Maruthi Emotional: ‘ది రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ వేదికపై దర్శకుడు మారుతీ చేసిన ప్రసంగం ఒక సినీ దర్శకుడి ప్రసంగంలా కాకుండా, ఒక అభిమాని తన ఆరాధ్య దైవం గురించి మనసు విప్పి మాట్లాడినట్లుగా సాగింది. సుమారు మూడు సంవత్సరాల నిరీక్షణ, కష్టం ప్రభాస్ పట్ల ఉన్న గౌరవం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించాయి.
Read also-RajaSaab Prabhas: 15 ఏళ్ల తర్వాత వస్తున్నా.. క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు.. ప్రభాస్..
మారుతీ తన ప్రసంగం మొదలుపెడుతూనే ప్రభాస్‌ను ‘కింగ్ సైజ్ కటౌట్’ అని సంబోధించారు. తను ఇప్పటివరకు 11 సినిమాలు చేశానని, ఒక మిడ్-రేంజ్ దర్శకుడిగా ఉన్న తనను పిలిచి, “నువ్వు ఇక్కడ కాదు, రెబెల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వు.. పెద్ద దర్శకుడివి అవ్వు” అంటూ ప్రభాస్ ప్రోత్సహించిన తీరును గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగినా, ఆయనలో ఉన్న సాదాసీదా స్వభావం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు.తెలుగు సినిమాను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారికి మారుతీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒక ప్రాంతీయ హీరోని ప్రపంచ స్థాయి కటౌట్‌గా నిలబెట్టిన ఘనత ఆయనదేనని, ఈరోజు తెలుగు దర్శకులు గర్వంగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారంటే దానికి రాజమౌళి గారే కారణమని పేర్కొన్నారు.
‘ది రాజా సాబ్’ కేవలం ఒక గర్ల్ ఫ్రెండ్-బాయ్ ఫ్రెండ్ కథ కాదని, దీని వెనుక భారీ కష్టం ఉందని మారుతీ చెప్పారు. “ప్రభాస్ గారిని తీసుకువచ్చి ఏదో సాదాసీదా సినిమా తీయలేదు. ఆయనకు తగిన ‘ఆరెంజ్ ఫుడ్’ లాంటి భారీ విందుని థియేటర్లో సిద్ధం చేశాం” అని హామీ ఇచ్చారు. ఈ హారర్-కామెడీ జోనర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్, నటన ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మారుతీ ఒక అడుగు ముందుకు వేసి అభిమానులకు ఒక భారీ హామీ ఇచ్చారు. “ఈ సినిమా చూశాక ఏ ఒక్క అభిమాని అయినా, లేదా ఫ్యామిలీ ఆడియన్స్ అయినా ‘మారుతీ మమ్మల్ని నిరాశపరిచావు’ అని అంటే.. కొండాపూర్‌లోని నా ఇంటి అడ్రస్ ఇస్తాను, వచ్చి అడగండి” అని సవాల్ విసిరారు. ఒక దర్శకుడు తన సినిమాపై ఇంత నమ్మకంతో మాట్లాడటం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
Read also-Kalaga Kathaga: ‘ఛాంపియన్’ నుంచి మనసును మీటే మెలోడీ ‘కలగా కథగా’ లిరికల్ వీడియో వచ్చేసింది..
ప్రసంగం ముగింపులో మారుతీ మాట తడబడింది. సాధారణంగా తాను చాలా మొండివాడినని, ఎవరైనా చనిపోయినా ఏడవనని, కానీ ప్రభాస్ చూపించిన ప్రేమ, ఈ మూడేళ్ల జర్నీ గుర్తుకొచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నానని చెప్తూ స్టేజ్ పైనే ఏడ్చేశారు. ఈ ప్రసంగం ద్వారా ‘ది రాజా సాబ్’ పై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రభాస్ లోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ని మారుతీ ఏ విధంగా వెండితెరపై చూపించబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

