Rajinikanth- Kamal Haasan: ‘కూలీ’ విజయం తర్వాత రజనీకాంత్ ఏం చెయ్యబోతున్నారు అనేది భారతీయ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి సమాధానం దొరికిందనే చెప్పాలి. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఓ ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో సినిమా రాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిని బలపరుస్తూ కమల్ హాసన్ ఓ హింట్ ఇచ్చారు. దీంతో రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ సినిమా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది! ఇది తమిళ సినిమా పరిశ్రమలో ఒక చారిత్రక క్షణం. 46 సంవత్సరాల తర్వాత ఈ రెండు లెజెండరీ నటులు మళ్లీ ఒకే స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా SIIMA అవార్డ్స్ 2025లో దుబాయ్‌లో జరిగిన ఈవెంట్‌లో ప్రకటించారు.
Read also-Viral Video: 52 ఏళ్లకు తండ్రి ఎంబీఏ పూర్తి.. కొడుకు ఇచ్చిన సర్ ప్రైజ్ పార్టీకి.. సోషల్ మీడియా షేక్!
SIIMA అవార్డ్స్‌లో హోస్ట్ సతీష్ కమల్ హాసన్ ను ఇదే విషయంపై ఓ ప్రశ్న అడగ్గా.. కమల్ మాట్లాడుతూ, “మేము చాలా కాలంగా కలిసి పని చేయాలని కోరుకున్నాం. మీరు మాకు మధ్య పోటీ ఏర్పరచారు. కానీ మేము పోటీ చేసుకోవడం కాదు. కలిసి పని చేయడానికి అవకాశం. ఇది బిజినెస్ పరంగా సర్ప్రైజ్ కావచ్చు. కానీ మేము దీన్ని చాలా కాలంగా ప్లాన్ చేశాం. ఇప్పుడు జరుగుతోంది, మేము సంతోషిస్తున్నాం” అని అన్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. ఆయన ఇంతకుముందు కమల్‌తో ‘విక్రమ్’ (2022), రజనీకాంత్‌తో ‘కూలీ’ (2025) చేశారు. ఈ కాంబినేషన్ కారణంగా ఈ మూవీ కోలీవుడ్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా మారనుంది.
రజనీకాంత్, కమల్ హాసన్ 1970లలో కె.బాలచందర్ దర్శకత్వంలో నటుడిగా ప్రారంభించారు. వారు కలిసి 21 సినిమాల్లో నటించారు, అవి తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీలో ఉన్నాయి. ‘అపూర్వ రాగాంగల్’, ‘మూండ్రు ముడిచు’, ‘అవర్గల్’, ’16 వయథీనిలే’, ‘నినైతాలే ఇనిక్కుమ్’ (1979). చివరిసారి వారు కలిసి ‘నినైతాలే ఇనిక్కుమ్’లో నటించారు, దాని తర్వాత 46 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. తాజాగా మరో సారి కలిసి నటిస్తున్నారనే వార్తులు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మల్టీస్టారర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జోనర్‌లో ఉండవచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. రెండు మంది ముఖ్యమైన గ్యాంగ్‌స్టర్లుగా కనిపించవచ్చు. కోవిడ్ సమయంలో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ అయింది కానీ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ అవుతోంది. ఈ సినిమాకు రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (కమల్ యొక్క ప్రొడక్షన్ హౌస్) ప్రొడ్యూస్ చేయవచ్చుని తెలుస్టోంది.