Toxic Controversy: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic) విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయంటూ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘టాక్సిక్’ టీజర్‌లో ఒక సన్నివేశంపై ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. కారులో యష్ ఒక మహిళతో కలిసి ఉన్న దృశ్యం అసభ్యకరంగా ఉందని, అది మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి చెందిన మహిళా విభాగం కర్ణాటక మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
Read also-BMW Review: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉందంటే?.. ఫుల్ రివ్యూ
మహిళా కమిషన్ స్పందన
ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కి లేఖ రాసింది. బహిరంగంగా అందుబాటులో ఉన్న టీజర్లలో ఇటువంటి దృశ్యాలు యువతపై, ముఖ్యంగా పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కమిషన్ పేర్కొంది. సదరు సన్నివేశాలపై విచారణ జరిపి, అవసరమైతే వాటిని తొలగించాలని లేదా తగిన చర్యలు తీసుకోవాలని బోర్డును కోరింది. ఇప్పటికే ఈ గ్లింప్స్ దాదాపు 200 మిలియన్ల వ్యూస్ దాటేశాయి. అంతే ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రజాదరణ పొందుతున్న ఈ గ్లింప్స్ వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. అయితే దీనికి సంబంధించిన కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.
Read also-RajaSaab Boxoffice: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నాలుగు రోజుల గ్రాస్ అదరగొట్టాడుగా.. మొత్తం ఎంతంటే?
సామాజిక కార్యకర్తల అభ్యంతరాలు
మహిళా కమిషన్‌తో పాటు సామాజిక కార్యకర్త దినేష్ కల్లహల్లి కూడా సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషికి లేఖ రాశారు. సోషల్ మీడియాలో ఎటువంటి నియంత్రణ లేకుండా ఇటువంటి దృశ్యాలు వైరల్ అవ్వడం సామాజిక బాధ్యతారాహిత్యమని ఆయన మండిపడ్డారు. విమర్శల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించారు. మహిళల సమ్మతి, వారి అభిప్రాయాల పట్ల ఉన్న అవగాహన గురించి ఆమె ప్రస్తావించారు. అయితే, అధికారికంగా చిత్ర బృందం ఈ వివాదంపై ఇంకా పూర్తిస్థాయి వివరణ ఇవ్వాల్సి ఉంది.

