Raashii Khanna: రాశీ ఖన్నా కొంత గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు చూస్తోంది. ఈ క్రమంలో ఆమె నటిస్తున్న ‘తెలుసు కదా’ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా ఒక హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ‘తెలుసు కదా’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలలో ఇద్దరేసి హీరోయిన్లు నటిస్తుండగా, అందులో ఒక భామగా రాశీ ఖన్నా చేస్తుంది. ‘తెలుసు కదా’ (Telusu Kada) సినిమాలో కెజియఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఓ హీరోయిన్ అయితే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ పాత్రను పోషిస్తుంది. ఈ రెండు సినిమాలు కనుక హిట్ అయితే.. మళ్లీ రాశీ ఖన్నాకు టాలీవుడ్‌లో పూర్వ వైభవం లభించే అవకాశం ఉంది. తాజాగా ఆమె ‘తెలుసు కదా’ సినిమాకు సంబంధించి ఓ ఎమోషనల్ నోట్‌ను విడుదల చేశారు. అందులో..
Also Read- Trisha: విజయ్ పొలిటికల్ పార్టీపై త్రిష ఆసక్తికర కామెంట్స్.. ఏదో తేడాగా ఉందేంటి?
ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా..
‘తెలుసు కదా’ జర్నీ గురించి రాశీ ఖన్నా (Raashii Khanna) చెప్పుకొచ్చింది. ‘‘కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా మరిచిపోలేని విధంగా కొన్ని కథలు ఉంటాయి. ‘తెలుసు కదా’ అలాంటి కథల్లో ఒకటి. ఎన్నో అద్భుతమైన అనుభవాలన్నీ కలగలిసిన జర్నీ ఇది. ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన అద్భుతమైన టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు. మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు (ప్రేక్షకులు) అడుగుపెట్టే రోజుకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇది అందరికీ ఒక గొప్ప రైడ్‌గా ఉంటుంది’’ అని రాశీ ఖన్నా తెలిపింది. ప్రస్తుతం ‘తెలుసు కదా’ సినిమాకు సంబంధించి రాశీ ఖన్నా పార్ట్ షూటింగ్ పూర్తయింది. అందుకే ఇలా ఎమోషనల్ నోట్‌తో ఆమె తన షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం రాశీ ఖన్నా చేసిన ఈ పోస్ట్ సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.
‘తెలుసు కదా’ వివరాలివే..
‘డీజే టిల్లు’ సిరీస్ చిత్రాల ఫేమ్, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Star Boy Siddu Jonnalagadda) హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన (Neeraja Kona) దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘మల్లికా గంధ’ ఇంకా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు