Telugu Cinema: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood) ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును రాబట్టుకుని, కలెక్షన్ల పరంగా సునామి సృష్టిస్తోంది. ‘బాహుబలి’ (Bahubali) తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి అంతా మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలలో ఏదో ఒకటి ప్రభంజనం సృష్టిస్తూ.. టాలీవుడ్ స్థాయిని పెంచుతూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడందరి కళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీపైనే ఉన్నాయి. ఒక వైపు తెలుగు సినిమా ఇండస్ట్రీ దూసుకెళుతుందని ఆనందపడాలో.. మరోవైపు తెలుగు సినిమాని కొందరు కిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధపడాలో తెలియనంతగా రోజురోజుకూ పరిస్థితులు మారిపోతున్నాయి. మొన్నటికి మొన్న కర్ణాటకలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఓజీ’ (OG) సినిమాలకు అక్కడ ఎన్నో ఇబ్బందులను కలిగించారు. ఈ రెండు సినిమాలే కాదు, తెలుగు సినిమా విడుదల అవుతుందంటే చాలు.. కర్ణాటక (Karnataka)లో కొందరు కావాలని కర్రలు పట్టుకుని, థియేటర్ల దగ్గర కాపాలా కాస్తున్నారు. ఒక్క పోస్టరే కాదు.. తెలుగు టైటిల్‌తో ఫ్లెక్సీ, కటౌట్‌లు కనిపించినా.. నిర్ధాక్షిణంగా దాడి చేస్తున్నారు.
Also Read- Chaitanya Rao: ‘ఘాటి’ విలన్ హీరోగా.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చిత్రం! క్లాప్ కొట్టిందెవరంటే?
కర్ణాటక టు కెనడా..
కర్ణాటకలో ఇలాంటివి చూసి, తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ (Canada) సినిమాలను బ్యాన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారంటే.. ఏ స్థాయిలో అక్కడ తెలుగు సినిమా పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. అదలా ఉంటే.. ఇప్పుడు ఇండియన్ సినిమాలకు గుండెకాయగా మారిన యుఎస్ మార్కెట్ కూడా కొత్త తలనొప్పులను కలిగిస్తోంది. ట్రంప్ టారిఫ్‌లు సినిమా ఇండస్ట్రీలను కుదేల్ చేస్తున్నాయి. రోజుకో ప్రకటనతో సినిమా వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు ట్రంప్. మరో వైపు కెనడాలో కూడా ఇండియన్ సినిమాలను ఆపేసినట్లుగా తెలుస్తోంది. ఇండియన్ సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రదర్శనలు రద్దు చేస్తున్నామని అక్కడి యజమాన్యం బహిరంగ ప్రకటన చేసింది. దీంతో ముందు ముందు సినిమాల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందనేదానికి ఉదాహరణగా ఈ ఘటనలు కనిపిస్తున్నాయి.
Also Read- Akshay Kumar: అలాంటి ఫొటోలను పంపుతారా? తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటనను తెలిపిన అక్షయ్!
సినిమాలపై ఉగ్రదాడి
ఇప్పటికే ఫ్యాన్ వార్స్, పైరసీ వంటి వాటితో సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు పడుతోంది. అలాగే ఓటీటీల రూపంలో సినిమా లైఫ్ ఒక వీక్‌కి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఈ దాడులు మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద నిర్మాతలు సినిమాలు తీయడానికి భయపడిపోతున్నారు. కెనడా విషయానికి వస్తే.. సెప్టెంబర్ 25న, అక్టోబర్ 5న థియేటర్లకు నిప్పు అంటించే ప్రయత్నంతో పాటు, కాల్పులు జరపడంతో, అక్కడి థియేటర్ల యాజమాన్యం షోలను నిలిపివేసింది. ఇవి ‘ఓజీ, కాంతార చాప్టర్ 1’ సినిమాలు రిలీజ్ అయినప్పుడే జరగడంతో.. ఇది ఖలిస్థానీ ఉగ్రవాదుల కుట్రగా అంతా భావిస్తున్నారు. అంతే సినిమాలపై దాడి చేసే వరకు ఉగ్రవాదం చేరింది. ఇలాంటి పరిణామాలు ఇంకా ఇంకా జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో సినిమాకు ఇక్కట్లు తప్పవు. చూద్దాం.. మరి దీనిపై ప్రభుత్వాలు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలు ఎలా రియాక్ట్ అవుతాయో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
