Mandaadi: సుహాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, సుహాస్ (Suhas) కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్న తీరు.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న హీరోలెందరికో స్ఫూర్తి అని చెప్పుకోవాలి. తను హీరో అవుతాడని తనకి కూడా తెలియదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ, ఒక్కసారిగా హీరోగా మారిన సుహాస్, ఆ గ్రాఫ్‌ని పడిపోనివ్వకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడు. రెగ్యులర్ సినిమాలు కాకుండా, ప్రతి సినిమాకు వైవిధ్యత ఉండేలా కథలను సెలక్ట్ చేసుకుంటూ, హీరోగానూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నాడు. ఇదంతా టాలీవుడ్ వరకే. ఇప్పుడు సుహాస్ తన పరిధిని విస్తరించుకుంటున్నాడు. కోలీవుడ్‌లో కూడా తన టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
Also Read- Samantha and Sobhita: సమంత ఇవ్వలేనిది.. చైతూకి శోభిత ఇస్తుందా? అక్కినేని మరో తరం దిగబోతుందా?
కోలీవుడ్ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్ తన 16వ ప్రాజెక్ట్‌గా ‘మండాడి’ అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ప్రకటించారు. ‘సెల్ఫీ’ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో ప్రధాన పాత్రలో సూరి నటిస్తుండగా, టాలీవుడ్‌కి చెందిన సుహాస్ తన తమిళ అరంగేట్రం చేస్తున్నారు. హీరోయిన్‌గా మహిమా నంబియార్ నటిస్తున్న ఈ చిత్రాన్ని రూపుదిద్దుకుంటోన్న అన్ని భాషల్లోను ఆకట్టుకునేలా మలుస్తున్నారు. రీసెంట్‌గా టైటిల్, హీరో సూరి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన నిర్మాతలు.. తాజాగా సుహాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఈ ఫస్ట్‌లుక్‌లో లుంగీ, నెరిసిన జుట్టు, జెర్సీతో ‘సునామీ రైడర్స్’ బృందంతో సముద్రతీరంలో సుహాస్ నిలబడి ఉండటం గమనించవచ్చు. మరో పోస్టర్‌లో సూరి, సుహాస్ ఇద్దరూ స్వయంగా పడవలు నడుపుతూ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా కనిపించడం చూస్తుంటే, సినిమాలో వారిద్దరి మధ్య జరిగే పోరు ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సుహాస్ ఈ చిత్రంలో బలమైన ప్రతినాయకుడిగా (Villain Role) కనిపించనున్నాడని చిత్రబృందం చెబుతోంది. ఇంతకు ముందు సుహాస్ ‘హిట్ 2’ (Hit 2 Movie) సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించిన విషయం తెలిసిందే. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ ‘మండాడి’ చిత్రం.. క్రీడా నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, బలమైన భావోద్వేగాలు, సంఘర్షణలతో కూడిన జీవన పోరాటం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పేరున్న సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. త్వరలోనే ఇతర వివరాలను ప్రకటిస్తామని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం విడుదలైన సుహాస్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా తర్వాత తమిళ్‌లోనూ తనకు మంచి అవకాశాలు వస్తాయనే ఆశాభావాన్ని సుహాస్ వ్యక్తం చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు