RGV Piracy Comments: ప్రముఖ దర్శకుడు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా సినిమా పైరసీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ ఎందుకు ఆగదో, పైరసీ చేసే వారిని ‘రాబిన్ హుడ్’తో పోల్చడం ఎంత హాస్యాస్పదమో వివరిస్తూ, దీనికి పరిష్కారం ఏమిటో తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇమ్మాది రవి గురించి ఏం అన్నారో ఇక్కడ తెలుసుకుందాం..
Read also-NC24 Title Launch: నాగచైతన్య ‘NC24’ టైటిల్ గురించి అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. లాంచ్ చేసేది ఎవరంటే?
రాబిన్ హుడ్ హీరో కాదు..
పైరసీ చేసే వారిని సమర్థించేవారు, ముఖ్యంగా ‘రాబిన్ హుడ్’తో పోల్చే వారిపై వర్మ తీవ్రంగా మండిపడ్డారు. “పైరసీ ఎన్నటికీ ఆగదు. సాంకేతికత పెరగడం వల్లో, పోలీసు వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్లో కాదు. పైరసీ సినిమా చూడడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నంత కాలం, వారికి సేవ చేయడానికి ‘రవి’లు ఎప్పుడూ ఉంటారు” అని ఆయన స్పష్టం చేశారు. పైరసీ చేసే వారిని ‘రాబిన్ హుడ్’తో పోల్చడంపై వర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. “రాబిన్ హుడ్ అస్సలు హీరో కాదు. నేటి నిర్వచనాల ప్రకారం, అతడు ప్రపంచంలోనే మొట్టమొదటి రికార్డైన టెర్రరిస్ట్” అని ఆయన వ్యాఖ్యానించారు. ధనికులు కేవలం ధనవంతులుగా ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో వారిని దోచుకోవడం, చంపడం చేసి, ఆ సొమ్మును పేదలకు పంచడం ఎంత దారుణమో ఆలోచించాలని, ఆర్థికంగా విజయవంతం కావడం ఒక నేరం అయినట్లు భావించడం ఎంతటి పతనావస్థో అర్థం చేసుకోవాలని వర్మ పేర్కొన్నారు. దొంగిలించబడిన వస్తువులను ఉచితంగా పొందుతున్నారనే ఒకే కారణంతో ఒక నేరస్తుడిని దేవుడిలా కీర్తించడం అజ్ఞానం తప్ప మరొకటి కాదని ఆయన విమర్శించారు.
పైరసీపై..
పైరసీని సమర్థించే వారి “సినిమా ఖరీదైందా? అయితే పైరసీ సమర్థనీయం”, “టికెట్ ధరలు ఎక్కువ? అయితే కంటెంట్‌ను దొంగిలించాలి” అనే వాదనలపైనా ఆర్జీవీ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. “అదే తర్కంతో చూస్తే, ఒక BMW కారు ఖరీదైతే షోరూం దోచుకుని స్లమ్‌లో ఉన్న అందరికీ పంచేయాలి. నగల దుకాణం దోచుకుని ఉచితంగా పంచాలి. ఈ రకమైన ఆలోచన సామాజిక విచ్ఛిన్నానికి దారి తీసి అరాచకానికి దారితీస్తుంది” అని ఆయన హెచ్చరించారు. పైరసీని చూడడానికి వెనుక ఉన్న ప్రధాన కారణాన్ని వర్మ చాలా స్పష్టంగా వివరించారు. “ప్రజలు ఏదో నైతిక విప్లవం కోసం పైరసీ కంటెంట్‌ను చూడడం లేదు. ప్రధానంగా సౌలభ్యం కోసమే చూస్తున్నారు. కొంతమందికి ఇది డబ్బు ఆదా చేస్తుంది, కానీ చాలా మందికి థియేటర్‌కు వెళ్లే సమయాన్ని ఆదా చేస్తుంది” అని ఆయన అన్నారు. “నా లాంటి సినీ పరిశ్రమలోని వ్యక్తులు కూడా ఇదే కారణంతో పైరసీ కంటెంట్‌ను చూస్తారు” అని ఆర్జీవీ అంగీకరించారు.
పరిష్కారం..
పైరసీని నిజంగా ఆపాలనుకుంటే, ఒకే ఒక్క పరిష్కారం ఉందని ఆర్జీవీ సూచించారు. “పైరసీని సరఫరా చేసే సప్లయర్‌ను నేరంగా పరిగణించడంతో పాటు, చూసే వీక్షకుడిని కూడా నేరంగా పరిగణించాలి.” పైరసీ చేసేవారు రహస్యంగా డిజిటల్ మాటున దాక్కుంటారు కాబట్టి వారిని పట్టుకోవడం కష్టం. కానీ చూసే వారిని పట్టుకోవడం సులభం. “పైరసీ కంటెంట్ చూస్తున్న 100 మందిని యాదృచ్ఛికంగా అరెస్టు చేసి, వారి పేర్లను బహిరంగంగా ప్రకటించాలి” అని ఆయన సలహా ఇచ్చారు. “అప్పుడు అందరూ సినిమా లింక్‌ను చూడడం లేదా ఫార్వార్డ్ చేయడం అనేది దొంగిలించబడిన వస్తువులను స్వీకరించడం లేదా స్మగ్లింగ్‌తో సమానం అని గ్రహిస్తారు. భయం పనిచేస్తుంది. ఇది నైతికత కాదు” అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్‌ను ముగించారు.
ROBIN HOOD RAVI
Piracy will never stop. Not because technology is too advanced or policing too weak , but because as long as there are a large number of people to watch a pirated film there will always be Ravis to serve them.
Now the funniest thing is Ravi supporters proudly…
— Ram Gopal Varma (@RGVzoomin) November 22, 2025
