23 Movie First Look Launch: ‘23’ అనగానే అందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనే గుర్తుకు వస్తుంది. ఏపీలో గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి, అన్ని స్థానాల్లో విజయం సాధించింది. 23కు 23 స్థానాల్లో గెలిచి 100 శాతం సక్సెస్ రేట్ సాధించిన జనసేన పార్టీ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని శాఖలకు పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ‘23’ మూవీ ఫస్ట్ లుక్ వదిలిన ఉప ముఖ్యమంత్రి అనగానే అంతా పవన్ కళ్యాణ్ అనే అనుకుంటారు. కానీ, ఇక్కడ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Mokshagna Teja: 2025లోనూ మోక్షం లేనట్టేనా?
‘మల్లేశం, 8 AM మెట్రో’ చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్.. వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘23’ అనే టైటిల్‌తో ఆయన తెరకెక్కించిన తాజా చిత్ర ఫస్ట్ లుక్‌ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. స్టూడియో 99 నిర్మించిన ఈ సినిమాలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయబోతుండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్ కాపీని స్పెషల్ స్ర్కీనింగ్ ద్వారా మంత్రి భట్టి విక్రమార్క వీక్షించారు. ఇందులో సున్నితమైన, ఆలోచింపజేసే సంఘటనలను చిత్రీకరించిన తీరు చూసి ఆయన చలించిపోయారు. అర్థవంతమైన సంభాషణలతో, అత్యద్భుతంగా సినిమాను తెరకెక్కించిన టీమ్‌ను ఆయన ప్రశంసించారు.

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌ని గమనిస్తే.. మంటల్లో చిక్కుకున్న బస్సును, వ్యక్తులను, ప్రాణాల కోసం తీవ్రంగా పరిగెత్తుతున్న ప్రజలను ఈ ఫస్ట్ లుక్ చూపిస్తుంది. ఇంకా గోనె సంచులలో బంధించబడిన వ్యక్తులను కూడా చూపిస్తోంది. జార్జ్ ఆర్వెల్ రాసిన ‘‘All are equal, but some are more equal than others’’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ‘మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా..?’ అనే కోట్ ఈ సినిమా ఎంత బాధ్యతగా తెరకెక్కించారనే విషయాన్ని తెలియజేస్తుంది. ‘23’ చిత్రం పశ్చాత్తాపం, విముక్తి వంటి లోతైన ఇతివృత్తాలను అన్వేషించే హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ అని, ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడమే కాకుండా, ప్రతి ఒక్కరిలో ఆత్మపరిశీలనను రేకెత్తించే శక్తివంతమైన, ఎమోషనల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని చిత్రయూనిట్ తెలుపుతుంది. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు.