Tollywood OG: సినిమా రంగంలో ‘ఓజీ’ (Original Gangster) అనే పదం కేవలం ఒక సినిమా టైటిల్ మాత్రమే కాదు. అది ఒక హీరో దశాబ్దాల పాటు తన క్రేజ్‌ను నిలబెట్టుకుని, బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా చాటుకునే స్థాయిని తెలియజేస్తుంది. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ స్థానంలో నిస్సందేహంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు అందుకున్న పవన్, ఆ తర్వాత దాదాపు పదేళ్ల పాటు సరైన కమర్షియల్ సక్సెస్ లేకపోయినప్పటికీ, ఆయన క్రేజ్ పెరుగుతూ ఉంది తప్పితే.. ఏమాత్రం తగ్గకపోవడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచిన విషయం. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా కలెక్ట్ చేసిన మొత్తాన్ని, ఇప్పుడున్న కొంతమంది స్టార్ హీరోలు హిట్‌తో కూడా సాధించలేకపోతున్నారు అంటే ఆయన స్టామినా ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వచ్చిన ‘ఓజీ’ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ పవర్‌ను నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్.
ఎంతవరకు సమంజసం?
ప్రస్తుతం ఆయన సినిమాలు చేస్తారనేలా వార్తలు వినిపిస్తున్నా.. త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందనేలా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. పవన్ కళ్యాణ్‌కు ఉన్న అటువంటి నిలకడైన సత్తా, స్టామినా ఇప్పుడు యువ హీరోల్లో ఎవరికైనా ఉందా? ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లోని కొందరు యంగ్ హీరోలు తమను తాము తదుపరి ‘ఓజీ’లుగా అభివర్ణించుకుంటున్నారు. కానీ, ఒక్క సినిమా ఫ్లాప్ అయితేనే మార్కెట్ విలువ దారుణంగా పడిపోతున్న ఈ రోజుల్లో, మేమే ఓజీ అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని సినీ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఓజీ’ అనే హోదాను కేవలం ఓవర్‌నైట్ సక్సెస్‌తోనో, హడావిడితోనో సాధించలేరు. దానికి కాలం, వైఫల్యాలను తట్టుకుని నిలబడే స్థిరత్వం అవసరం.
Also Read- Prabhas Spirit: ట్రీట్ అదిరింది.. బొమ్మ కనబడలేదు కానీ.. ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ మాస్ వైలెంట్!
ఆ హీరోలకు మాత్రమే ఛాన్స్ ఉంది
ప్రస్తుత టాలీవుడ్ ట్రెండ్‌ను, హీరోల బాక్సాఫీస్ స్టామినాను పరిశీలిస్తే, పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయిలో నిలకడను, ఫ్లాప్‌లు వచ్చినా బాక్సాఫీస్‌ను షేక్ చేసే క్రేజ్‌ను కొనసాగించగలిగే అవకాశం ఆయన సమకాలీన హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)లకు మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా లిస్ట్‌లో ఉంటారు. కానీ, ఇప్పుడున్న యువ హీరోలెవరూ (Young Heroes) ఆ స్థాయి నిలకడైన క్రేజ్‌ని అందుకోలేక పోతున్నారు. ‘ఓజీ’ అనేది కేవలం ఒక టైటిల్ కాదు, అది దశాబ్దాల నిలకడ, ప్రేక్షకులతో ఏర్పడిన బలమైన భావోద్వేగ అనుబంధం ద్వారా వచ్చే గౌరవం. ఈ గౌరవాన్ని అందుకోవాలంటే, యంగ్ హీరోలు కేవలం హిట్ రేట్‌పై కాకుండా, నిలకడైన స్టార్‌డమ్‌పై దృష్టి పెట్టాలి. చూద్దాం.. మరి యంగ్ హీరోలు ఎలా ఆలోచిస్తారో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

