Mokshagna Teja: నందమూరి నట వారసుడు, నటసింహం బాలకృష్ణ (Natasimham Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) అరంగేట్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు గ్రహాలు మాత్రం అస్సలు అనుకూలించడం లేదు. మొన్నటి వరకు మోక్షజ్ఞ ఫిజిక్‌పై దృష్టి పెట్టడం లేదని, ఆయన హీరో మెటీరియల్‌గా మారడానికి చాలా సమయం పడుతుందనేలా వార్తలు వచ్చాయి. కానీ, ఎప్పుడు మారాడో తెలియదు కానీ, ప్రశాంత్ వర్మతో సినిమా అంటూ ప్రకటనతో పాటు వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. నందమూరి అభిమానుల్లో సంతోషం నింపాయి. ఆ ఫొటోల్లో నందమూరి సింబాని చూసిన అభిమానులు, ‘వారసుడు వస్తున్నాడు’ అంటూ సందడి సందడి చేశారు. కానీ ఆ సందడి మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ప్రశాంత్ వర్మతో అనుకున్న సినిమా వెనక్కి పోయింది. పూజా కార్యక్రమాల వరకు వెళ్లిన ఆ సినిమా ప్రస్తుతానికైతే ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. సరైన కథ లేకుండానే మోక్షజ్ఞ అరంగేట్ర బాధ్యతలను తీసుకున్న ప్రశాంత్ వర్మపై బాలయ్య సీరియస్ అయ్యాడని, అందుకే చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్‌ని ఆపేశాడనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజంగా అదే కారణమా? లేదంటే వేరే ఉందా? అనేది పక్కన పెడితే, ఆ సినిమా ఆగిపోవడంతో మళ్లీ మోక్షజ్ఞ ఫిట్‌నెస్ పట్ల అశ్రద్ధ వహించడంతో, ఆయన ఆకారం అంతా మారిపోయిందనేలా టాక్ వినబడుతుంది.
Also Read- Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?
ప్రశాంత్ వర్మతో సినిమా ప్రకటన వచ్చిన తర్వాతకానీ, అంతకు ముందు కానీ మోక్షజ్ఞ ఎక్కడా కనిపించలేదు. కేవలం ఫొటోలలో మాత్రమే ఆయన లుక్‌ని రివీల్ చేశారు. కానీ, రీసెంట్‌గా మోక్షజ్ఞ ఓ ఈవెంట్‌లో దర్శనమిచ్చాడు. ఆ ఫొటోలలో ఉన్న మోక్షజ్ఞకు, అక్కడ కనిపించిన మోక్షజ్ఞకు అసలు సంబంధమే లేదు అన్నట్లుగా ఆయన లుక్ ఉంది. మోక్షుని అక్కడ చూసిన వారంతా, ఆయన లుక్ కారణంగానే సినిమా ఆగిపోయి ఉంటుందని, నందమూరి వారసుడు ఇంకా సిద్ధం కాలేదనేలా మాట్లాడుకున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఈ వార్తలతో 2025లో కూడా మోక్షు దర్శనం ఉండదా? అని అభిమానులు నిరాశపడుతున్నారు. మరో వైపు తన దగ్గర 10కి పైగా కథలు సిద్ధంగా ఉన్నాయని ‘హనుమాన్’కి ముందు ప్రకటించిన ప్రశాంత్ వర్మ దగ్గర, సరైన కథ లేదంటూ నందమూరి కాంపౌండ్‌లో వార్తలు రావడంపై, ఆయన కూడా తీవ్ర నిరాశకు లోనైనట్లుగా తెలుస్తుంది. తను చేస్తున్న సినిమాలు పక్కన పెట్టి మరీ బాలయ్య వారసుడి కోసం వేచి చూస్తే, చివరికి తననే కారణం చేశారంటూ వర్మ తన స్నేహితుల దగ్గర చెప్పుకుని బాధపడుతున్నాడట. అందుకే, మోక్షు సినిమా పక్కన పెట్టి, తను ఇప్పటికే మొదలు పెట్టిన సినిమాలతో పాటు, ‘జై హనుమాన్’ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
బాలయ్య దర్శకత్వంలోనే
ఇదిలా ఉంటే, మోక్షజ్ఞ ఎంట్రీని బాలయ్య వేరేలా ప్లాన్ చేస్తున్నాడనేలా టాక్ బయటికి వచ్చింది. మోక్షజ్ఞ కోసం తనే మెగా ఫోన్ పట్టబోతున్నాడని, తను హీరోగా వచ్చిన సైన్స్‌ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ పేరుతో సినిమాను రూపొందించేలా బాలయ్య అన్నీ సిద్ధం చేస్తున్నాడనేలా నందమూరి కాంపౌండ్‌లో టాక్ వినిపిస్తోంది. అన్నీ కుదిరితే, రాబోయే సంక్రాంతికి నటసింహం దర్శకత్వంలో మోక్షు అరంగేట్ర చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలైతే ఉన్నాయనేది వినిపిస్తున్న వార్తలలోని సారాంశం. ఎలా చూసినా కూడా, మోక్షజ్ఞ అరంగేట్రం 2025లో అయితే ఉండదనేది స్పష్టమవుతోంది. మరి, మోక్షు అరంగేట్రంపై బాలయ్య మదిలో ఏముందో? అది ఎప్పటికి బయటికి వస్తుందో? చూడాల్సి ఉంది.