O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ (Hero Srikanth) మరో చిన్న సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ మధ్యకాలంలో ఎన్నో చిన్న సినిమాలకు ఆయన మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల పై రూపాశ్రీ కొపురు (Rupasri Kopuru) నిర్మిస్తున్న ‘ఓ.. చెలియా’ (O Cheliya) చిత్రానికి ఆయన సపోర్ట్ అందించి, చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి (M Naga Rajasekhar Reddy) నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ జనాలకు ఆకట్టుకుని మంచి స్పందనను రాబట్టుకున్నాయి. రీసెంట్‌గా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీద ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయగా.. అది వైరల్ అవ్వడమే కాకుండా మంచి ఆదరణను పొందింది.
టీజర్ చాలా బాగుంది
తాజాగా ‘ఓ.. చెలియా’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ రిలీజ్ చేసిన అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఓ చెలియా’ మూవీ టీజర్‌ను లాంఛ్ చేశాను. నాకు ఈ టీజర్ చాలా నచ్చింది. యంగ్ టీమ్ అంతా కలిసి ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారనిపించింది. ఇలాంటి చిన్న సినిమాలు సక్సెస్ అయితే, ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ కోవలోకే ఈ సినిమా కూడా చేరుతుందని ఆశిస్తూ.. దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. టీజర్ విడుదల చేసిన శ్రీకాంత్‌కు టీమ్ కృతజ్ఞతలు తెలిపింది.
‘ఓ.. చెలియా’ టీజర్‌ను గమనిస్తే..
ఇక టీజర్ విషయానికి వస్తే.. హారర్, లవ్, యాక్షన్ జానర్లను మిక్స్‌తో ఈ సినిమా రూపొందినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భయపెట్టించే అంశాలు చాలానే ఉన్నాయనేది ఈ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ హారర్ కాన్సెప్ట్‌లో సరికొత్త ప్రేమ కథని చెప్పినట్లుగానూ, ఈ ప్రేమకథలోకి దెయ్యాలు ఎందుకు వచ్చాయి? అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. టీజర్ చూస్తుంటే, చిన్న సినిమా అని అనిపించడం లేదు, అలాగే నటీనటులు కూడా బాగా ఇన్వాల్వ్ అయి చేసినట్లుగా అర్థమవుతోంది. మొత్తంగా అయితే హారర్ అంశాలతో ఉత్కంఠభరితంగా ఈ మూవీని తెరకెక్కించారనే విషయాన్ని ఈ టీజర్ తెలియజేస్తుంది. అలాగే కెమెరా వర్క్, ఆర్ఆర్ హైలెట్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు