో మరికొంత మంది ఆకర్షితులయ్యారు. ఆశతో భారీగా డబ్బులు అప్పజెప్పారు.
ఆఫీస్‌కి తాళం.. పోలీసుల ముందుకు బాధితులు
గత నెల రోజులుగా సంస్థ నిర్వాహకులు లక్ష్మీనారాయణ, జ్యోతి ఎవరికీ డబ్బులు చెల్లించడం లేదు. ఫోన్లు చేసినా స్పందించడం లేదు. అనుమానం వచ్చిన కొందరు ఆ సంస్థ ఆఫీస్‌కు వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో 10 మంది బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము రూ.2.50 కోట్ల వరకు మోసపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల సంఖ్య వేలలోనూ, మోసపోయిన సొమ్ము కోట్లలో ఉంటుందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.