studios trade license issue: టాలీవుడ్ లో ఏ సినిమా జరిగినా తరచుగా వినబడే పేర్లు, అన్నపూర్ణ స్టూడియో, రమానాయుడు స్టూడియో. ఈ రెండు స్టూడియోలు రోజూ రెంట్ల రూపంలో లక్షల్లో అర్జిస్తాయి, కానీ పన్నుకట్టాల్సి వచ్చినపుడు వేలల్లో కడుతుంటాయి. ఇప్పటి వరకూ ఎవరూ దీనిని గుర్తించలేదు. తాజాగా దీనిని గుర్తించిన బల్దియా ఆయా స్టూడియోలకు షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుల్లో భారీ వ్యత్యాసాలను గుర్తించిన బల్దియా, స్టూడియో యాజమాన్యాలకు పూర్తి స్థాయి ఫీజులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. మా దగ్గర లక్షలు తీసుకుంటూ మీరు వేలల్లో పన్నులు కట్టడం ఏంటని నిర్మాతలు వాపోతున్నారు.
Read also-Akhanda 2: బాలయ్య బాబు ‘అఖండ 2’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరంటే?..
ట్రేడ్ లైసెన్స్ వివాదం
GHMC జరిపిన తనిఖీలలో, ఈ స్టూడియోలు తమ వాస్తవ వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి, సంవత్సరాలుగా తక్కువ ఫీజు చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. నివేదికల ప్రకారం, అన్నపూర్ణ స్టూడియో దాదాపు రూ. 11.52 లక్షలు ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లిస్తోంది. అదే విధంగా, రామానాయుడు స్టూడియో రూ. 1.92 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాల్సిన స్థానంలో, అతి తక్కువగా రూ.1,900 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తమ వ్యాపార విస్తీర్ణానికి అనుగుణంగా బకాయిలతో సహా పూర్తి ఫీజు చెల్లించాలంటూ GHMC స్టూడియోలకు ఆదేశాలు జారీ చేసింది.
Read also-Miss Universe 2025: మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఫాతిమా బాష్.. అవమానాలను సైతం ఎదిరించి..
స్టూడియోలకు ఆదాయం ఇలా..
ఈ స్టూడియోలు కేవలం సినీ షూటింగ్స్‌కే కాకుండా, అనేక ఇతర వ్యాపార కార్యకలాపాలతో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. వాటి ఆదాయ మార్గాలు ఈ విధంగా ఉన్నాయి.
ఫ్లోర్ రెంటింగ్: సినిమా షూటింగ్ కోసం ఫ్లోర్‌లను రోజువారీ అద్దెకు ఇవ్వడం ప్రధాన ఆదాయం. కేవలం సెట్ వర్క్ జరిగితే ఒక రేటు, షూటింగ్ జరిగితే మరో రేటు వసూలు చేస్తారు. రోజుకు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు రెంట్లు ఉంటాయి.
పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు: డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ స్టూడియోలు మ్యూజిక్ యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా, DI డిజిటర్ ఇంటర్మీడియేట్ సేవలకు టెక్నీషియన్ ని బట్టి గంటకు రూ.300 నుండి రూ.600 వరకు ఛార్జ్ చేస్తారు.
బిగ్ బాస్ లీజు: అన్నపూర్ణ స్టూడియోలో ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సెట్‌ను ఎండమాల్ షైన్ ఇండియా అనే కంపెనీ నిర్వహిస్తోంది. ఈ కంపెనీ కేవలం వన్ ఇయర్ లీజుకు స్టూడియోకు సుమారు రూ.1.60 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ లీజు మొత్తం స్టూడియోకు స్థిరమైన, అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంది.
మొత్తం మీద భారీ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలను, అపారమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఈ స్టూడియోలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుల విషయంలో నిబంధనలను ఉల్లంఘించడం చర్చనీయాంశమైంది. ఈ నోటీసులపై స్టూడియో యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో, బకాయిలను చెల్లిస్తాయో లేదో వేచి చూడాలి.
