Prakash Raj: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోమారు రెచ్చిపోయారు. ఇటీవల హిందీ భాషపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మన మాతృ భాష అమ్మ అయితే.. హిందీ భాష పెద్దమ్మ అంటూ పవన్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ.. అర్ధరాత్రి ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. దానికి ప్రకాశ్ రాజ్ పెట్టిన క్యాప్షన్.. మరోమారు చర్చకు దారి తీస్తోంది.
అర్ధరాత్రి ప్రకాశ్ రాజ్ పోస్ట్
నటుడు ప్రకాశ్ రాజ్.. గత కొన్ని రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీ అంశంలోనూ పలుమార్లు పవన్ ను ప్రశ్నిస్తూ నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే హిందీపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రకాశ్ గట్టి కౌంటరే ఇచ్చారు. ‘ఈ range కి అమ్ముకోవడమా.. ఛి…ఛీ..’ అంటూ పవన్ మాట్లాడిన హిందీ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. చివరిలో తన జస్ట్ ఆస్కింగ్ (#justasking) అనే హ్యాష్ ట్యాగ్ ను సైతం జోడించారు. అయితే ప్రకాశ్ రాజ్ తొలి నుంచి బీజేపీ వ్యతిరేక విధానాలను అలవంభిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హిందీని రాజ్యభాష చేయాలన్న బీజేపీ అధినాయకత్వం అభిప్రాయాలను ఆయన తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తాజాగా పవన్.. బీజేపీ విధానానికి అనుకూలంగా స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ మరోమారు ఆయన్ను టార్గెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking https://t.co/Fv9iIU6PFj
— Prakash Raj (@prakashraaj) July 11, 2025
జనసైనికులు ఫైర్
జనసేనానిపై ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్టుపై పవన్ ఫ్యాన్స్, జనసైనికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ పై విరుచుకుపడుతున్నారు. ‘మీరు చెబుతున్నట్లే ఇతర భాషలను ద్వేషించుకుంటూ పోతే ఇన్ని సినిమాలు చేసేవారా? ఇంత సంపాదించేవారా?’ అంటూ ప్రకాశ్ రాజ్ ను ఓ నెటిజన్ ప్రశ్నించాడు. మీ ప్రొఫైల్ నేమ్ ఫొటో హిందీలోనే ఉంది కదా అంటూ మరో వ్యక్తి సెటైర్ వేశారు. ప్రకాశ్ రాజ్ దేశ ద్రోహిలా ఆలోచిస్తున్నారంటూ మరొకరు మండిపడ్డారు. ‘మీరు హిందీ నేర్చుకొని.. సినిమాలు చేసుకుంటూ సంపాదిస్తారు. వేరే వాళ్లను మాత్రం నేర్చుకోకూడదని అంటారు’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఇంతగా విమర్శిస్తున్న ప్రకాశ్ రాజ్.. ఏనాడైనా ఆయన చేస్తున్న మంచి గురించి ప్రస్తావించారా అంటూ నిలదీస్తున్నారు.
Also Read: Mahesh Kumar Goud: కాంగ్రెస్ చేసిన పనికి కల్వకుంట్ల కవిత రంగులు
హిందీ భాష గురించి పవన్ ఏమన్నారంటే?
హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాష విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకలకు పవన్ కళ్యాణ్ ఇటీవల హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ హిందీని రాజ్య భాషగా అభివర్ణించారు. దేశంలోని వివిధ సంస్కృతులను, భాషలను కలిపే ఒక కామన్ థ్రెడ్‌గా హిందీని పేర్కొన్నారు. హిందీ మనది అనడంలో సిగ్గు ఎందుకు? అని ప్రశ్నించారు. ‘హిందీని ప్రేమిద్దాం, మనదిగా భావిద్దాం’ అని పిలుపునిచ్చారు. హిందీని నేర్చుకోవడం ద్వారా భారతీయులు మరింత బలపడతారని ఇది జాతీయ సమైక్యతకు దోహదపడుతుందని పవన్ అన్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భారతీయ భాషలను మాతృభాషలుగా గౌరవించాలని అలాగే హిందీని ‘పెద్దమ్మ’ భాషగా భావించాలని సూచించారు.