Prabhas vs Vijay: టాలీవుడ్‌లో ఇప్పుడో కొత్త వివాదం మొదలైంది. కొత్తది అంటే కొత్తదేం కాదులే కానీ, ఎప్పుడూ ఉండేదే. కాకపోతే సంక్రాంతి కావడంతో మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు చాలా సినిమాలు సిద్ధమయ్యాయి. దాదాపు 7 సినిమాల వరకు విడుదల కాబోతున్నాయి. అందులో ముందుగా జనవరి 9వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా పాన్ ఇండియా లెవల్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రభాస్‌కు పోటీగా అదే రోజు కోలీవుడ్‌లో విజయ్ (Vijay) ఆఖరి చిత్రంగా చెప్పుకుంటున్న ‘జననాయగన్’ (Jana Nayagan) మూవీ కూడా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. సంక్రాంతి కంటే ముందే వస్తున్న ఈ రెండు సినిమాల మధ్య ఇప్పుడు భారీ పోటీ నెలకొంది. రెండూ పాన్ ఇండియా సినిమాలే. పాన్ ఇండియా స్థాయిలో ఇద్దరు హీరోలకు మంచి క్రేజ్ ఉంది. కానీ, ‘ది రాజా సాబ్’ మూవీకే ఇప్పుడు కష్టం వచ్చి పడింది.
Also Read- MSG Trailer: మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ ఎలా ఉందంటే..?
ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
కోలీవుడ్‌లో ‘ది రాజా సాబ్’కు అసలు థియేటర్లే ఇవ్వకుండా, అన్నీ ‘జననాయగన్’కే బుక్ చేస్తున్నారట అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడదే టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. హాట్ టాపిక్ కాదు, పెద్ద వివాదమై కూర్చుంది. ‘బాహుబలి’ సినిమాకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే పెద్దగా గుర్తింపు లేదు. బాహుబలి తర్వాత టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. ప్రతి సినీ ఇండస్ట్రీ కుళ్లుకునేలా ఇక్కడ సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ని కాదని, ‘జననాయకుడు’ చిత్రానికి టాలీవుడ్‌లో థియేటర్లు భారీగా ఇస్తున్నారట. ఇదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పిస్తుంది. ప్రభాస్, విజయ్.. ఇద్దరి క్రేజ్ గురించి సందేహాలు అవసరం లేదు. కానీ, తెలుగు సినిమాకు కోలీవుడ్‌లో థియేటర్స్ ఇవ్వనప్పుడు.. కోలీవుడ్ సినిమాకు టాలీవుడ్‌లో ఎందుకు థియేటర్స్ ఇస్తున్నారంటూ పెద్ద వివాదమే మొదలైంది. గతంలో కూడా విజయ్ ‘వారిసు’ సినిమా విషయంలో ఇలాంటి వివాదమే నెలకొంది. అప్పుడు దిల్ రాజు ఎక్కువగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే వారు కాబట్టి.. సమస్యను ఏదో విధంగా సాల్వ్ చేశారు. కానీ, ఈసారి టాలీవుడ్‌లో కూడా డిస్ట్రిబ్యూటర్స్‌గా టాప్ బ్యానర్లకు చెందిన నిర్మాతలే ఉన్నారు. దీంతో ఈ వివాదం అంత ఈజీగా తెగేలా అయితే లేదు.
Also Read- DSP Recreates: ‘దేఖలేంగే సాలా’ పాట రీ క్రియేషన్‌తో ఊపేస్తున్న రాక్‌స్టార్.. ఏమాత్రం తగ్గలేదు..
సమన్యాయం ఉండాలిగా..
వాస్తవానికి టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇదే విషయంపై ఎప్పటి నుంచో తన వాయిస్ వినిపిస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కోలీవుడ్‌లో సినిమాలుంటే, టాలీవుడ్‌కు చెందిన సినిమాలను అసలక్కడ పట్టించుకోరు. కానీ, అదే టైమ్‌లో మన సినిమాలున్నా కానీ, తమిళ్ సినిమాను తీసుకొచ్చి ఆడిస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఉంటే, గింటే సమన్యాయం ఉండాలి.. లేదంటే అసలు ఉండకూడదు. అక్కడ ప్రభాస్ సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా, ఇక్కడ విజయ్ సినిమాను ఎలా విడుదల చేస్తారో చూస్తామంటూ, ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చే స్థాయిలో ఈ వివాదం నడుస్తోంది. దీనిపై ఇప్పటికైనా పెద్దలు కలగజేసుకోవాల్సిన అవసరముంది. అలా కాదంటే మాత్రం, ప్రభాస్ ఫ్యాన్స్ ఏమైనా చేయవచ్చు. ఎందుకంటే, తమ హీరో సినిమా అప్డేట్ ఇవ్వలేదని ‘రాధేశ్యామ్’ విషయంలో వారు ఎలా ప్రవర్తించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి.. ఈ వివాదం ఎలా ఓ కొలిక్కి వస్తుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

