Tollywood Heroines: దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగి, స్టార్ డమ్‌ను అందుకున్న హీరోయిన్లు (South Heroines) జాతీయ స్థాయిలో గుర్తింపు, పెద్ద కాన్వాస్‌పై నటించాలనే ఆశతో బాలీవుడ్ (Bollywood) బాట పట్టడం కొత్తేమీ కాదు. అయితే, ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోయిన్లు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సరైనదనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో, సినీ అభిమానుల్లో తీవ్రంగా నడుస్తోంది. గతంలో అనేక మంది దక్షిణాది తారలు బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంతమందికి రష్మిక మందన్న మాదిరిగా ఓ మోస్తరు విజయం, గుర్తింపు దక్కినా, ఎక్కువ మంది హీరోయిన్లు ఎక్కువ కాలం అక్కడ నిలదొక్కుకోలేకపోయారు. రష్మిక మందన్నా (Rashmika Mandanna) సైతం తన టాలీవుడ్ స్థానాన్ని పూర్తిగా పదిలం చేసుకోలేక, బాలీవుడ్‌లోనూ ఇంకా స్థిరపడలేక రెండు చోట్లా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, బాలీవుడ్ మాయలో పడి దక్షిణాదిలో తమకున్న స్థానాన్ని కూడా కోల్పోయి, తిరిగి రాలేక చివరికి సినిమా పరిశ్రమకే పూర్తిగా గుడ్ బై చెప్పిన పరిస్థితులు గతంలో చాలానే చూశాం. తమకంటూ ఒక పటిష్టమైన స్థానం ఉన్న టాలీవుడ్‌ను పూర్తిగా వదిలేసి, అస్థిరంగా ఉండే బాలీవుడ్ వైపు మొగ్గు చూపడం పెద్ద రిస్క్ అనే అభిప్రాయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది.
Also Read- Telugu Indian Idol S4: షోకి గెస్ట్‌గా పిలిచి.. బ్రహ్మానందాన్ని అలా ఏడిపించారేంట్రా? ప్రోమో వైరల్
బాలీవుడ్ బాట పడుతున్న శ్రీలీల, మీనాక్షి
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల (Sreeleela).. బాలీవుడ్‌లో ఇప్పటికే ఓ సినిమా పూర్తి చేస్తుంది. ఆమె చేస్తున్న సినిమా చివరి దశ షూటింగ్‌లో ఉంది. అంతేకాకుండా, ఆమెకు హిందీలో మరిన్ని ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, వరుస సినిమాలతో బిజీ అయిన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కూడా త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే వీరు బాలీవుడ్ వైపు దృష్టి సారించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. టాలీవుడ్ భామలు ఉత్తరాదికి వెళ్తున్న ఈ తరుణంలో, అక్కడి సినీ మార్కెట్ పరిస్థితిని ఒకసారి గమనించాలి. గత కొద్దికాలంగా బాలీవుడ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే అక్కడి స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో, ముఖ్యంగా పాన్-ఇండియా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీపికా పదుకొనే (Deepika Padukone), ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) వంటి బాలీవుడ్ అగ్ర తారలు కూడా ఇప్పుడు పెద్ద ప్రాజెక్టుల కోసం టాలీవుడ్ వైపు చూస్తున్నారు. బాలీవుడ్ తారలే ఇటువైపు వస్తున్న తరుణంలో, టాలీవుడ్ భామలు స్టార్ డమ్‌ను వదులుకుని ఉత్తరాదికి వెళ్లడం అంటే.. వారు నిజంగా సరైన నిర్ణయం తీసుకుంటున్నారా? తప్పు చేస్తున్నామని అనుకోవడం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read- Dammu Srija: వాడు, వీడు అంటూ నాగ్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీజ.. వీడియో వైరల్!
ఈ ఛాయిస్ ఉన్నా కూడా..
బాలీవుడ్ అనేది జాతీయ స్థాయిలో పెద్ద మార్కెట్.. కాదనలేం. అక్కడ విజయం సాధిస్తే వచ్చే గుర్తింపు, గౌరవం వేరేగా ఉంటాయి. కానీ, టాలీవుడ్‌లో కష్టపడి సంపాదించుకున్న స్టార్ డమ్‌ను రిస్క్‌లో పెట్టడం ఎంతవరకు అవసరం? ముఖ్యంగా, దక్షిణాది చిత్రాలదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా హవా నడుస్తోంది. స్థానిక స్టార్స్‌గా కొనసాగుతూనే పాన్-ఇండియా సినిమాల ద్వారా దేశమంతా గుర్తింపు పొందడానికి పుష్కలంగా అవకాశం ఉంది. బాలీవుడ్‌కు పూర్తిగా మకాం మార్చకుండా, తమ సౌత్ బేస్‌ను పటిష్టంగా ఉంచుకుంటూనే, అప్పుడప్పుడు హిందీలో ఆకర్షణీయమైన ప్రాజెక్టులను ఎంచుకోవడమే తెలివైన నిర్ణయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. లేదంటే, జాతీయ స్థాయి స్టార్ కావాలనే ఆరాటంలో, స్థానిక స్టార్ డమ్‌ను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ, ఇలియానా, అసిన్ వంటి వారు టాలీవుడ్‌లో మంచి గుర్తింపును పొందారు. ఇక సమంత (Samantha) గురించి చెప్పేదేముంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో గమనిస్తే.. సౌత్ భామలు నిర్ణయాల్లో మార్పు రావచ్చు. కానీ, గమనించేంత ఓపిక, టైమ్ వారికి లేవు. ఇంకా ఇంకా బాలీవుడ్ మోజులోనే హీరోయిన్లు ఉంటున్నారు. అలాంటి వారందరికీ ఎప్పటికి కనువిప్పు కలుగుతుందో చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
