The Girlfriend: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), యంగ్ హీరో దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) జంటగా నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ శుక్రవారం సాయంత్రం థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై.. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. చిత్ర విజయంతో టీమ్ అంతా హ్యాపీగా ఉన్నట్లుగా ఈ వేడుకలో తెలిపారు.
Also Read- Naga Vamsi: నాగవంశీని 2025 భయపెట్టిందా? అందుకే ‘ఫంకీ’ని 2026కు వాయిదా వేశారా?
నా మనసు నిండిపోతోంది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు వస్తున్న స్పందనతో నా మనసు నిండిపోతోంది. మరో సినిమా షూటింగ్‌లో ఉండటంతో ఈ సెలబ్రేషన్స్ మీట్‌కు రాలేకపోయాను. అందుకు చాలా బాధగా ఉంది. వుమెన్ ఎమోషన్స్‌ను రాహుల్ రవీంద్రన్ అర్థం చేసుకున్న తీరు చూసి నిజంగా ఆశ్చర్యానికి గురయ్యాను. అదే విషయాన్ని అతన్ని షూటింగ్ టైమ్‌లో అడిగాను. భూమా పాత్రలో నటించే అవకాశాన్ని రాహుల్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. దీక్షిత్ అద్భుతమైన నటుడు. విక్రమ్‌గా అతను అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. దీక్షిత్ కెరీర్‌లో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హేషమ్ తన మ్యూజిక్‌తో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాను ఓన్ చేసుకున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. త్వరలోనే అందరినీ కలుస్తానని తెలిపారు.
ఇది చాలు కదా..
వేడుకలో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాను మీడియా మిత్రులు తమ బాధ్యతగా ప్రేక్షకుల్లో తీసుకెళ్లి, సపోర్ట్ చేస్తారనే నమ్మకాన్ని నేను రిలీజ్ ముందు వ్యక్తం చేశాను. మేము ఆశించినట్లే మీడియా మిత్రులందరూ మంచి రేటింగ్స్‌తో ఈ సినిమాకు అండగా నిలబడ్డారు. మీడియా వారందరికీ థ్యాంక్స్ చెప్పేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా సినిమాకు మార్నింగ్, మ్యాట్నీ నుంచి కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ సినిమా చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. ఇది చాలు కదా అని నాకు అనిపించింది. ప్రేమికులైనా, భార్యా భర్తలైనా.. వాళ్లు ఒకరిపట్ల మరొకరికి రిలేషన్ ఎలా ఉండాలో? ఎలా ఉండకూడదో? అనే రెండు పాయింట్స్ ఈ చిత్రంలో చెప్పారు. అమ్మాయిల్లో ఉండే బాధను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేసిన దర్శకుడు రాహుల్‌కు అభినందనలు. ఈ సినిమా విజయానికి మొదటి కారణం దర్శకుడే. హీరో హీరోయిన్లు ఇద్దరూ ఏ వంకా పెట్టలేనంత అద్భుతంగా, చక్కగా నటించారు. ఈ సినిమాను మీడియా మిత్రులు ఇంకా బాగా ప్రేక్షకుల దగ్గరకు చేరుస్తారని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఇంకా చిత్రయూనిట్‌లోని పలువురు ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
