Naga Vamsi: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించిన యువ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)కి 2025వ సంవత్సరం అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. ఎంతో నమ్మకంతో, భారీ అంచనాల మధ్య ఆయన విడుదల చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో, ఆయన తన తదుపరి ముఖ్యమైన ప్రాజెక్ట్‌ను 2026కు వాయిదా వేయడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. నాగవంశీకి 2025లో ఎదురైన వైఫల్యాల జాబితాలో ‘కింగ్‌డమ్’ (Kingdom), ‘మాస్ జాతర’ (Mass Jathara) వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు అంచనాలను అందుకోలేక, నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చాయి. అంతేకాకుండా, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రలు పోషించిన ‘వార్ 2’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే హక్కులను నాగవంశీ దక్కించుకున్నారు. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వరుసగా కీలక చిత్రాలు నిరాశపరచడంతో, ఈ సంవత్సరం తన బ్యానర్ నుంచి ఇంకేం సినిమాలు విడుదల చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
Also Read- Anushka Shetty: అనుష్క బర్త్‌డే స్పెషల్.. ‘కథనార్’ ఫస్ట్ లుక్ విడుదల
‘ఫంకీ’ (Funki) విడుదల 2026లో
ప్రస్తుతం యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. 2025లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఏకంగా వచ్చే సంవత్సరం అంటే, 2026, ఏప్రిల్ 3న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఒక భారీ సినిమాను ఏకంగా ఏడాదికి పైగా వాయిదా వేయడం వెనుక బలమైన కారణం ఉండాలి. 2025లో ఎదురైన చేదు అనుభవాల కారణంగా, ‘ఈ సంవత్సరం మా బ్యానర్‌కు అచ్చిరాలేదు’ అనే భావనతో నాగవంశీ ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, 2025 పరాజయాల నుంచి కోలుకుని, పకడ్బందీ ప్రణాళికతో కొత్త సంవత్సరంలో విజయాన్ని అందుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read- SSMB29 Kumbha first look: ‘SSMB29’నుంచి మరో అప్డేట్.. ఆ పోస్టర్ ఏంటి బాసూ హాలీవుడ్ రేంజ్ లో ఉంది..
సెంటిమెంట్‌కు భయపడ్డారా?
వరుసగా మూడు పెద్ద సినిమాలు నిరాశపరచడంతో, నాగవంశీ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చి, 2025లో తన బ్యానర్ చిత్రాల విడుదల విషయంలో వెనకడుగు వేశారని అంతా అనుకుంటున్నారు. ఈ సంవత్సరం భయాన్ని పక్కన పెట్టి, 2026లో కొత్త ఉత్సాహంతో, పూర్తి సిద్ధతతో రావడం ద్వారా విజయాన్ని సాధించాలని ఆయన వ్యూహాత్మకంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. విశ్వక్ సేన్ ‘ఫంకీ’ సినిమా మంచి విజయాన్ని అందించి, నిర్మాతకు ఉపశమనాన్ని, అలాగే నమ్మకాన్ని కలిగిస్తుందేమో చూడాలి. కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్‌తో నాగవంశీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
