Telangana Gaddar Film Awards 2024: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లుగానే దాదాపు 14 సంవత్సరాల తర్వాత.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని కళాకారులను గద్దర్ ఫిల్మ్ అవార్డులతో గౌరవించింది సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం. ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards 2024) వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రంగరంగ వైభవంగా జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ – స్టార్ నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్ వంటి ప్రముఖులెందరో ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు అవార్డులను అందజేశారు. నందమూరి నటసింహం బాలయ్య, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మణిరత్నం, విజయ్ దేవరకొండ, సుకుమార్, నాగ్ అశ్విన్ తదితరులెందరో ఈ కార్యక్రమానికి హాజరై అవార్డులను అందుకున్నారు. ఈ వేడుకలో విజేతలకు గద్దర్ మొమోంటోతోపాటు నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ అవార్డులను అందుకున్న అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సుకుమార్ వంటి స్టార్స్ అందరూ తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దిల్ రాజు వంటి వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Also Read- Kannappa Trailer: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ట్రైలర్ వచ్చేసింది.. టాక్ ఏంటంటే?
రప్పా రప్పా నరుకుతా: అల్లు అర్జున్
ఈ కార్యక్రమంలో ఐకాన్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ గద్దర్ అవార్డు నాకు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. చాలా గ్యాప్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి సార్‌కి, నిర్మాత-ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా దర్శకుడు సుకుమార్ లేకపోతే ఈ అవార్డు సాధ్యమయ్యేది కాదు.. ఇది ఆయన విజన్, ప్రేమకు తార్కాణం. మా నిర్మాతలకు, సినిమాలో నటించిన ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు.. ఇంకా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆ రోజు రాజమౌళి చెప్పడం వల్లే.. పుష్ప మొదటి భాగం హిందీలో రిలీజ్ చేశాం. ఆయనకు థ్యాంక్స్ చెప్పడానికి సరైన సందర్భం కోసం చూస్తున్నాను. అందుకే ఇప్పుడు చెబుతున్నాను.
ఇది నా జీవితంలో చాలా ప్రత్యేకమైనది. పుష్ప పార్ట్ 2కి గానూ నేను గెలిచిన మొట్ట మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నాను. మీ లవ్, సపోర్ట్‌కు థ్యాంక్స్. అభిమానులను ఇంకా గర్వపడేలా చేస్తాను. నా ఆర్మీ ఐ లవ్ యు. సినిమా అవార్డు కాబట్టి, సరదాగా ఒక డైలాగ్ చెబుతా. (సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని మరి). ‘ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా, గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు, రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడినీ. పుష్ప, పుష్ప రాజ్… అస్సలు తగ్గేదే లే!’. జై తెలంగాణ! జై హింద్!’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు