Fish Venkat: గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ, చికిత్స తీసుకుంటున్న ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఆయన ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రెండు కిడ్నీలు పాడయ్యాయని, వెంటనే ఆపరేషన్ చేసి, ఒక కిడ్నీ అయినా మార్చాలని డాక్టర్స్ సూచించినట్లుగా ఫిష్ వెంకట్ భార్య, కుమార్తె ఇటీవల మీడియాకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తాలుకా అంటూ ఓ వ్యక్తి కాల్ చేసి మనీ పరంగా చూసుకుంటానని చెప్పినట్లుగా వార్తలు రావడం, అది ఫేక్ ఫోన్ కాల్ అని ఆ ఫ్యామిలీ చెప్పడం అంతా తెలిసిందే. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోని విశ్వక్ సేన్‌తో పాటు మరికొందరు హీరోలు రెండేసి లక్షలు చొప్పున ఇస్తూ.. కొంతమేర ఆ కుటుంబానికి సహాయం చేస్తూ వచ్చారు. కానీ, ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి వార్త తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్ర దిగ్ర్భాంతికి లోనవుతుంది.
Also Read- Balayya vs Pawan: బాలయ్య, పవన్‌ల మధ్య వార్ తప్పదా? టాలీవుడ్ టాకేంటి?
ఫిష్ వెంకట్‌కి అసలు ఏమైందంటే..
ఆ మధ్య తన భర్త ఫిష్ వెంకట్ ఆరోగ్యం గురించి భార్య చెబుతూ.. చాలా దీన స్థితిలో ఉన్నాం. పరిచయస్తులు కూడా ఎవరూ ఇటు వైపు రావడం లేదు. కనీసం పలకరించడం కూడా చేయడం లేదు. నాలుగేళ్ల క్రితం మద్యానికి బానిసైన ఆయనకు.. షుగర్, కాలు ఇన్‌ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో కొందరు సినీ ప్రముఖులు, దాతలు ముందుకు వచ్చి సాయం చేశారు. అప్పుడు తిప్పుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లకే మళ్లీ మద్యం, ధూమపానం మొదలు పెట్టారు. అదే టైమ్‌లో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తను చెడు అలవాట్లను మానేసినా, స్నేహితులు మళ్లీ ఏం కాదు అంటూ అలవాటు చేశారు. ఆయన రెండు కిడ్నీలు ఎప్పుడో పాడయ్యాయి. కిడ్నీ మార్పిడి చేస్తేనే ఆయన మళ్లీ కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. అందుకు రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారని తెలిపారు.
Also Read- Anupama Parameswaran: పక్కన ఎవరితను..పెళ్లి దండలతో అనుపమ.. వీడియో వైరల్
ఫిష్ వెంకట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలో ‘గబ్బర్ సింగ్’ విలన్ గ్యాంగ్ మొత్తం ఆయనను చూసేందుకు వెళ్లి, ఎలాగైనా ఆయన బతకాలని, దాతలు ఎవరైనా ముందుకు రావాలని ఎమోషనల్ అయ్యారు. ఫిష్ వెంకట్ భార్య, కుమార్తె కూడా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవుతూ ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ ఎలాగోలా కోలుకుని వస్తారని అంతా అనుకున్నారు కానీ, సమయానికి దాతలెవరు ముందుకు రాకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్స్ ఎంతగా ప్రయత్నించినా, ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఫిష్ వెంకట్ విలన్‌గా, కామెడీ విలన్‌గా ఎన్నో సినిమాలలో నటించారు. ‘ఆది, గబ్బర్ సింగ్, దేవుడు చేసిన మనుషులు, సుడిగాడు, దరువు, సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి ఎన్నో సినిమాలలో ఆయన చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఫిష్ వెంకట్ మృతి వార్త తెలిసిన వారంతా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు