Dasari Kiran Arrest: దాసరి కిరణ్.. ఒకప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. అలాంటి దాసరి కిరణ్ (Dasari Kiran).. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో.. అప్పుడే ప్లేట్ తిప్పేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాత ‘వ్యూహం’, ‘జీనియస్’, ‘వంగవీటి’ వంటి చిత్రాలను నిర్మించారు. ఇందులో ‘వంగవీటి’, ‘వ్యూహం’ చిత్రాలు ఎటువంటి కాంట్రవర్సీని క్రియేట్ చేశాయో తెలియంది కాదు. మరీ ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘వ్యూహం’ (Vyuham Movie) కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. రాజకీయంగా తను ఎదగడం కోసం, అధికారంలో ఉన్న నాయకుడి మెప్పు కోసం.. ఒక వర్గాన్ని కించపరిచేలా ఆ సినిమాను రూపొందించిన దాసరి కిరణ్‌కు ఆ తర్వాత ఏం దక్కాలో అది దక్కింది. టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్‌ను జగన్ ప్రభుత్వం నియమించింది. అలాంటి దాసరి కిరణ్ కుమార్‌ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారంటే న్యూస్ కాకుండా ఎలా ఉంటుంది? అసలు విషయం ఏమిటంటే..
దాసరి కిరణ్ కుమార్‌ను విజయవాడలోని పటమట పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దాసరి కిరణ్‌కు సన్నిహిత బంధువైన గాజుల మహేశ్.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజుల మహేశ్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతుంటారని, రెండేళ్ల క్రితం కిరణ్ తన వద్ద నుండి దాదాపు రూ. 4.5 కోట్లు తీసుకున్నారని, అప్పటి నుండి ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ నెల 18న గాజుల మహేశ్ తన భార్యతో కలిసి విజయవాడలో ఉన్న కిరణ్ కార్యాలయానికి వెళ్లి డబ్బు అడగగా.., కిరణ్‌తో పాటు అతని అనుచరులు సుమారు 15 మంది తమపై దాడి చేశారని మహేశ్ దంపతులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి దాసరి కిరణ్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
Also Read- Venu Swamy: వేణు స్వామికి ఘోర అవమానం.. ఆ గుడి పూజారులు బయటకు నెట్టేశారు
అనంతరం పోలీసులు దాసరి కిరణ్‌ను హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించారు. ‘వ్యూహం’ సినిమా నిర్మాణంతో సంబంధం లేని వ్యక్తిగత ఆర్థిక వివాదాల కారణంగా ఈ అరెస్ట్ జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ అరెస్ట్ అనంతరం సోషల్ మీడియాలో కొందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం. ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో వీళ్లంతా చేసిన పనులను తలచుకుని, కర్మ ఒకటి ఉంటుందని, అది వెంటాడుతుందనేలా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. ఎప్పుడో తీసిన సినిమాను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఏపీలో పవర్ మిస్ యూజ్ అవుతుంది? అంటూ వైసీపీ సానుభూతి పరులు కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. అయితే ఇది ఆ సినిమాకు సంబంధించి జరిగిన అరెస్ట్ కాదని, పోలీసులు వివరణ ఇస్తున్నారు.
వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్
హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీలోని పటమట పోలీసులు
దాసరి కిరణ్ ని విజయవాడ తరలిస్తున్న పోలీసులు pic.twitter.com/KdfHNE9f2Z
— ChotaNews App (@ChotaNewsApp) August 20, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు