Ram Gopal Varma: దర్శక సంచలనం, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద, ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్‌గా పేరొందిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈసారి కెమెరా వెనుక కాదు, కెమెరా ముందుకొచ్చి ప్రేక్షకులను అబ్బురపరచడానికి సిద్ధమవుతున్నారు. ‘శివ’ (Shiva) సినిమా టైమ్‌లో రామ్ గోపాల్ వర్మ అంటే ఓ హిస్టరీ. ఈ మధ్యకాలంలో ఆయన చేయన సినిమాలతో తనకున్న క్రియేటివ్ డైరెక్టర్ పేరు మొత్తం పోగొట్టుకున్నారు. ఇటీవల ‘శివ’ రీ రిలీజ్ టైమ్‌లో త్వరలోనే నేనంటే ఏంటో చూపిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ మాటలకు అర్థం ఇదే అనేలా.. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘షో మ్యాన్’ (Showman) ఫస్ట్ లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీనికి ట్యాగ్ లైన్ ‘మ్యాడ్ మాన్‌స్టర్’ (Mad Monster). ఈ టైటిల్, ట్యాగ్ లైన్ వినగానే, వర్మ తన నిజ జీవితంలో కనిపించే ‘షో మ్యాన్’ కోణాన్ని, తనలోని ‘మ్యాడ్ మాన్‌స్టర్’ రూపాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారనే భావన కలుగుతోంది.
Also Read- Bigg Boss Telugu 9: ‘కట్టు! నిలబెట్టు’.. ఆరో యుద్ధం మొదలైంది.. కన్నింగ్ రీతూకి కరెక్ట్ టాస్క్!
వర్మకు పోటీగా సుమన్..
ఈ చిత్రంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సుప్రసిద్ధ నటుడు సుమన్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. గతంలో సుమన్, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘శివాజీ’ చిత్రంలో విలన్‌గా నటించి ఎంతటి సంచలనం సృష్టించారో సినీ ప్రియులందరికీ తెలిసిందే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకు ధీటుగా సుమన్ విలనీ పండించడం, ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య నడిచే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయని తెలుస్తోంది. ‘షో మ్యాన్’ చిత్ర విషయానికి వస్తే.. ఈ చిత్రంతో నూతన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నూతన్ చూసుకుంటున్నారు. ఆర్జీవీతో ఇంతకుముందు ‘ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2’ వంటి చిత్రాలను నిర్మించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్న ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై, ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి, ప్రొడక్షన్ 120గా ఈ భారీ ప్రాజెక్టును ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో..
రామ్ గోపాల్ వర్మకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ విషయం మేకర్స్ విడుదల చేసిన పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తోంది. ఆర్జీవీ మార్క్ గ్యాంగ్‌స్టర్ కథాంశాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఈ చిత్రం కూడా అదే కోవలో ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తాజాగా అందించిన సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ ఇటీవల సైలెంట్‌గా ప్రారంభమై, శరవేగంగా జరుగుతోంది. అంతేకాకుండా, ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూసే విధంగా సంక్రాంతికి ‘షో మ్యాన్’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్జీవీ నటన, సుమన్ విలనీ, నూతన్ విజన్… వీటన్నింటి కలయికలో రాబోతున్న ఈ ‘మ్యాడ్ మాన్‌స్టర్’ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనడంలో అతిశయోక్తి ఉండదేమో..
ఆసక్తికరంగా రియాక్టైన వర్మ
ఇదిలా ఉంటే.. ఈ న్యూస్ ఫేక్ అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించడం విశేషం. అయితే ఇది కావాలని ఆయన ప్రచారం కోసం చేసిన పోస్ట్‌లా అనిపిస్తుంది. ఈ పోస్టర్స్ ఏఐతో చేశారని చెబుతున్న వర్మ.. ‘ఏ, ఐ’కి పెట్టిన దూరం ఆ విషయాన్ని తెలియజేస్తుంది. మొదటి నుంచి వర్మది నెగిటివ్ మెంటాలిటీ కాబట్టి.. అందుకే ఇలా నెగిటివ్‌గా రియాక్టై ఉంటారని నెటిజన్లు అనుకుంటూ ఉండటం విశేషం. ఈ సినిమాకు ఈ విధంగా కూడా వర్మ ప్రచారం కల్పిస్తున్నారు.
This is FAKE NEWS done by A I pic.twitter.com/51xaNxMD1Q
— Ram Gopal Varma (@RGVzoomin) December 5, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

