People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిక్కుల్లో పడింది. వరుస సినిమాలతో టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకెళుతోన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమా నిర్మాణాలను చేపట్టి సంస్థను విస్తరిస్తూ వస్తుంది. ఎన్నారై, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చిత్ర నిర్మాణంపై ఉన్న ఇష్టంతో ఈ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌లో 100 సినిమాలను నిర్మించాలనేదే ఆయన కలగా చెబుతూ వస్తున్నారు. మంచి సంకల్పంతో ప్రారంభమైన ఈ సంస్థ, మొదట్లో ఎటువంటి వివాదాలు లేకుండా విజయవంతమైన చిత్రాలతో భారీ సంస్థగా మారింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ సంస్థకు అస్సలు కలిసి రావడం లేదు. కొన్ని కాంబినేషన్‌ల కోసమని, అలాగే ఇండస్ట్రీలో ఆగిపోయిన చిత్రాలకు సహకారమని, వీటితో పాటు దర్శకులకు ఇచ్చిన స్వేచ్ఛతో ఈ సంస్థ నష్టాల బాట పట్టింది. 2024 సంవత్సరంలో ఈ సంస్థ వందల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా అంగీకరించాడు. అయినా కూడా, తన కలను సాకారం చేసుకునేందుకు ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నా, ఇప్పుడీ సంస్థ చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకుని, పోరాటం చేయాల్సిన పరిస్థితికి చేరుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
గోపీచంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వం’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మాతగా మొదలైన ఈ సినిమా సగం చిత్రీకరణ అనంతరం ఆర్థిక సమస్యలకు గురైంది. ఆ సమయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ను చేతుల్లోకి తీసుకుంది. సినిమా విడుదల తర్వాత తను అందించిన ఆర్థిక సహకారాన్ని తిరిగి పొందేలా ఒప్పందం కుదుర్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అసలా సినిమా ఎంత రాబట్టింది? అలాగే ఓటీటీలో పే పర్ వ్యూ ప్రాతిపదిక విడుదలై కొన్ని వారాల పాటు ట్రెండ్ అయిన ఈ సినిమాకు ఓటీటీ డీల్ ఎంత? అనే వివరాలను అసలు నిర్మాతకు చెప్పకపోవడంతో, ‘విశ్వం’ చిత్ర మొదటి నిర్మాత వేణు దోనేపూడి చట్టపరంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఇప్పటికే నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన వేణు.. తన సమస్య పరిష్కారం అయ్యే వరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమాల విడుదలను ఆపేయాలంటూ కోర్టును ఆశ్రయించినట్లుగా సమాచారం.

మరోవైపు ‘విశ్వం’ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులతో పాటు, ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రూపుదిద్దుకుంటున్న చిత్రాలకు పనిచేస్తున్న రోజువారీ వేతన కార్మికులకు సైతం బకాయిలు చెల్లించడం లేదనేలా ఈ నిర్మాణ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘విశ్వం’ సినిమాకు సంబంధించి దర్శకుడు, సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, రైటర్‌లకు ఇంకా సగానికిపైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, అలాగే, ప్రస్తుతం ఆ సంస్థలోని సినిమాలకు పని చేస్తున్న రోజువారీ వేతన కార్మికులకైనా చెల్లింపులు జరిపి ఉంటే బాగుండేదనేలా టాలీవుడ్ భావిస్తోంది. ఇప్పటికైనా నిర్మాత విశ్వప్రసాద్ జరిగిన నష్టాన్ని గ్రహించి, వీలైనంత త్వరగా బకాయిలను చెల్లిస్తారని అంతా ఆశిస్తున్నారు. అది జరగలేదంటే, ఇప్పటి వరకు ఈ సంస్థకు ఉన్న పేరు ప్రఖ్యాతులు మొత్తం తుడుచుకుపోవడం కాయమనేలా, ఈ సంస్థ గురించి తెలిసిన వారంతా మాట్లాడుకుంటుండటం విశేషం. ఏదిఏమైనా, కొందరిని అతిగా నమ్మడం వల్ల తన ప్రమేయం లేకపోయినా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోవాల్సి వచ్చిందనేది మాత్రం నిజం.
ఇవి కూడా చదవండి: