Hari Hara Veera Mallu: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో అనూహ్యంగా మరోసారి వాయిదా పడింది. మూడు రోజుల క్రితం మేకర్స్ ‘స్వల్ప వాయిదా’ అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. స్వల్ప వాయిదా అని చెప్పారు కానీ, విడుదల తేదీ ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కొందరు ఫేక్ రాయుళ్లు వారిష్టం వచ్చినట్లుగా డేట్స్‌ని ఫిక్స్ చేసి సోషల్ మాధ్యమాలలో రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. అలాంటి పోస్టర్ ఒకటి సోమవారం సోషల్ మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ పోస్టర్ ప్రకారం ‘హరి హర వీరమల్లు’ న్యూ రిలీజ్ డేట్ జూన్ 26 అంటూ అంతటా వార్తలు కూడా వచ్చేశాయి. దీంతో ఒక్కసారిగా టీమ్ షాకయింది.
Also Read- Jr NTR: ‘వార్ 2’లో ఎన్టీఆర్‌ను ఎలా చూపించామంటే.. కాస్ట్యూమ్ డిజైనర్ ఎలివేషన్ అదుర్స్!
సోషల్ మీడియా వేదికగా మరోసారి వివరణ ఇచ్చింది టీమ్. ‘‘సోషల్ మీడియాలో, అలాగే మీడియా మాధ్యమాలలో ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ ఫిక్స్ అంటూ వస్తున్న వార్తలు నిజం కావు. మేము ఇంకా అధికారికంగా ఎటువంటి విడుదల తేదీని ప్రకటించలేదు. దయచేసి మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు. ఒక్కసారి విడుదల తేదీ ఫిక్స్ అయిన తర్వాతే మేమే అధికారికంగా ప్రకటిస్తాము. అప్పటి వరకు ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దు’’ అని చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా ఓ మెసేజ్‌ని విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ మరోసారి డిజప్పాయింట్ అయ్యారు. జూన్ 12కి సిద్ధమైన వారంతా, మేకర్స్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఇంకా ఫిక్స్ కాలేదు అంటూ మేకర్స్ ఇలా వివరణ ఇవ్వడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దయచేసి ‘హరి హర వీరమల్లు’ సినిమాను ‘ఓజీ’ తర్వాత విడుదల చేసుకోండి. అప్పటి వరకు ఈ సినిమాను వార్తలలోకి రానివ్వకుండా చూసుకోండి.. అంటూ చిత్రయూనిట్‌కు ఉచిత సలహాలిస్తున్నారు.
Also Read- Gaddar Film Awards: ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’.. షీల్డ్ చూశారా!
ఇక ఇటీవల ‘హరి హర వీరమల్లు’ విడుదల అనగానే థియేటర్ల బంద్ అంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఓ సమస్యను లేవనెత్తారని.. ఏపీ గవర్నమెంట్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. విషయం తెలియకుండా, కేవలం పవన్ కళ్యాణ్ సినిమాను ఆపాలని చేస్తున్న కుట్రగా చిత్రీకరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి నెలకొందంటే.. విషయం ఎంత వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఆ గొడవ కాస్త సద్దుమణిగి, అంతా క్లియర్ అవుతున్న టైమ్‌లో పవన్ కళ్యాణ్ సినిమా మరోసారి వాయిదా అనగానే.. వారు కూడా ఎదురుదాడికి సిద్ధమయ్యారు. ఈ గందరగోళంలో ఫ్యాన్స్ భారీగా డిజప్పాయింట్ అవుతున్నారు. అసలే సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని నిర్మాతలు గగ్గోలు పెడుతుంటే.. ఇలాంటి పరిణామాలు మరింతగా వారిపై ప్రభావం చూపుతాయని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం విశేషం.
నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు