Sheep Distribution Scam: బీఆర్ఎస్ పాలనలో లెక్కలేనన్నీ స్కాములు జరిగాయి. కాకపోతే కొన్నే బయటకు వచ్చాయి. అలా వచ్చిన వాటిలో గొర్రెల స్కామ్ ఒకటి. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకంలో అనేక అవకతవకలు జరిగాయి. వాటి లెక్కలన్నీ బయటకు తీసే పనిని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏసీబీ (ACB) కి అప్పగించింది. విచారణలో సంచలన నిజాలు వెలుగుచూడగా, తర్వాత ఈడీ (ED) ఎంట్రీ ఇచ్చింది. ఇదే క్రమంలో కేసులో ఏ1గా ఉన్న కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ఎట్టకేలకు పట్టుబడడంతో ఈ స్కామ్ (Scam) వెనుక ఉన్న కింగ్ పిన్ ఎవరో ఇక బయటపడుతుందన్న చర్చ జరుగుతున్నది.
స్కామ్ జరిగింది ఇలా..
2014లో ఉద్యమ సెంటిమెంట్‌తో అధికారాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్, రెండోసారి ఎన్నికల సమయంలో ముందస్తుకు వెళ్లింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఏడాది 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తొలి విడుతగా రూ.12వేల కోట్లను కేటాయించింది. కానీ, కిందిస్థాయిలో అంతా ఇష్టారాజ్యంగా కొనసాగింది. ఆ అక్రమాల డొంక అంతా 2024 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన నెల రోజుల్లో బయటపడింది. గతంలో పశు సంవర్ధక శాఖలో ఏడీలుగా పని చేసిన కేశవ్, రవికుమార్‌తోపాటు మొయినుద్దీన్ అనే కాంట్రాక్టర్, అతని కొడుకు ఇక్రముద్దీన్ స్కామ్‌కు శ్రీకారం చుట్టారు. 2023, ఆగస్టు 18న ఆంధ్రాలోని పల్నాడు జిల్లా పల్నాడు మండలం అంగలూరు గ్రామంలోని ఏడుకొండలుతోపాటు మరో 17మంది నుంచి 133 యూనిట్లు (ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేల్) కొనుగోలు చేశారు. దానికి సంబంధచిన మొత్తం రూ.2.10 కోట్లు బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని చెప్పారు. కానీ, డబ్బు మాత్రం జమ కాలేదు. దాంతో అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన అమ్మకందారులు 2024, జనవరిలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు ఏసీబీ చేతికి వచ్చింది. విచారణలో సంచలన నిజాలు వెలుగు చూశాయి.
ఒకటి రెండు కాదు.. 700 కోట్ల దాకా పక్కదారి
ఏసీబీ అధికారులు విచారణ జోరందుకునే కొద్దీ కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ఒకటి కాదు రెండు కాదు గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల దాకా స్కామ్ జరిగిందని తేల్చింది.
చాలామందికి గొర్రెలు పంపిణీ చేయకుండానే చేసినట్టుగా రికార్డుల్లో చూపించి దర్జాగా డబ్బులు కాజేశారు. దీంతో గొర్రెల కొనుగోలుకు సంబంధించి నోడల్ అధికారులుగా వ్యవహరించిన మేడ్చల్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య కేశవసాయి, కామారెడ్డి జిల్లా పశు వైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, వయోజన విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గణేశ్, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల శాఖ అధికారి రఘుపతి రెడ్డి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ది సమాఖ్య ఎండీగా పని చేసిన రాంచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఓఎస్డీగా పని చేసిన కళ్యాణ్‌లను అదుపులోకి తీసుకుంది. అయితే, గత ప్రభుత్వ పెద్దల అండతో చక్రం తిప్పిన ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ కేసులు నమోదు కాగానే దుబాయ్ చెక్కేశారు. అప్పటి నుంచి తిరిగి రాలేదు. ఈ ఇద్దరిని విచారిస్తే స్కామ్ వెనుక సూత్రధారుల గుట్టంతా బయటపడుతుందని ఏసీబీ భావిస్తున్నది. అందుకే వారిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.
ఎట్టకేలకు మొయినుద్దీన్ అరెస్ట్
కేసు నమోదైన విషయం తెలిసి దుబాయ్ చెక్కేసిన మొయినుద్దీన్ హైదరాబాద్ తిరిగి రావడంతో ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మొత్తం 17 మందిని అదుపులోకి తీసకున్నారు. ప్రధాన నిందితుడుగా ఉన్న మొయినుద్దీన్ పట్టుబడడంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొన్నది. అరెస్ట్ తర్వాత మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కూడా జరిపారు. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మొయినుద్దీన్ తన భార్య ఖాతాకు ఎక్కువ మొత్తంలో నగదు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు గుర్తించారు. మొదట సోదాలను అతని భార్య అడ్డుకోగా, సెర్చ్ వారెంట్ చూపించడంతో వెనక్కి తగ్గింది. రెండు కార్లను కూడా అధికారులు సీజ్ చేశారు.
స్కామ్‌లో అసలు సూత్రధారులు ఎవరు?
ఈ స్కామ్‌లో ఇప్పటిదాకా పాత్రధారుల వరకే బయటపడింది. అసలు సూత్రధారులు ఎవరన్నది సస్పెన్స్‌గా ఉన్నది. నిజానికి ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఒక్కో యూనిట్ ను రూ.1.25 లక్షలకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ, యూనిట్ ధర రూ.1.75 లక్షలకు పెరిగింది. ఇదంతా ఏసీబీ విచారణలో నిర్ధారణ అయ్యింది. అనధికారికంగా యూనిట్ ధరను పెంచినట్టు స్పష్టమైంది. అప్పటి ప్రభుత్వంలోని ఇద్దరు కీలక మంత్రుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగినట్టుగా బలమైన ఆరోపణలు ఉన్నాయి. మొయినుద్దీన్‌కు ఆ ఇద్దరు మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా అనుమానాలున్నాయి. ఇప్పుడు అతను పట్టుబడడంతో స్కామ్‌లో కింగ్ పిన్ ఎవరన్న చర్చ జోరుగా జరుగుతున్నది. మరోవైపు, ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా ఈ కేసును విచారిస్తున్నది.
Read Also- Quantum Valley: అమెరికాలో సిలికాన్ వ్యాలీ.. అమరావతిలో క్వాంటం వ్యాలీ
Jabardasth Tanmay: కిరాక్ ఆర్పీ మోసం చేశాడు.. అందరూ నాలో అవే చూశారు!