Rajasekhar: టాలీవుడ్ యాంగ్రీమ్యాన్‌గా పేరొందిన అగ్ర నటుడు డా. రాజశేఖర్ (Angry Man Dr Rajasekhar) తాజాగా ఒక సినిమా షూటింగ్‌లో గాయపడటం సినీ వర్గాల్లో ఆందోళన కలిగించింది. తన తాజా చిత్రం చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఆయన కాలికి తీవ్రంగా గాయం కావడంతో, వెంటనే స్పందించిన చిత్ర బృందం ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు కాలికి శస్త్రచికిత్స నిర్వహించినట్లుగా తెలుస్తోంది. రాజశేఖర్ ప్రస్తుతం తమిళంలో ఘన విజయం సాధించిన ‘లబ్బర్ పందు’ (Lubber Pandhu) చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌లోనే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఆయనకు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. గాయం తీవ్రంగా ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స చేయక తప్పలేదు. ఈ వార్త తెలియగానే, అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్
చిత్ర యూనిట్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, రాజశేఖర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ఆయన త్వరలోనే సెట్స్‌కు తిరిగి వస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. అయితే, కాలికి గాయం, శస్త్రచికిత్స కారణంగా, డాక్టర్ల సలహా మేరకు ఆయనకు కొంతకాలం విశ్రాంతి అవసరం కావడంతో, ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారని తెలుస్తోంది. చాలాకాలం విరామం తర్వాత రాజశేఖర్ మళ్లీ వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంవత్సరం ఆయన తిరిగి పూర్వ వైభవం సాధించేందుకు కృషి చేస్తుండగా, ఈ గాయం వలన షూటింగ్‌కు బ్రేక్ పడటం కొంత నిరాశ కలిగించే విషయం.
Also Read- Bandi Saroj Kumar: కొంచమైనా బాధ్యత ఉండాలిగా.. ‘అఖండ 2’ నిర్మాతలపై ‘మోగ్లీ’ విలన్ ఫైర్!
చేతిలో ఉన్న సినిమాలివే..
ప్రస్తుతం ఆయన చేతిలో ‘లబ్బర్ పందు’ రీమేక్‌తో పాటు, మరొక కీలక ప్రాజెక్టు కూడా ఉంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో రాజశేఖర్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ‘బైకర్’ విడుదల కాకముందే, కొత్త చిత్రం సెట్‌లో ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం. రాజశేఖర్ త్వరగా కోలుకుని, తనదైన యాక్షన్ మార్క్‌తో ప్రేక్షకులను అలరించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల జరిగిన ‘బైకర్’ (Biker Movie) ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో రాజశేఖర్ కనిపించారు. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్ర చాలా బాగుంటుందని, తప్పకుండా అందరూ ఈ సినిమాను చూడాలని ఆయన కోరారు. ముందుగా కథ తెలిసి ఉంటే.. హీరో పాత్ర తనే చేసేవాడినని కూడా ఆయన చెప్పడం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

