Ramanaidu Studios: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన ఆర్థిక వనరులైన ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్‌లలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయంటూ ఒక్కసారిగా వార్తలు వైరలైన విషయం తెలిసిందే. ఈ అక్రమాల ఫలితంగా ఉన్న ఆదాయ మార్గాలను కూడా సక్రమంగా వసూలు చేసుకోవటంలో అధికారులు విఫలమవుతున్నారనేలా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలు చేపట్టిందనేలా వార్తలు వచ్చాయి. అందులోనూ ముఖ్యంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ తక్కువ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్న విషయాన్ని స్థానిక సర్కిల్ అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం ప్రధాన హైలెట్లలో ఒకటిగా మారింది. తాజాగా ఈ నోటీసులపై రామానాయుడు స్టూడియోస్ అధినేతలు వివరణ ఇస్తూ.. ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో..
ఎటువంటి విషయాలు దాచిపెట్టలేదు..
‘‘రామానాయుడు స్టూడియో (సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్), GHMC (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) జారీ చేసిన డిమాండ్ నోటీసుల ప్రకారం ట్రేడ్ లైసెన్స్ ఫీజును క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. ఆస్తి పన్ను (Property Tax), ట్రేడ్ లైసెన్స్ ఫీజు రెండింటినీ విధించడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కే సమర్థ అధికారం ఉందని మేము గుర్తించాము. అన్ని చట్టపరమైన విషయాల్లోనూ మేము ఎల్లప్పుడూ GHMC అధికారులకు మద్దతుగా ఉంటూ, వారికి అనుగుణంగా నడుచుకుంటున్నాము. GHMC రికార్డుల ప్రకారం, మా ఆస్తి పన్నును చాలా సంవత్సరాలుగా 68,276 చదరపు అడుగుల బిల్ట్-అప్ ప్రాంతానికి లెక్కించి చెల్లిస్తున్నాము. బిల్ట్-అప్ ప్రాంతానికి సంబంధించి ఏ దశలోనూ ఎటువంటి విషయాలను దాచిపెట్టడం లేదంటే తప్పుడు సమాచారం ఇవ్వడం జరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
ఆ ఊహాగానాల్లో నిజం లేదు
ఈ సంవత్సరం, GHMC ట్రేడ్ లైసెన్స్ ఫీజును సంవత్సరానికి రూ. 7,614 నుండి రూ. 2,73,104 కు పెంచింది. ఈ మొత్తాన్ని మేము ఇప్పటికే చెల్లించాము. అయినప్పటికీ, ఒక్కసారే ఇంత భారీగా పెంచుతారని ఎవరూ ఊహించరని.. దీనిని న్యాయంగా స్థిరీకరిస్తూ, హేతుబద్ధం చేయాల్సిన అవసరం ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాము. GHMC ఈ విషయాన్ని తగిన రీతిలో పరిశీలిస్తుందని మేము నమ్ముతున్నాము. రామానాయుడు స్టూడియో బిల్ట్-అప్ ప్రాంతం గురించి ఎటువంటి కమ్యూనికేషన్ లోపంగానీ, అపార్థాలు కానీ లేవని మేము మరోసారి తెలియజేస్తున్నాము. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలన్నీ నిజంగా కాదని మేము స్పష్టం చేస్తున్నాము. రామానాయుడు స్టూడియో GHMC నిబంధనలన్నింటినీ పూర్తిగా పాటిస్తూ, అధికారులతో సంపూర్ణ పారదర్శకతను కొనసాగిస్తోంది’’ అని తెలిపారు. రామానాయుడు స్టూడియోస్ నుంచి వివరణ వచ్చింది సరే.. మరి అన్నపూర్ణ స్టూడియోస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
