– కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్‌లో మార్పు
– సమస్యల నడుమ అంతా సజావుగా సాగేనా?
– పార్టీని వెంటాడుతున్న జనసమీకరణ
– నలుగురు మినహా మిగిలిన 13 మంది అభ్యర్థులు కొత్తవారే
– ఇప్పటికే వలస వెళ్లిపోయిన కొందరు సీనియర్లు
– లోలోపల రగిలిపోతున్న మిగిలిన నేతలు
– సమస్యల వలయంలో బస్సు యాత్రపై ఆసక్తికర చర్చ
Ex Cm Kcr Bus Yatra updates(Political news in telangana): పార్లమెంట్ ఎన్నికలకు మరో 3 వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం యాత్ర సోమవారం మొదలవ్వాలి. కానీ, ఇది 24కు వాయిదా పడింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుండగా మే 10న సిద్ధిపేట బహిరంగ సభతో ముగియనుంది. ప్రస్తుతం వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు కేసీఆర్. అన్ని దారులు మూసుకుపోయాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో సాగనున్న బస్సు యాత్ర ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది పెద్ద ప్రశ్న.
కేసీఆర్.. పెద్దగా ఆసక్తి చూపడం లేదా?
లోక్ సభ ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ అంత ఆసక్తిగా లేనట్లుగా కనిపిస్తోంది. ప్రతీ ఎన్నికలకు ముందు భారీ బహిరంగసభ పెట్టి నగారా మోగించే ఆయన ఈ పార్లమెంట్ ఎన్నికలకు బస్సు యాత్రతో సరిపెడుతున్నారు. దాన్ని కూడా వీలైనంత ఆలస్యంగా చేస్తున్నారు. సోమవారం నుంచి యాత్ర ప్రారంభించాలనుకున్నారు కానీ.. రెండు రోజుల వాయిదా తర్వాత ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. మే 11వ తేదీ సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తుది. పొలంబాట, రోడ్ షోలు, కార్నర్ మీటింగులు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ముగింపు సభను సిద్దిపేటలో నిర్వహిస్తారు. పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడూ ఎదుర్కోనంత క్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలను ఢీకొట్టబోతున్నారు. నిజానికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఆ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ మరింతగా నలిగిపోతోంది. రాష్ట్ర ఎన్నికల్లోనే పట్టించుకోని ఓటర్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టించుకుంటారా అన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో ఉంది. కేసీఆర్ తుంటి గాయంతో గట్టిగా నిలబడలేని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయినా ఆయనకు తప్పడం లేదు. కేటీఆర్ ప్రచారభారాన్ని మోసేంత నేతగా మారలేదు. హరీష్ రావు మెదక్ కు పరిమితం అయ్యారు. మొత్తంగా కేసీఆర్‌కు ప్రచారం ప్రారంభించి పూర్తి చేయడం ఓ సవాలే.
Also Read: బీజేపీ, బీఆర్ఎస్ కుట్రల్ని తిప్పికొడుదామన్న సీఎం..!
క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది. పదేండ్లు రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంతో పాలించిన కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోకముందే లోక్ సభ ఎన్నికలు పార్టీ మనుగడకే సవాల్ విసురుతున్న పరిస్థితి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో గణనీయ ఫలితాలు సాధించని పక్షంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం సిద్ధించిన అనంతరం అప్రతిహతంగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్. మూడోసారి అనూహ్యంగా పరాజయం పాలయ్యింది. తీవ్రమైన ఓటమి నుంచి కోలుకోకముందే నాలుగు నెలల స్వల్పకాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు ముంచుకురావడం సవాల్‌గా మారింది. నిజానికి ఇలా రావడం గతంలో కేసీఆర్ వ్యూహమే. అప్పట్లో ప్లస్ అయిందేమో కానీ ఇప్పుడు మైనస్‌గా మారుతోంది.
చుట్టుముడుతున్న కేసుల భయం
కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఇరుక్కోవడం అసెంబ్లీ ఎన్నికల ముందు ఎజెండా కాగా, ఎన్నికల తర్వాత రాద్ధాంతంగా మారింది. కవిత అరెస్టు, జైలు బీఆర్ఎస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెడకు చుట్టుకుంటోంది. కాళేశ్వరం సహా ఇతర అవినీతి స్కాములను కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీస్తోంది. ఇలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనగా గోరుచుట్టుపై రోకలిపోటులా పార్టీ నుంచి భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు వలసపోవడం జరుగుతోంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలకు పెద్ద సంఖ్యలో సాగుతున్న వలసలు గులాబీ నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ బస్సు యాత్ర పెద్ద సాహసమే అవుతుంది.
Also Read:మోదీకి ఎలక్షన్ కోడ్ వర్తించదా?
కొత్త అభ్యర్థులతో ఎన్నికల బరిలోకి
17 ఎంపీ స్థానాలకుగానూ ముగ్గురు సిట్టింగులకు బీఆర్ఎస్ అధినేత అవకాశం కల్పించారు. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ స్థానాలు సిట్టింగులకు ఇచ్చారు. కరీంనగర్ సీటు గత ఎన్నికల్లో పోటీచేసిన బీ వినోద్ కుమార్‌కు దక్కింది. ఇక మిగిలిన 13 స్థానాల్లో కొత్తవారిని బరిలో దింపారు. ఓడిపోయే స్థానానికి పోటీ ఎందుకనే అభిప్రాయంతో పలువురు నేతలు ఉన్నారన్న చర్చలు నడిచాయి. వలసలను నివారించేందుకు బుజ్జగింపులు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. చేవెళ్ళ టికెట్ రంజిత్ రెడ్డికి ముందుగా డిక్లేర్ చేసినప్పటికీ ఆ పార్టీని కాదంటూ అధికార కాంగ్రెస్‌లో చేరిపోయి పోటీకి సిద్ధమయ్యారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పార్టీ మారుతున్నారని తెలిసి ఆయనను బలవంతంగా కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి బుజ్జగించినా ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. అంతేకాదు, వరంగల్ ఎంపీ అభ్యర్థి మారిపోయారు.
వెంటాడుతున్న నిధుల సమస్య
ఇప్పుడు కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పెట్టెబేడా సర్దేసుకుని కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఉన్న ఆ కొందరు నేతలు లోన రగిలిపోతున్నారు. ఇప్పుడు వాళ్లంతా కోవర్టులుగా పనిచేయాలని భావిస్తున్నట్టు టాక్. అంతేకాదు కేసీఆర్ బస్సు యాత్రలో భాగస్వామ్యం కాకూడదని, జనసమీకరణ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీలో ఉన్న మరికొందరు నేతలు ఒకరితో ఒకరికి గిట్టక గ్రూపులు కడుతున్నారు. పైగా, జనసమీకరణకు తగినన్ని నిధులు కావాలి. జనం రాకపోతే నవ్వులపాలవ్వాల్సి వస్తుంది. ఇటీవల రైతు సమస్యలపై పర్యటనలు చేసిన కేసీఆర్‌కు ప్రతిచోటా జనం లేకపోవడం కనిపించింది. దీంతో బస్సు యాత్ర మొక్కబడిగా సాగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ తొలిసారిగా బస్సు యాత్ర నిర్వహిస్తుండగా, ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి మరి.