Surender Reddy: టాలీవుడ్‌లో స్టైలిష్ మేకింగ్‌కు, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పేరుగాంచిన సురేందర్ రెడ్డి (Surender Reddy) కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. కళ్యాణ్ రామ్‌కు ‘అతనొక్కడే’తో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఆయన, మాస్ మహారాజా రవితేజతో ‘కిక్’ వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తీశారు. అంతేకాకుండా, మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ (Chiranjeevi Sye Raa Narasimha Reddy) వంటి సెన్సేషనల్ పీరియాడిక్ డ్రామాను తెరకెక్కించి తన సత్తా నిరూపించుకున్నారు. అయితే, అఖిల్ అక్కినేనితో ఆయన చేసిన భారీ చిత్రం ‘ఏజెంట్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, సురేందర్ రెడ్డి తదుపరి ప్రాజెక్టును ప్రకటించడానికి సమయం తీసుకున్నారు. ఈ గ్యాప్ వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై టాలీవుడ్‌లో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి.
క్లారిటీ లేదు
ముందుగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో నిర్మాత రామ్ తాళ్లూరి ఓ సినిమా చేస్తారని అధికారిక ప్రకటన వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం సురేందర్ రెడ్డి వేచి చూశారు కూడా. కానీ, పవన్ కళ్యాణ్‌కు ఉన్న రాజకీయాలు, సినిమాలతో కూడిన బిజీ షెడ్యూల్ కారణంగా, ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి కార్యరూపం దాల్చడం అసాధ్యమని తెలుస్తోంది. ఈ సినిమా ఉంటుందా, ఉండదా అనే దానిపై కూడా ఎటువంటి స్పష్టత లేదు. అయితే, సినిమాలకు దూరంగా ఉన్న ఈ విరామ సమయంలో సురేందర్ రెడ్డి పూర్తిగా ఖాళీగా లేరని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన తన పూర్తి దృష్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పెట్టారని, ఆ బిజినెస్ వ్యవహారాల్లోనే అత్యంత బిజీగా గడిపారని సమాచారం. ఇన్నాళ్లు రియల్ ఎస్టేట్ రంగంలో తన వ్యాపారాలను చక్కబెట్టుకున్న సురేందర్ రెడ్డి, ఇప్పుడు తిరిగి తన ఫేవరెట్ ఫీల్డ్ అయిన సినిమా మేకింగ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read- Samyuktha: ప్రస్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్.. ఎన్ని సినిమాలు చేస్తుందో తెలుసా?
మాస్ మహారాజాతోనేనా?
త్వరలోనే ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. ముఖ్యంగా, ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన మాస్ మహారాజా రవితేజతో మరోసారి జతకట్టబోతున్నట్లుగా టాలీవుడ్‌లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘కిక్’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సురేందర్ రెడ్డి స్టైలిష్ స్క్రిప్ట్‌కు ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా ప్రకటన రాకపోయినా, ఈ కాంబోలో సినిమా వచ్చే అవకాశం అత్యధికంగా ఉందని ట్రేడ్ వర్గాలు సైతం ఆశతో ఉన్నాయి. సురేందర్ రెడ్డి ఫామ్‌లోకి రావడానికి రవితేజతో చేయబోయే ఈ సినిమా సరైన బ్రేక్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో..?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

