Sivaji: వింటేజ్ బ్లాక్ బస్టర్ జోడి శివాజీ (Sivaji), లయ (Laya) జంటగా శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ (Sri Sivaji Productions) పతాకంపై రెండవ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సుధీర్ శ్రీరామ్ (Sudheer Sriram) రచన, దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్‌లో శివాజీ ‘పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్’ పాత్రలో కనిపిస్తున్నారు. గ్రామీణ నేపథ్యాన్ని సూచించే ఈ పోస్టర్, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా శివాజీ మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి పనిచేయడం విశేషం. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శివాజీ.. తన భార్య, బిడ్డలతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడానికి పటాసులు తీసుకుని వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నారు. టైటిల్ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ పోస్టర్ సినిమా కథాంశంపై ఆసక్తిని పెంచుతోంది.
Also Read- Tollywood Box Office: నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. బాక్సాఫీస్ వద్ద సందడేది? వీక్ ఓపెనింగ్స్!
అత్యంత నిజాయితీపరుడిగా
ఇందులో నిజాయితీకి మారు పేరు శ్రీరామ్ అనేలా శివాజీ పోషించనున్న పాత్ర ఉంటుందని చిత్రయూనిట్ తెలుపుతున్నారు. పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్ పాత్రలో ఆయన అత్యంత నిజాయితీపరుడిగా కనిపించనున్నారు. తప్పును ఏ మాత్రం సమర్థించని, అన్యాయాన్ని సహించలేని మనస్తత్వం కలవాడు. తన వల్ల, ఇతరుల వల్ల కూడా జనం ఇబ్బంది పడకూడదనే సిద్ధాంతంతో జీవించే వ్యక్తి శ్రీరామ్. భార్య, బిడ్డలే అతనికి ప్రపంచం. వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే శ్రీరామ్.. వారి దాకా సమస్య వస్తే ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడని పాత్రలో శివాజీ ఇందులో నటించబోతున్నారని, ఈ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్రయూనిట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతోంది. దీపావళి వైబ్ ముందే వచ్చేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఆసక్తికరమైన కథాంశంతో
ఇందులోని నటీనటుల విషయానికి వస్తే.. శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ‘90s’ వెబ్ సిరీస్ బాల నటుడు రోహన్‌తో పాటు అలీ, ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్, ఇతర పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. శివాజీ, లయ వింటేజ్ కాంబినేషన్, ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్య శివాజీ చేసే పాత్రలన్నీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్ పాత్ర కూడా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమాను శివాజీనే నిర్మిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
